Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

nna than case kodu… అదిరిపోయిన ఓ పొలిటికల్ కామెడీ సెటైర్…

September 22, 2022 by M S R

ఎంత మంచి స్టోరీ లైన్ ఉన్నా… దానికి తగ్గ సృజనాత్మకత… పాత్రచిత్రణ.. స్క్రీన్ ప్లే… కథనం… దర్శకత్వం వంటివి లేక కిల్ చేసే కిల్లర్ డైరెక్టర్స్ కొందరైతే… దేన్నైనా స్టోరీ లైన్ గా మల్చుకుని అంతే క్రియేటివిటీతో… సహజ సిద్ధమైన పాత్రలతో… అదీ సమాజాన్ని ఆలోచింపజేసే రీతిలో తెరకెక్కించే ప్రతిభావంతులు మరికొందరు. ఆ కోవకు చెందిన పొలిటికల్ కామెడీ సెటైరే Nna Than Case Kodu.

ఎంతసేపూ రెబల్ తరహా… లేకపోతే నేరుగా డిష్యుమంటే డిష్యుమని తలపడే ఫైటింగ్ సన్నివేశాలతో తీసే మూస సినిమాలేగానీ… సున్నితంగా తగలాల్సిన చోట తగిలేలా వ్యంగ్యాస్త్రాలు సంధించే సినిమాల సంఖ్య చాలా తక్కువేనని చెప్పాల్సుంటుంది. మన సినిమాలకొచ్చేసరికి విద్యావిధానంపై ఓ త్రీ ఇడియట్స్ లాగా… ట్రైబల్ జీవితాలపై ఓ షెర్డిల్.. అదే ట్రైబల్ ఏరియాల్లో ఎన్నికల నిర్వహణ.. మావోలు, పోలీసుల మధ్య గిరిజన బతుకులపై తీసిన ఓ న్యూటన్ లాగా తీసే వ్యంగ్యాస్త్రాల సంఖ్య వేళ్లమీద లెక్కించేవే. ఈ కోవకు చెందిందే అయినా… వాటన్నింటినీ మించి భిన్నంగా కామెడీ పండిస్తూ తెరకెక్కించిందే Nna Than Case Kodu.

గ్లామర్ యాడ్ చేస్తేనేగానీ సినిమాను జనం చూడరనుకునే దర్శక, నిర్మాతల ఆలోచన మార్చే విధంగా జనాదరణ పొందిన సినిమా Nna Than Case Kodu.ఎందుకంటే కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా 25 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఓ చిల్లరదొంగ… ఓ మంత్రి మధ్య కథ… ఆ కథ నడించేందుకు కోర్ట్ ఓ వేదిక… స్థూలంగా ఇదీ సినిమా. ఎక్కడా అశ్లీలత కనిపించదు. వివిధ రకాల పాత్రలు, పాత్రధారులు సరదాగా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేయడం… ఈవెన్ జడ్జ్ నుంచి మొదలుకుంటే ఆటోడ్రైవర్ సురేష్, ఆయన ప్రియురాలైన టీచరమ్మవరకూ… ప్రతీ పాత్రా సరదాగా సాగుతూ నవ్వుకునేలా… అంత సెటైర్ లోనూ మట్టిమనుషుల మధ్యలోనూ ఓ లవ్ ఫీల్ నూ స్పృశిస్తూ… మరోవైపు సిస్టమ్ ని ప్రశ్నించిన సినిమా Nna Than Case Kodu.

Ads

సమాజమన్నప్పుడు సమస్యలు సర్వసాధారణం. అయితే ఆ ప్రజాసమస్యలు తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వాలు మొద్దునిద్దర పోతుంటే మేల్కొల్పే మీడియా కూడా రెండు భాగాలుగా చీలిపోయి… వారు పబ్లిష్ చేసే, ప్రసారం చేసే వార్తాకథనాల్లో ఏది నిజమో… తెలుసుకోలేని స్థితిలో నేటి జనాన్ని నెట్టివేస్తున్నకాలమిది. ఇలాంటి సమయంలో Nna Than Case Kodu లాంటి వ్యంగాస్త్రాలు.. గుడ్డి గుర్రం మైదానంలో ఉరికినట్టు.. తామెదిస్తే అదే వార్త అనుకునే మీడియా ప్రపంచాన్నెంతగా ప్రభావితం చేస్తాయో తెలియదుగానీ… సామాజిక సమస్యను నొప్పించకుండా మెప్పించే రీతిలో సున్నితంగా తెరకెక్కించే తీరు మాత్రం ముమ్మాటికీ జనాన్ని ఆకట్టుకునేదే! అంతకుమించి ఓ చర్చకూ దారి తీసేదే!! అందుకే ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న Nna Than Case Kodu సినిమా ఓ హాట్ టాపిక్.

రోడ్లే మానవ జీవిత ప్రగతి సూచికలుగా చూస్తుంటాం. మనమెంత నాగరికులమవుతున్నామో చెప్పే విషయాల్లో రహదారులదీ కీలకపాత్రే! అలాంటి రోడ్లు ఇవాళ దేశం మొత్తమ్మీద చాలా ప్రాంతాల్లో ఏవిధంగా ఉన్నాయో విశ్లేషించుకున్నాకొద్దీ సిగ్గుపడాల్సి వస్తుంది. అదిగో ఆ సామాజిక సమస్యనే పట్టుకుని రతీష్ బాలకృష్ణన్ పొడువాల్ అనే దర్శకుడు ఎక్కుపెట్టిన బాణమే Nna Than Case Kodu.

ఆండ్రాయిడ్ కుంజప్పన్, అలియెన్ అలియాన్ వంటి సినిమాలతో తన ప్రత్యేకతను ఇప్పటికే చాటుకున్న బాలకృష్ణన్… Nna Than Case Koduలో చర్చించిన సామాజిక అంశం… దాన్ని తెరకెక్కించిన తీరు… ఊళ్లల్లో ఉండే వాతావరణం… కోర్ట్ రూమ్ సీన్స్, జడ్జ్ పాత్ర ఎంపిక… పాత్రలు, పాత్రల చిత్రణ… ఇవన్నీ మిగిలిన ఎన్నో సినిమాలతో భిన్నంగా అనిపిస్తాయి. ఆ శైలే దర్శకుడు బాలకృష్ణన్ ను ప్రస్తుతం గ్లామరైజ్డ్ సినిమా ప్రపంచంతో ఓసారి పోల్చి చూస్తే విభిన్నంగా, మరింత ప్రత్యేకంగా మనకు Nna Than Case Koduతో మరోసారి పరిచయం చేస్తుంది.

దర్శకుడు ఏ విధంగా చెప్పాలనకున్నాడో సినిమా కథను అంతే సహజసిద్ధంగా ప్రెజెంట్ చేసిన తీరు ఓ అద్భుతం కాగా… రాజీవన్ పాత్రలో సినిమాకు హీరో అయిన కుంచాకో బోబన్ పాత్ర మనల్ని సినిమాను రక్తికట్టిస్తుంది. అంతెందుకు ఓ మెజిస్ట్రేట్ గా కున్నికృష్ణన్, ఆటోడ్రైవర్ సురేషన్ పాత్రలో రాజేశ్ మాధవన్ వంటివారు సహజసిద్ధంగా సినిమాను నడిపించే పాత్రల్లో అంతే సహజసిద్ధంగా ఒదిగిపోవడమే… Nna Than Case Kodu ఇప్పుడు భాషలకతీతంగా సినీ అభిమానుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమాను ఎంత సహజంగా చిత్రీకరించారో… అంతే అద్భుతమైన రీతిలో కాస్త విభిన్నమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన డాన్ విన్సెంట్ పనితనం ఈ సినిమాకు ఓ ఎస్సెట్!

చివరగా: తనపై ఈ కేసుకు కారణం అసలు రోడ్లు, భవనాల శాఖా మంత్రని… ఆయనపై కేసు పెట్టాలని హీరో కోర్టులో అన్నప్పుడు… కిందకు జారుతున్న అద్దాల్లోంచి జడ్జ్ చిన్నగా నవ్వుతూ… ఆయన మినిష్టర్… ఆయన్నరెస్ట్ చేయాలంటే క్యాబినెట్ ఆమోదముండాలి తెలుసా అంటాడు. నాలాంటి ఓ దొంగను అరెస్ట్ చేసినప్పుడు మా దొంగల ముఠా ఆమోదం తీసుకున్నారా సార్ అంటూ… అందుకు హీరో కుంచాకో బోబన్ ప్రతిస్పందించే సీన్ సినిమాకు ఓ హైలైట్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions