మనం సొంతంగా, మనకు అలవాటైన నార్త్ స్టయిల్లో ఏవో సోది సినిమాలు తీస్తే జనం అడ్డంగా తిప్పికొడుతున్నారు… కానీ సౌత్ ఇండియన్ సినిమాల్ని హిందీలోకి డబ్ చేస్తే, ఆ హీరోల మొహాలు అంతకుముందు చూసి ఉండకపోయినా సరే, హిట్ చేసేస్తున్నారు… కోట్లకుకోట్ల డబ్బు కొల్లగొట్టేస్తున్నయ్ ఆ సినిమాలు, మరి మనమేం చేయాలి..? చేతనైతే కొత్త కాన్సెప్టులు, కొత్త ట్రెండ్లకు వెళ్లాలి… లేదంటే ఏదైనా సౌత్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొనేసి, మనమే నిర్మించడం…
యథాతథంగా హిందీకరించాలి… సారీ, ఉత్తరీకరించాలి… అది సులువైన మార్గం, హిందీ హీరోల ఇజ్జత్, స్టార్ వాల్యూ దక్కుతుంది… సినిమాలు కూడా హిట్ అవుతాయి… ఎన్నడూ చూడని సౌత్ మొహాలకన్నా, సౌత్ ట్రెండ్‌లో హిందీ హీరోలను చూడటం బెటర్ కదా….. ఎస్, విక్రమ్ వేద నిర్మాత, దర్శకుడు, ఇద్దరు హీరోలు అలాగే ఆలోచించారు… కానీ…? అలా చూడటానికి కూడా హిందీ ప్రేక్షకులు ఇష్టపడటం లేదు…
తమిళంలో 2017లో బాగా హిట్టయిన విక్రమ్ వేదను అదే పేరుతో రీమేక్ చేశారు… ఒరిజినల్లో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలు… 10 కోట్లతో సినిమాను చుట్టేసి, వదిలారు… 60 నుంచి 70 కోట్లు కుమ్మేసింది… శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్… అంత పేరున్నదేమీ కాదు… కాకపోతే వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఉంది సినిమాలో… ఇప్పుడు హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్… రాధికా ఆప్టేకు ఓ కీలకపాత్ర… నిజానికి హృతిక్, సైఫ్ ఎన్నాళ్లయింది తెర మీద కనిపించి..? ఎన్నాళ్లయింది తమదైన స్టయిల్లో ప్రేక్షకులను అలరించి..? సౌత్‌లో హిట్టయిన కథ, ఆ దర్శకులే… మరి హిట్ కావాలి కదా…
Ads
లేదు, అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదు… మరీ మొదటిరోజు అనేక ప్రాంతాల్లో 25-30 శాతం యాక్యుపెన్సీ కూడా లేదట… సౌత్‌లో దీన్ని ఎలాగూ పెద్దగా చూడరు… నడవాల్సింది, డబ్బు సంపాదించాల్సింది హిందీ బెల్టులోనే… ఊహించిన రేంజుకన్నా చాలా తక్కువ మొదటిరోజు కలెక్షన్లు వచ్చాయనీ టాక్… కాకపోతే నెగెటివ్ రివ్యూలు లేవు, మౌత్ టాక్ నెగెటివ్‌గా లేదు కాబట్టి హిందీ బెల్టులో పికప్ అవుతుందని బాలీవుడ్ పెద్దల ధీమా… బ్రహ్మాస్త్ర బారీ కలెక్షన్లు అని బయటికి ఏవేవో లెక్కలు చెబుతున్నా వాటినెవడూ నమ్మడం లేదు… ఇక ఈ విక్రమ్ వేద కూడా నడవకపోతే బాలీవుడ్ మరింత కుంగిపోవడం ఖాయం…
ఇక్కడ సైఫ్, హృతిక్ కోణంలో కాదు… దీన్ని బాలీవుడ్ ఇండస్ట్రీ దురవస్థ కోణంలోనే చూడాలి… స్టిల్ ఇప్పటికీ హిందీ తారాగణాన్ని హిందీ ప్రేక్షకులే లైట్ తీసుకుంటున్నారు… ఆకాశం నుంచి నేలకు దింపారు… అసలు అక్షయ్ కుమార్ సినిమా కన్నీళ్ల గురించి చెప్పనక్కర్లేదు… హిందీ బెల్టులోని పలుప్రాంతాల్లో కేజీఎఫ్, కార్తికేయ, పుష్ప, ఆర్ఆర్ఆర్, విక్రమ్ మార్చి మార్చి వేస్తున్నారు థియేటర్లలో… మరి మణిరత్నం భారీ ప్రాజెక్టు హిందీ వెర్షన్ రిజల్ట్ ఏమిటి..? ముందే అనుకున్నాం కదా… అసలు నాన్ తమిళ్ సౌత్ ప్రేక్షకులకే ఆ సినిమా ఎక్కదు అని… ఇక హిందీ వాళ్లకు ఏం రుచిస్తుంది..? చాలా పూర్ కలెక్షన్లు, పూర్ రెస్పాన్స్… సహజమే…!!
Share this Article