మొన్నోసారి చెప్పుకున్నాం… కాయదు లోహార్ గురించి… ఎవరీమె అంటారా..? అస్సలు ఇండియన్ సినిమా ఇండియన్ లేడీస్‌గానే గుర్తించని, ప్రోత్సహించని ఈశాన్య రాష్ట్రాల అమ్మాయి, అందులోనూ అస్సామీ సొగసు అని చెప్పుకున్నాం కదా… ఆమె పేరు పలకడానికి అల్లు అర్జున్ అల్లూరి సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో అవస్థలు పడ్డారని కదా చెప్పుకున్నాం… ఈ సినిమా చూడటానికి అంతకన్నా చాలా చాలా అవస్థలు పడాలి…
ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ కాయదు లోహార్ మాత్రమే… ఉన్నంతసేపు తెరమీద ప్లజెంటుగా ఉంది… కానీ ఈ దిక్కుమాలిన పోలీస్ కథలో ఆమె పాత్రకు స్కోప్ తక్కువ… అసలు ఆమెకు నటన వచ్చో లేదో కూడా తెలుసుకునే చాన్స్ లేదు… న్యూజిలాండ్ దిగుమతి చేసుకున్న షెర్లీ సెతియా కాస్త నయం… కృష్ణ వ్రింద విహారిలో ఆమె పాత్రకు కాస్త ప్రాధాన్యమైనా ఉంది… కాయదుకు అదీ లేదు ఫాఫం…
అసలు అల్లు అర్జున్ ప్రిరిలీజ్ ఫంక్షన్లకే పెద్దగా రాడు… అలాంటిది అల్లూరి సినిమా ఫంక్షన్‌కు రావడం, ఎలాగూ వచ్చాడు కాబట్టి మర్యాదకు శ్రీవిష్ణును నాలుగు మాటలు పొగిడి వెళ్లిపోయాడు… నిజానికి ఈ సినిమాకు అంత సీన్ లేదు… అంత సీన్ లేదు కాబట్టే, రివ్యూ ఏం రాయాలో తెలియక ఇలా కాయదు లోహార్ గురించి, అల్లు అర్జున్ గురించి చెప్పుకుంటున్నాం… ఇంకా అర్థం కాలేదా..?
Ads
నిజాయితీ పోలీస్ అంటేనే ఓ ఆడ్ పదం ఈరోజుల్లో… అందరూ రాజకీయ నాయకులను పెద్ద పెద్ద విలన్లుగా చూపిస్తున్నారు గానీ… ఎవరు తక్కువ..? పోలీసులు, బ్యూరోక్రాట్లు, పత్రికాధిపతులు, వ్యాపారులు… సొసైటీలో ఎవరు మినహాయింపు..? పైగా విస్తృత అధికారాలు, ఆయుధాలు కూడా ఉన్న కొందరు పోలీసుల అరాచకాల్ని చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం… అందుకే పోలీసు హీరో పాత్రల చిత్రీకరణ చాలా క్లిష్టం… కొన్ని క్లిక్ కావచ్చుగాక, కానీ అన్నీ హిట్టవుతాయని చెప్పలేం…
అల్లూరి కూడా అంతే… 20 ఏళ్లలో అనేక బదిలీలు ఎదుర్కున్న పోలీస్ పాత్ర ఇది… ప్రత్యర్థి పాత్రలో ఓ రాజకీయ నాయకుడు… సహజమే కదా… తెలుగు సినిమా జాఢ్యమే అది… అయితే ఏదో మాఫియా లేదంటే పొలిటికల్ లీడర్… హీరోతో ఘర్షణ… శ్రీవిష్ణు వంటి కాస్త జీల్, మెరిట్ ఉన్న నటుడు వైవిధ్యం ఉన్న పాత్రల్ని ఎంపిక చేసుకోవచ్చు కదా… ఈ సోది రొటీన్ కథను ఎందుకు ఎంచుకున్నాడో మరి..?
పోనీ, ఆ కథ ట్రీట్‌మెంటైనా సరిగ్గా ఉందా అంటే, అదీ లేదు… గాలి సంపత్, రాజరాజచోర, అర్జునఫల్గుణ, భళాతందనాన… సినిమాలన్నీ ఫసాక్… ఐనా శ్రీవిష్ణుకు చాన్సులు వస్తూనే ఉంటాయి… జాబితాలో అల్లూరి పేరు కూడా రాసేయాల్సిందే… నిజానికి శ్రీవిష్ణు కోణంలో లోపమేమీ లేదు… తన లుక్కు, నటన బాగానే ఉన్నయ్… ఎటొచ్చీ ఆ కథ, ఆ కథనం పెద్దగా ప్రేక్షకుడిని కనెక్ట్ కావు… పాత కథయితే కొత్తగా చెప్పాలి, లేదంటే కొత్త కథ చెప్పాలి అనే బేసిక్ పాయింట్ దర్శకుడికి తెలియదు కావచ్చు బహుశా…
పాటలు ఉన్నాయంటే ఉన్నాయి… మిగతా నటులు చేశామంటే చేశాం అనిపించేశారు… ఎవరికీ పెద్దగా ఇంట్రస్టు లేని సినిమా అన్నట్టుగా తీయబడింది… సినిమా ప్రమోషన్లలో శ్రీవిష్ణు మా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు తెలుసా అన్నాడు… పూర్తి కంట్రాస్టు… బోర్ కొట్టని సీన్ లేదు… వచ్చీపోయే బోలెడు తెలుగు సినిమాల్లో మరొకటి… అంతకుమించి చెప్పడానికి ఏమీలేదు… ఫాఫం కాయదు లోహార్… (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article