పొన్నియిన్ సెల్వన్ దాదాపు రెండువేల పైచిలుకు పేజీలున్న ఐదు భాగాల నవల.అందులో ప్రదేశాలు, పాత్రల పేర్లు అరవ వాసనతో ఉంటాయి. మొదట్లో చాలా గందరగోళంగా ఉంటుంది. సెప్టెంబర్ 30న ఈ సినిమా వస్తోంది కాబట్టి ఈ కథ టూకీగా, గుట్టు విప్పకుండా చెప్పే చిన్న ప్రయత్నం ఇది…
ఒక్క ముక్కలో చెప్పాలంటే చోళ సింహాసనం కోసం జరిగే కుట్ర, చోళవంశాన్ని సమూలంగా నాశనం చేసి పాండ్యరాజ్యాన్ని పునరుద్ధరించాలని చూసే ఒక వర్గం, తన పగ తీర్చుకోవడానికి చోళరాజ్యంలోనే ఉంటూ, చోళరాజ్యం మీద కుట్ర చేసే అందమైన స్త్రీ, అంతర్లీనంగా సాగే రెండు ప్రేమకథలు … ఇదే కథ.
మొదటి పరాంతకుడికి ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు యుద్ధంలో మరణించడంతో రెండవవాడైన గండరాదిత్యుడు సింహాసనం ఎక్కాడు. గండరాదిత్యుడు మరణించేనాటికి అతడికి భార్య శెంబియన్ మహాదేవి, పసిపిల్లవాడైన మధురాంతకుడు ఉన్నారు. ఆయన మరణించేటప్పుడు భార్య చెప్పిన ఒక రహస్యం విని తన కొడుకైన మధురాంతకుడు గద్దెనెక్కకూడదని, తన తమ్ముడైన అరింజయుడు, అతడి సంతానం మాత్రమే చోళసామ్రాజ్యాన్ని పరిపాలించేలా చూడాలని చెప్పి, భార్య దగ్గర మాట తీసుకుని మరణించాడు.
Ads
కథాకాలం నాటికి తంజావూరు రాజధానిగా అరింజయుడి కొడుకైన సుందర చోళుడు చోళసామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ చక్రవర్తిగా ఉంటాడు. అతడి భార్య వాణమహాదేవి, ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్, అరుర్మొళివర్మ (ఇతనినే రాజరాజ చోళుడు అంటారు కాబట్టి మనం కూడా అలాగే పిలుచుకుందాం) మరియు ఒక కుమార్తె కుందవై.
చక్రవర్తి పెద్దమ్మ శెంబియన్ మహాదేవి తన భర్తకిచ్చిన మాటప్రకారం సుందర చోళ చక్రవర్తి తరువాత సామ్రాజ్యాన్ని తన కొడుకైన మధురాంతకుడికి కట్టపెట్టవద్దని పట్టుబట్టి, చక్రవర్తి పెద్దకుమారుడు ఆదిత్య కరికాలన్కి యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తుంది. ఆదిత్య కరికాలన్ తనతో పాటే అంతఃపురంలో పెరుగుతున్న నందిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆదిత్యుడి పెద నానమ్మ శెంబియన్ మహాదేవి దీనికి అడ్డుచెప్పినా లెక్కచేయక ఆదిత్యుడు ఆమెని ప్రేమిస్తాడు. కొన్నాళ్ళకి నందిని అంతఃపురం నుండి మాయమవుతుంది. ఇంతలో ఆదిత్యుడు యుద్ధంలో పాల్గొనాల్సి రావడంతో, యుద్ధం నుండి విజయుడై తిరిగి వచ్చి తన తండ్రి అనుమతితో నందినిని వివాహమాడాలనుకుంటాడు.
ఆ యుద్ధంలో ఆదిత్యుడు పాండ్యరాజుని తరుముతూ వెళ్ళినప్పుడు పాండ్యరాజు ఒక గుడిసెలో తలదాచుకుంటాడు. అది గమనించిన ఆదిత్యుడు ఆ గుడిసెలోకి వెళ్ళేసరికి నందిని పాండ్యరాజుకి సపర్యలు చేస్తూ, పాండ్యరాజుకి ప్రాణభిక్ష పెట్టమని ఆదిత్యుడిని వేడుకుంటుంది. స్వతహాగా ఆవేశపరుడైన ఆదిత్యుడు తాను ప్రేమించిన అమ్మాయి తన శతృవుతో ఉండటం చూసి, పాండ్యరాజు తల ఖండించి, ఆ తలని ఊరేగింపుగా తంజావూరుకి తీసుకుని వెళ్తాడు.
ఇది చూసి పగతో రగిలిన నందిని చోళసామ్రాజ్యానికి వచ్చి, ముసలివాడైన కోశాధికారి (పెద పళువేట్టరయ్యరు)ని తన మోహపు వలలో వేసుకుని ఆయననే పెళ్ళాడి తంజావూరు కోటలోకి ప్రవేశిస్తుంది. చోళ సామ్రాజ్య కోశాధికారిని పెళ్ళాడి తంజావూరు కోటలో ప్రవేశించిన నందిని ముమ్మూర్తులా తాను ఇదివరకు చూసిన మందాకిని అనే స్త్రీ పోలికలతో ఉండటంతో, ఆమెని చూసిన సుందర చోళ చక్రవర్తి అదిరిపడతాడు.
నందిని వివాహ విషయం తెలిసిన ఆదిత్యుడు తంజావూరుని వదిలి కంచిలో ఉంటున్నాడు. తంజావూరులో ఉన్న తన తండ్రి సుందర చోళుడికి, పళైయారైలో ఉన్న తన అక్కకి వీరుడు మరియు చురుకైనవాడైన వంతిదేవుడు అనే దూత ద్వారా కంచి నుండి ఆదిత్యుడు తాళపత్ర సందేశం పంపించడంతో కథ ప్రారంభం…
అదే సమయంలో ఆదిత్యుడి తమ్ముడైన రాజరాజ చోళుడు శ్రీలంకలో యుద్ధం చేస్తున్న చోళసైన్యాలకి నాయకత్వం వహిస్తుంటాడు. చక్రవర్తి ముద్దుల కూతురు కుందవై చోళుల పూర్వ రాజధాని పళైయారై నగరంలో ఉంటోంది. ఆమె చెలికత్తె వాణతి అనే ఆమెకి రాజరాజ చోళుడంటే ఇష్టం. ఈ అమ్మాయి చోళదేశపు సైన్యాధిపతి తమ్ముడి కూతురు.
పట్టపు యువరాజు ఆదిత్యుడు పంపిన దూత తంజావూరు వెళ్తూ మధ్యలో తన స్నేహితుడైన గందమారన్ ఊరైన కడంబూరులో బస చేస్తాడు. తన అన్న గందమారన్ ద్వారా వంతిదేవుడి వీరత్వం గురించి విన్న మణిమేఖల వంతిదేవుడిని మూగగా ఆరాధిస్తుంది. కడంబూరులో ఉన్నప్పుడు వంతిదేవుడికి నిద్రపట్టక బయటకి వచ్చినప్పుడు చోళ సామ్రాజ్య కోశాధికారి, ఇతర సామంతరాజులు కలిసి చోళ సింహాసనం మీద ఆదిత్యుడిని కాదని అతడి బాబాయి మధురాంతకుడిని కూర్చోపెట్టాలని పన్నుతున్న పన్నాగం అతడి చెవిలో పడుతుంది. ఉలిక్కిపడ్డ వంతిదేవుడు తంజావూరు వెళ్ళి చక్రవర్తిని కలిసి ఇదంతా చెప్పాలనుకుంటాడు.
తంజావూరు వెళ్తూ నాటకీయంగా నందినిని కలిసిన వంతిదేవుడు ఆమె ఇచ్చిన రాజముద్ర సహాయంతో కోటలో ప్రవేశించి చక్రవర్తికి అపాయం పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటాడు. కానీ అప్పటికే తమ స్వప్రయోజనాలకోసం వెర్రివాడైన మధురాంతకుడిని చక్రవర్తి చెయ్యాలని పావులు కదుపుతున్న అన్నదమ్ములైన కోశాధికారి (పెద పళువేట్టరయ్యర్), కోటదళపతి (చిన పళువేట్టరయ్యర్) చక్రవర్తిని తమ గుప్పెట్లో ఉంచుకుంటారు. వారి అనుమతి లేనిదే ఎవ్వరూ చక్రవర్తిని కలవలేరు, మాట్లాడలేరు కానీ వంతిదేవుడు తన యుక్తితో చక్రవర్తి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ఇతడి వాలకాన్ని పసికట్టిన కోటదళపతి ఈ దూతని బంధించాలని వేసిన ఎత్తులు విఫలమవుతాయి.
కోటదళపతి తనని బంధించడానికి పంపిన మనుషుల నుండి తప్పించుకున్న వంతిదేవుడు అనుకోకుండా నందిని అంతఃపురంలోకి ప్రవేశించి అక్కడ మరిన్ని రహస్యాలని తెలుసుకుని బయటపడేలోపు అతడు తన స్నేహితుడైన గందమారన్ని చంపాలని ప్రయత్నించాడన్న పుకారు మొదలవుతుంది.
తంజావూరు నుండి ఎలాగో తప్పించుకున్న వంతిదేవుడు చోళుల పూర్వ రాజధాని పళైయారైకి చేరి అక్కడ ఆదిత్యుడి అక్కగారైన కుందవైని కలిసి ఆమె పెద్ద తమ్ముడిచ్చిన తాళపత్ర సందేశాన్ని అందజేస్తాడు. తొలిచూపులోనే చక్రవర్తి కుమార్తె, ఈ దూత మనసులు కలుస్తాయి. దూత ద్వారా అన్ని విషయాలు విన్న కుందవై, ఇతడు బహు సమర్ధుడని గుర్తించి శ్రీలంకలో యుద్ధంలో ఉన్న తన చిన్న తమ్ముడైన పొన్నియిన్ సెల్వన్ కొరకు తాళపత్రం వ్రాసి, అతడిని అక్కడి నుండి క్షేమంగా పళైయారైకి తీసుకువచ్చే పనిని ఈ దూతకి అప్పగిస్తుంది. ఇతడికి అప్పగించిన పని బయటకి పొక్కకూడదని వేరొక మిషతో పినాకపాణి అనే యువకుడిని తోడిచ్చి లంకకి పంపిస్తుంది.
చోళసామ్రాజ్య ముఖ్యమంత్రి సునిశిత దృష్టి కలవారు. ఆయన దూతలు నలువైపులా ఉండి అన్ని విషయాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి చేరవేస్తూ ఉంటారు. ఆదిత్యుడు తన తండ్రికి, అక్కగారికి ఒక దూత ద్వారా తాళపత్ర సందేశాన్ని పంపించాడన్న సమాచారం రాగానే ముఖ్యమంత్రి తన ప్రత్యేక దూతని యువరాజు దూత అయిన వంతిదేవుడిని వెంబడించడానికి పంపిస్తాడు.
ముఖ్యమంత్రి పంపిన ఆ దూత నంబి అనబడే వీరవైష్ణవుడు. నంబి ఎప్పుడూ శైవులతో జగడమాడుతూ ఉంటాడు కానీ తనకి అప్పగించిన పని నెరవేర్చడంలో బహు నేర్పరి. ఇతడు వంతిదేవుడికి ప్రతీచోటా అడ్డుపడుతున్నట్లే ఉంటాడు కానీ వంతిదేవుడిని చిక్కుల్లోంచి తప్పిస్తూ ఉంటాడు.
వంతిదేవుడు శ్రీలంక చేరే ప్రయత్నాల్లో ఉండగానే ఇతడిని వెతుకుతూ కోటదళపతి మనుషులు నలువైపులా జల్లెడ పడుతుంటారు. వంతిదేవుడితో వచ్చిన పినాకపాణి డబ్బులకి ఆశపడి అతడి ఆచూకీ తెలియజేయబోతుండగా ఇదంతా చూసిన ఒక పడవ నడిపే పిల్ల వంతిదేవుడిని రక్షిస్తుంది. ఈ అమ్మాయి పేరు పూంగుళలి. ఈ పడవ నడిపే పిల్ల మహా పెంకి ఘటం. మొదట్లో నిరాకరించినా చివరికి తన పడవలో వంతిదేవుడిని లంకకి చేరుస్తుంది.
లంకలో నందినిని పోలిన ఒక మూగ, చెవిటి అయిన మందాకిని అనే పెద్దావిడని చూసిన వంతిదేవుడు ఆశ్చర్యపోతాడు.లంకలో అడవుల్లో తిరిగే మందాకినికి రాజరాజ చోళుడంటే ప్రాణం. లంకలో అతడిని చంపాలని ఎవరో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ కుట్రలన్నింటినీ మందాకిని ముందరే పసిగట్టి అతడిని రక్షిస్తూ ఉంటుంది. ఒకరోజు సైగల ద్వారా, తాను గీసిన చిత్రాల ద్వారా అతడికి తన వృత్తాంతాన్ని తెలియజేస్తుంది.
చిన్న యువరాజైన పొన్నియిన్ సెల్వన్ని నాటకీయ పరిణామాల మధ్య కలుసుకున్న వంతిదేవుడు ఆయనకి అక్కగారిచ్చిన సందేశాన్ని అందజేస్తాడు. ఇంతలో ముఖ్యమంత్రి దూత అయిన నంబి లంకకి వచ్చి, చిన్నయువరాజు వెంటనే తంజావూరు రావాలనే ముఖ్యమంత్రి ఆదేశాన్ని వినిపించడంతో చిన్న యువరాజు తన అక్కగారు లేదా ముఖ్యమంత్రి పంపిన సందేశాలలో ఏది పాటించాలో తెలియక అయోమయావస్థలో ఉన్నప్పుడు పడవ నడిపే పిల్ల వచ్చి చిన్న యువరాజుని బంధించి తంజావూరుకి తీసుకుని రావాలని చక్రవర్తి ఆఙ ఇచ్చారనే వార్త మోసుకొస్తుంది.
చక్రవర్తి ఆఙని శిరసావహించడానికి లంక నుండి పొన్నియిన్ సెల్వన్ బయలుదేరగానే వంతిదేవుడు కూడా అతనితో కలిసి పడవ ఎక్కుతాడు. అనుకోకుండా ఆ పడవ ప్రమాదంలో చిక్కుకోవడంతో చిన్న యువరాజు మరణించాడని అందరూ అనుకుంటారు. కానీ చిన్న యువరాజు, వంతిదేవుడు ఒకరి సహాయంతో రహస్యంగా ఒడ్డుకి చేరి కుందవైని కలుసుకుంటారు.
మందాకిని ద్వారా తాను విన్న విషయాలని తన అక్కగారైన కుందవైకి తెలియజేస్తాడు పొన్నియిన్ సెల్వన్. ఈ విషయాలు విన్న కుందవై ఆశ్చర్యపోతుంది. ఆమెకి మొదట్లో నందిని మీద ఉన్న ద్వేషం జాలిగా మారుతుంది. ఇదంతా జరుగుతుండగానే తంజావూరులో ఉన్న నందిని తన పగ తీర్చుకోవడానికి తంజావూరు కోటలోనుండే ధనాన్ని పాండ్యరాజు మనుషులకి చేరవేస్తూ ఉంటుంది. ఆమె భర్త కోశాధికారి కాబట్టి ఆమె పని సులువవుతుంది. కానీ కోశాధికారి తమ్ముడైన కోటదళపతికి నందిని మీద అనుమానం వచ్చి అన్నగారికి చెప్పినా, నందిని మోహపు వలలో పడిన కోశాధికారి తమ్ముడి మాట పెడచెవిన పెడతాడు.
ఆదిత్యుడిని ఎలాగైనా చంపాలని పగతో రగిలిపోతున్న నందిని తన అందానికి వశపడిన పార్ధిబేంద్రుడనే యువకుడిని పంపి పట్టపుయువరాజు ఆదిత్యుడిని కంచి నుండి కడంబూరుకి రప్పిస్తుంది. అప్పటికే భర్తతో కలిసి అక్కడికి చేరిన నందిని తన పగ తీర్చుకోవడానికి తన భర్త అయిన కోశాధికారి అడ్డుగా ఉంటారని భావించి ఆయనని మాయ మాటలతో మభ్యపెట్టి తంజావూరుకి పంపిస్తుంది. తన మాటల వలలో పడి ఆదిత్యుడిని కాదని మధురాంతకుడికి పట్టం కట్టాలనుకునే కుట్రకి తన భర్త తెర తీసారే తప్ప, ఆయన ఎంతటి వీరుడో, చోళసామ్రాజ్యానికి ఎంతటి విధేయుడో నందినికి తెలుసు. అందుకే ఆయనని ఆదిత్యుడి నుండి దూరంగా పంపించేసింది.
ఒంటరిగా నందినిని కలుసుకున్న ఆదిత్యుడు, తామిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఆమెకి వివరిస్తాడు కానీ నందిని మాత్రం ఆ మాటలు లెక్కచేయదు. తంజావూరు బయలుదేరిన కోశాధికారికి పాండ్యనాడు కుట్రదారులు ఇద్దరు యువరాజులని, చక్రవర్తిని ఒకేసారి చంపడానికి పన్నుతున్న పథకాలు, అందులో తన భార్య నందిని భాగమన్న విషయం తెలిసి ఆదిత్యుడి హత్యని ఆపేందుకు వడివడిగా కడంబూరుకి బయలుదేరతారు కానీ అప్పటికే ఆదిత్యుడు హత్యగావింపబడ్డాడు.
సుందర చోళచక్రవర్తి, రాజరాజ చోళులు మాత్రం హత్యా ప్రయత్నాల నుండి తప్పించుకుంటారు. ఆదిత్యుడి మరణం తరువాత ఆదిత్యుడి బాబాయ్ అయిన మధురాంతకుడిని రాజుగా ప్రకటించాలని చక్రవర్తి కోరుకున్నా కానీ మధురాంతకుడి తల్లి పడనీయదు. తన స్వంత కొడుకుని కాదని సామ్రాజ్యాన్ని చిన్న యువరాజు రాజరాజ చోళుడికి కట్టబెట్టాలని చూడటంతో మధురాంతకుడు కోపంతో ఉడికిపోయి ఆమె అసలు తన కన్నతల్లేనా అని అడుగుతాడు. అప్పుడిక శెంబియన్ మహాదేవి కొన్నేళ్ళుగా కాపాడుతూ వస్తున్న రహస్యాన్ని చెప్తుంది.
లంకలో నందినిని పోలిన స్త్రీ వేరెవరో కాదు ఆమె నందిని తల్లి మందాకినే. ఆదిత్యుడి మరణం తరువాత అందరి కోరిక ప్రకారం పట్టం కట్టుకోవాలనుకున్న రాజరాజ చోళుడు చివరిలో మనసు మార్చుకుని ఉత్తమ చోళుడికి పట్టం కడతాడు. ఉత్తమ చోళుడు మరణించాకా రాజరాజ చోళుడు పట్టం కట్టుకుని చోళ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు.
శెంబియన్ మహాదేవి తన కొడుకు మధురాంతకుడు సింహాసనం ఎక్కడానికి వీల్లేదని ఎందుకు పట్టుబట్టింది? మందాకిని, నందిని, సుందర చోళచక్రవర్తి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అసలు లంకలో ఉన్న తన చిన్నకొడుకుని బంధించమని చక్రవర్తి ఎందుకు ఆఙ ఇచ్చారు? అక్కడ పొన్నియిన్ సెల్వన్ని చంపాలని చూసినదెవరు? ఆదిత్యుడిని చంపినదెవరు? వంతిదేవుడిని తన పడవలో తీసుకుని వెళ్ళి లంకకి చేర్చిన పడవ నడిపే పిల్ల ఈ కథలో ఎలాంటి ముఖ్య భూమికని పోషించింది? ఎవ్వరూ ఊహించని విధంగా సింహాసనమెక్కిన ఉత్తమ చోళుడెవరు? చివరికి మధురాంతకుడు, కోటదళపతి, కోశాధికారి ఏమయ్యారు? వంతిదేవుడిని మూగగా ఆరాధించిన మణిమేఖల ఏమయ్యింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి మరి…
(Quora నుండి సేకరణ… వాత్సల్య గుడిమళ్ళ, సమాధానం ప్లస్ సమాచారం…)
Share this Article