ప్రభుదేవా… తను స్వతహాగా ఎంత మంచి డాన్సరో… ఇతర హీరోలకు అంత మంచి డాన్స్ కంపోజర్ కూడా..! ఏ హీరోకు ఏ స్టెప్పులు పడాలో, ఏ హీరో వయస్సు ఎంతో, ఏ స్టెప్పులు సులభంగా ఉండాలో, ఎవరు బాగా స్టెప్పులు వేయగలరో తెలిసినవాడు… తన డాన్స్ క్లిక్కయితే దాని రేంజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి రౌడీ బేబీ సాంగ్ చాలు… ఇప్పటికీ అది యూట్యూబ్‌లో టాప్ ఇండియన్ సినిమా సాంగ్… ఇప్పట్లో దాని దగ్గరకు ఎవరూ చేరుకోలేరు… 140 కోట్ల వ్యూస్… అదీ ఒక్క వీడియోకే… అనుబంధ వీడియోలు, అనువాద వీడియోలు కూడా కలిపితే డబుల్…
పెద్దగా కష్టపడే స్టెప్పులేమీ ఉండవు… కానీ రక్తికడుతుంది డాన్స్… అలరిస్తాయి స్టెప్పులు… ఆచార్య డిజాస్టర్ తరువాత గాడ్ ఫాదర్ భవిష్యత్తు మీద చిరంజీవికి చాలా భయసందేహాలున్నయ్… ఓ పాట మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు… థమన్‌తో ఆ పాట ట్యూన్ చేయించాడు, అనంత శ్రీరాంతో ఆ పాట రాయించాడు… శ్రేయో ఘోషాల్‌తో పాడించాడు… ప్రభుదేవాను రప్పించి స్టెప్పులు కంపోజ్ చేయించాడు… గ్రూపు డాన్సర్లను పెట్టాడు… ఆ ఒక్క పాటతో ప్రమోషన్ బొంబాట్ చేయాలని అనుకున్నాడు…
కాకపోతే యూట్యూబ్‌లో గాకుండా స్పాటిఫై మ్యూజిక్ యాప్‌లో రిలీజ్ చేయడం ఎదురుతన్నింది… అదేనండీ థార్ మార్ ఠక్కర్ మార్ పాట… తీరా ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేశారు… చూస్తుంటే ఒక్కసారిగా నిరాశ, నీరసం ఆవహించినట్టయింది… ఆ ట్యూన్లో జోష్ లేదు… అసలు చిరంజీవి పాట అంటే ఎట్లా ఉండాలె..?! థమన్ ఎక్కడ కాపీ కొట్టాడో గానీ, ఒరిజినల్ సోర్స్ ఎంపిక ఓ బ్లండర్… ఏమో, తన పాత ట్యూన్ల నుంచే కాపీ కొట్టాడేమో కూడా…! అందులో పదాలు పొదగడానికి ఫాఫం, అనంతుడు నానా తిప్పలూ పడ్డాడు…
Ads
ఆ మణిరత్నం తీస్తున్న పొన్నియిన్ సెల్వన్ అనువాద పాటల్ని రాస్తున్న తీరే అనంత శ్రీరాం మీద బోలెడు విమర్శలకు కారణమవుతోంది కదా… తాజాగా విడుదలైన జలసఖి అనే పాట కూడా అంతే… అవి తెలుగు పదాలని అర్థమవుతుంది తప్ప, వాటి అర్థమేమిటో అర్థం కాదు… అప్పట్లో శక్తి అనే సినిమాకు మణిశర్మ ఓ పాట ఇచ్చాడు… ప్రేమదేశం యువరాణీ అంటూ… కొద్దిగా ఈ జలసఖి కూడా అలాగే వినిపిస్తుంది అక్కడక్కడా… కాకపోతే మిగతా పాటలకన్నా బెటర్… కార్తి అప్పియరెన్స్ ఓ మైనస్ కాగా…, ఐశ్వర్య లక్ష్మి, బోటు, సముద్ర దృశ్యాలు బాగానే ఉన్నాయి… ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే, థమన్‌కు ఏమైందో ఈమధ్య… తను కూడా దేవిశ్రీప్రసాద్ అవుతున్నాడా..?
ఇక స్టెప్పులు అంటారా..? చిరంజీవి వయస్సు 67… సల్మాన్ ఖాన్ 56… కుర్ర హీరోల్లాగా పడుతూ లేస్తూ స్టెప్పులు వేయలేరు కదా… అందుకని ప్రభుదేవా జాగ్రత్తగా పెద్దగా అలుపూ ఆయాసం లేనివి, పెద్దగా దేహకదలికలు, గెంతులు అక్కర్లేని స్టెప్పులు కంపోజ్ చేశాడు… నిజానికి ‘అమ్మడూ, లెట్స్ డు కుమ్ముడూ’ పాటను కూడా ఇలాగే ఆలోచించి ఆ కంపోజర్ ఎవరో కష్టపడ్డాడు… ప్రభుదేవా దాకా ఎందుకు..? నిజానికి ప్రభుదేవా చేసేదీ అదే కదా… సరే, ఏదో చేతులతో ఛాతీ మీద రాసుకుంటూ, చేతులనే అటూఇటూ తిప్పుతూ ఇద్దరు మెగాస్టార్లు ఏవో స్టెప్పులు అనిపించేశారు…
డానులు వచ్చిండ్రే, డాన్సులు దంచిండ్రే, ఫ్యాన్సకు పండగే… అని అనంత శ్రీరాం ఏదో కుమ్మేశాడు గానీ, అక్కడ వీడియో చూస్తుంటే అంత దృశ్యము లేదు… పైగా గ్రెనేడ్లు, బుల్లెట్లు, తుపాకులే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం ఆ లిరికల్ వీడియోలో… దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో మరి..? కొండలన్నీ పిండిచేసే కండలు సల్మాన్వి అట… గండాలన్నీ దండం పెట్టే గుండె దమ్ము చిరంజీవి సొంతం అట… వీళ్లిద్దరూ కలిసొస్తే టాలీవుడ్, బాలీవుడ్ కథే తారుమారు అట… తుపాకులు ధరించిన మహర్షులట వీళ్లు… ఫాఫం అనంత శ్రీరాం… ఫాఫం థమన్…
Share this Article