మసజసతతగ… మసజసతతగ… పంజా ఎత్తి కొడితే పగిలిపోద్దిరా… కోరలు దిగినాయంటే నరకలోకమేరా… పులి, పులి, పులి… చారల్లేని పులి వీడేరా… అడవికే రారాజు వీడేరా… ఆ శ్వాసే తుఫాను గాలిలా, ఆ చూపే పెద్ద తోపురా… మసజసతతగ… మసజసతతగ……. ఈ పాటను ఎవరైనా స్టార్ హీరో మీద చిత్రీకరణకు వాడుకుంటానంటేనే అమ్మాలి… లేకపోతే దాని రేంజ్ చిన్నబోతుంది… అసలే హీరోను మనం శార్దూలంలా చూపిస్తున్నాం… బిల్డప్పులకే సూపర్ బిల్డప్పు ఇస్తున్నాం కదా…
ఛఛ లైట్‌గా తీస్తే బాగోదు… తుపాకులు ఉండాలి, తూటాలు ఉండాలి, వెనుక నుంచి పులి గాండ్రింపుల బీజీఎం మోతమోగిపోతూ ఉండాలి… రౌడీలు గాలిలో లేచిపోతుండాలి… వీలయితే మిషన్ గన్లు, గ్రెనేడ్లు, రాఫెల్ ఫైటర్లు గట్రా ఉన్నా సరే… దీనికి తమన్ అయితేనే బెటర్… ఏది సాంగు, ఏది బీజీఎం తెలియకుండా భీకరంగా కొట్టగలడు… థియేటర్లలో బాక్సులు పగిలిపోవాల్సిందే… లేదంటే వినేవాడి కర్ణభేరీలు… శ్రీకృష్ణ, పృథ్విచంద్ర అయితే ఆ పదాలేమిటో కూడా అర్థం గాకుండా పాడగలరు… ఓ లెవల్‌లో వస్తుంది పాట అప్పుడు… టాప్ లేచిపోవాలి…
సినిమాలో ఎవరైనా హిందీ హీరో కూడా ఉంటే ఇంకా సూపర్… తనకు సభరనమయవ, సభరనమయవ అని వేరే పాట పెట్టేద్దాం… అంటే మదించిన ఏనుగు అని… ఐరావతం, గజగజలాడించే గజరాజు అదుగో అని మంచి పంచ్ పదాలు దంచికొడదాం… వెండితెర దద్దరిల్లిపోవాలి… అడవిలో కృష్ణజింకలు అలో లక్ష్మణా అంటూ పాదఘట్టం వైపు పరుగులు పెట్టాలి… ఏమిటీ..? ఆల్‌రెడీ గజరాజుతో పోలుస్తూ అనంత శ్రీరాముడు నజభజజజర అని ఓ పాట వండేశాడా..? అరెరె, ఇప్పుడెలా..?
Ads
ఐనా మత్తేభం గురించి వర్ణించాలంటే సభరనమయవ అని మొదలుపెట్టాలి కదా… నజభజజజర అని పాడిస్తే ఎలా..? ఎవరూ తమనేనా..? తనే… ట్యూన్ దొరికితే చాలు, ఏ తెలుగు పదం ఎలా పడుతుందో తనకెందుకు..? తనకేం తెలుసు..? పాడువాడు ఎలాగూ మాట్లాడకూడదు… రీమేకుల స్పెషలిస్టుల దర్శకుడికేమో ఏమీ తెలియదు… జజజ అని వరుసగా అక్షరాలు పడ్డాయిగా… అది చాలు తనకు… ప్చ్, పోనీలే… పులితో పోల్చే మసజసతతగ పాటనైనా ఆ సల్మానుడి కోసం తీసుకుంటే బాగుండు, పోనీ, సత్యదేవ్ కోసం… అడిగి చూడాలా..? అబ్బే, వద్దులే… వాళ్ల ఆస్థాన రచయిత అనంతుడు పడనివ్వడు… అసలే ఈమధ్య తింగరి పదాలన్నీ పొదుగుతున్నాడు, అదేమంటే భాష గొప్పదనం, నాదేముంది అంటూ ఉల్టా భాషనే బదనాం చేస్తున్నాడు…
ఫాఫం, అంతకుముందే ఎవరో రాసినట్టున్నారుగా… చంపకమాలా నన్ను చంపకే బాల అని… అది రామజోగయ్య శాస్త్రి రాసినట్టున్నాడు… నయం, నజభజజజర అని భయపెట్టలేదు తను… ఏవేవో ఇంగ్లిషు పదాలతో పల్లవిని మోతెక్కించి, మధ్యమధ్య తెలుగు పదాలే అనిపించేలా చరణాల్లో కొన్ని మార్మిక పదాలను ఇరికించి…, అదే చంపకమాల పోవోయ్ అని దబాయించాడు అందరినీ… ఇంకెవరు, ఆ సినిమాకు కూడా ఇదే తమనుడి సంగీతం… ఇలా తెలుగు వ్యాకరణంలోని పద్యలక్షణాలను, గణాలను కూడా మన వికృత గీతాల్లో పొదగడం తమనుడికే సాధ్యం…
సరే, సరే… ఇంకో పాట రాసిస్తాను… భరనభభరవా, భరనభభరవా… నువ్వే నా దేవత కావా..? నేనే నీ ప్రేమ తోవా…? ఉత్పలమాల కదా, లవ్ సాంగుకు బాగుంటుంది… మరీ మత్తేభం, శార్దూలంలాగా గాండ్రింపులు, ఘీంకారాలు కూడా అవసరం లేదు… రాష్ట్రగీతం, జాతీయగీతం ఎట్సెట్రా వదిలేసి, మనం దేన్ని ఎలా వాడేసుకున్నా పర్లేదు..!! వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర అని తెలుగు పద్యాలు నానారకాలు… ఇంకేం..? కుమ్మేయండి…!!
Share this Article