ఇవ్వాళ్రేపు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది చాలా పెద్ద టాస్క్… బోలెడు డబ్బు పోసి, టికెట్టు కొనుక్కుని, హాలులో కూర్చున్నాక.., ఆ దర్శకుడు జేమ్స్ కామెరూనా, రాజమౌళా, మణిరత్నమా, ప్రశాంత్ నీలా..? సంజయ్ లీలా భన్సాలీయా..? మనకు అక్కర్లేదు… వాళ్ల గత చిత్ర వైభవాలు అక్కర్లేదు… ఈరోజు చూడబోయే సినిమా ఎలా ఉందనేదే ముఖ్యం..? ఇదే సినిమాకు రెండో పార్ట్ ఉంటుందా, అది బాగుంటుందా లేదనేది కూడా అక్కర్లేదు…
ఎందుకిదంతా చెప్పుకోవడం అంటే…? మణిరత్నం మెరిట్ ఉన్న దర్శకుడే, సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ గర్వించదగినవాడే… తను తీసిన సినిమా కాబట్టి, ఇది తన కలల ప్రాజెక్టు కాబట్టి సినిమా ఎలాగూ బాగుంటుందనే ప్రిజుడీస్ అభిప్రాయంతో పొన్నియిన్ సెల్వన్ సినిమా చూడాల్సిన పనిలేదు… వందల కోట్ల ప్రాజెక్టు, ఓ రేంజులో తీసే ఉంటాడు… పైగా గ్రాఫిక్స్, యుద్ధాలు, మాణిక్యాల్లాంటి తారలు, ఆస్కార్ సంగీత దర్శకుడు… ఇవన్నీ మనసులో ఉంటే సినిమాను సినిమాగా చూడలేం… అలా చూడకూడదు కూడా… ఈ ఫీలింగ్స్ ఏమీ మైండ్‌లోకి రానివ్వకుండా ఈ సినిమా చూస్తే మటుకు పొన్నియిన్ సెల్వన్ ఓ సాదాసీదా తమిళ సినిమా… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం…
Ads
తమిళ సినిమా అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవడం అంటే… తమిళ చరిత్ర, తమిళ తారలు, తమిళ ప్రైడ్… బాగా పాపులర్ చోళుల చరిత్ర కాబట్టి, చాన్నాళ్లుగా తమిళులు ఆ కథల్ని చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్లకు వెంటనే కనెక్ట్ అవుతుంది… మనకు రుద్రమదేవి, కృష్ణదేవరాయలు తరహాలో… కానీ మనకు పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ కథావస్తువుతో పెద్ద పరిచయం లేదు, కల్కి రాసిన ఆ భారీ గ్రంథం మీద అవగాహన లేదు… అన్నింటికీ మించి ఆ పాత్రల పేర్లు, ఆ చరిత్ర మనకు ఎక్కవు… పైగా సంక్లిష్టంగా ఉంటుంది…
ఇవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… మణిరత్నం ఈ పాత్రల్ని నాన్-తమిళులకు ఎలా పరిచయం చేస్తాడు..? కథను ఎలా సరళంగా చెబుతాడు అని…? అదే జరిగింది… పేరుకు పాన్-ఇండియా సినిమా… కానీ ఇది ప్యూర్ తమిళ సినిమా… పైగా మణిరత్నం ఒకప్పుడు పెద్ద దర్శకుడు… చాన్నాళ్లుగా సక్సెస్ లేదు, అప్‌డేట్ కాలేదు… అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది… అత్యంత పాపులర్ నవలను తెరకు ఎక్కించడానికి అవస్థ కూడా ఈ సినిమాకు మైనస్… నవలను యథాతథంగా తీస్తే అందులో పంచ్ లేదు… క్రియేటివ్ ఫ్రీడం తీసుకోవడానికి చాన్స్ లేదు… అక్కడ మణిరత్నంకు సమస్య వచ్చి పడింది…
అంతేకాదు, ఎలాగూ రెండో పార్ట్ ఉంటుంది కదాన్నట్టుగా ఫస్ట్ పార్ట్ ఉండకూడదు… దేనికదే వేరే సినిమా అన్నట్టుండాలి… దాన్ని మణిరత్నం పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించదు… ఈ సినిమాలో పాత్రల్ని పరిచయం చేయడానికే బోలెడంత టైమ్ తీసుకుంటుంది… తీరా కాస్త యాక్షన్ గట్రా స్టార్టయ్యేసరికి, ఈ డాక్యుమెంటరీ తరహా నేరేషన్ మీద సదభిప్రాయం కాస్తా సన్నగిల్లిపోతుంది… అసలే బాహుబలితో రాజమౌళి ఓ బెంచ్ మార్క్ ఫిక్స్ చేసి పెట్టాడు… ప్రశాంత్ నీల్ ఇంకాస్త పెంచాడు… బ్రహ్మాస్త్ర సినిమాకూ ఇదే సమస్య వచ్చిపడింది… పోలిక… పోలిక తప్పదు… ఆ పోలికలో పొన్నియిన్ సెల్వన్ పెద్దగా రుచించదు… ఎక్కడా మనల్ని ‘అరె, భలే తీశాడే’ అనే ఫీల్ ఆవహించదు… పైగా ఆ పాత్రలు, ఎవరికి ఎవరు ఏమవుతారో ఓ పట్టాన అంతుచిక్కదు…
ఈ కథ జోలికి పోవడం లేదు ఇక్కడ… అంత భారీ నవలను రెండు పార్టుల సినిమాగా తీయడమే పెద్ద సాహసం… దాన్ని ఆ స్థాయికి కుదించడం కూడా కష్టం… పైగా ప్రజెంట్ ట్రెండ్స్ అద్దాలి… కాస్త కమర్షియల్ వాల్యూస్ యాడ్ చేయాలి… అవసరమైనంత క్రియేటివ్ ఫ్రీడం తీసుకోవాలి, వివాదాలకు భయపడకూడదు… ఈ సినిమాకు సంబంధించి అవేవీ లేవు… ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఎట్సెట్రా మేలిరకం తారాగణం… రెహమాన్ సంగీతం… అన్నీ వోకే… వాళ్లందరూ బాగానే చేశారు… కానీ అదొక్కటే సరిపోదు కదా… ప్చ్, నిరాశపరిచావు మణిరత్నం సాబ్… పాటల్లో పస లేదు… మాటల్లో పంచ్ లేదు… బీజీఎం అదరగొట్టలేదు… గ్రాఫిక్స్ అబ్బురపరిచే రేంజ్ కాదు… పాత్రలు బుర్రకెక్కవు… సారీ సార్… ఈ సినిమా విషయంలో మిమ్మల్ని అభినందించలేను…!!
Share this Article