సౌతిండియన్ హీరో అంటే మజాకా..? పుష్ప సినిమాలో ఓ మామూలు కలప దుంగల కూలీ ఓ బడా స్మగ్లర్లాగా ఎదిగినట్టు… మన హీరోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నేరగాళ్లు… మనవాళ్లది ఇప్పుడు పాన్ ఇండియా స్టేటస్ కూడా కాదు, ఆ రేంజ్ దాటేశారు… ఇప్పుడంతా పాన్ వరల్డ్ రేంజ్… కేజీఎఫ్-2లో చూపించినట్టు ఇతర దేశాల ప్రత్యేక బలగాలు కూడా వెంటాడుతుంటాయి… మీకేమైనా డౌటుందా..? అయితే ఓసారి కే3-కోటికొక్కడు అనే సినిమా చూడండి… పిచ్చి క్లారిటీ వచ్చేస్తుంది మీకు…
ఈ సినిమా ఎక్కడిది, ఎప్పటిది, ఎవరిది, వచ్చిందా అంటూ… అదుగో మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేయకండి… నిజమే, కన్నడ ఇండస్ట్రీ చాలా ఏళ్లు అంటీముట్టనట్టుగా గిరిగీసుకుని బతికింది కాబట్టి ఆ నటులు, దర్శకులు మనకు పెద్దగా తెలియదు… ఇప్పుడిప్పుడే అదీ జనజీవన స్రవంతిలో కలిసి, పాన్ ఇండియా కలెక్షన్లకు మరిగింది… దాంతో మనకు ‘ఈగ’ సినిమా ద్వారా కాస్త పరిచయమున్న కిచ్చా సుదీప సినిమాల్ని కూడా మన మీదకు వదులుతున్నారు… ఇదీ అలాంటి బాపతే…
ఈగ గాకుండా ఏమున్నయ్..? బాహుబలిలో ఓ సైడ్ కేరక్టర్… తెలుగులోకి డబ్ అయిన మలయాళీ మరక్కర్లో ఓ పాత్ర… చాలదా ఏం..? అందుకే విక్రాంత్ రోణ అనే సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు… ఇప్పుడందరి సినిమాలూ పాన్ ఇండియా కదా… పనిలోపనిగా మళ్లీ సుదీప గ్యాంగుకు మరో ఆలోచన వచ్చింది… అంతే ఇక, ఆచరణలోకి తీసుకొచ్చి, మరో సినిమాను తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలేశారు…
Ads
బాషా సినిమా బేస్‌గా అప్పుడెప్పుడో విష్ణువర్దన్ హీరోగా కొటిగొబ్బ అనే సినిమా వచ్చింది… 2001లో అన్నమాట… నిజానికి ఆ పాత సినిమాకు సీరీస్ ఏమీ కాదు, కానీ ఆ సినిమా పేరుతో… కే2-కోటికొక్కడు అంటూ సుదీప హీరోగా, నిత్యామేనన్ హీరోయిన్గా 2016లో ఓ సినిమా తీశారు… దానికి సీక్వెల్ అన్నట్టుగా గత ఏడాది తీసిన కే3 కోటిగొబ్బ అనే సినిమాను ఫ్రెష్షుగా తెలుగులోకి డబ్ చేసి, కే3-కోటికొక్కడు పేరుతో తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలారు… అసలు ఈ కోటిగొబ్బ సీరీస్ ఏమిటో, కే2 ఏమిటో, కే3 ఏమిటో అని తలపట్టుకోకండి… వాళ్లంతే…
పోనీ, ఈ సినిమా ఏమైనా ఇరగదీసేదా అంటే అదీ కాదు… జస్ట్, ఓ సాదాసీదా యాక్షన్ సినిమా… కే2 సినిమాలోని సీన్లే కాస్త లొకేషన్లు మార్చుకుని కనిపిస్తుంటయ్… దేశాలు తిరిగామా, రీళ్లు చుట్టేశామా, జనం మీదకు వదిలామా అన్నట్టుగా..!! సదరు కిచ్చా సుదీపకు ఎవరైనా తెలుగులో ఫ్యాన్లు, ఏసీలు గనుక ఉంటే వాళ్లకు మాత్రమే నచ్చే అవకాశం ఉండవచ్చునేమో… కథ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, కథనం లోకల్ సుల్తాన్ బజార్ స్టాండర్డ్… ఇందులో మడోనా సెబాస్టియన్ ఉంది, జస్ట్, ఉంది… శ్రద్ధా దాస్ కూడా… అవును, ఆమె కూడా ఉంది… ఇతరత్రా నిర్మాణ విలువల గురించి చెప్పుకోవడం కూడా దండుగ… ఈ పాన్ ఇండియా ట్రెండ్, పైత్యం మాటేమిటో గానీ, ప్రతి అడ్డమైన సినిమాను మన మీదకు వదిలేస్తున్నారు… కే3 భిన్నమేమీ కాదు…!!
Share this Article