అనుకోకుండానే సుహాసిని… అనేకానేక వెబ్ సైట్లు, యూట్యూబర్లకు మంచి చురక పెట్టింది… ఈవెన్ ప్రధాన మీడియా వెబ్సైట్లకు కూడా…! తనకు తెలియకుండానే..! నిజానికి సుహాసినిని లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తారు, సొంతమనిషిలా అభిమానిస్తారు… అందంలో ఆమె సాదాసీదాయే, కానీ ఆమె గతంలో పోషించిన కొన్ని పాత్రలు, అశ్లీలానికి దూరంగా ఉండటం, వెగటు వేషాలను దగ్గరకు రానివ్వకపోవడం ఎట్సెట్రా ఆ ప్రేమకు కారణాలు…
కానీ మొన్న తమ సొంత సినిమా పొన్నియిన్ సెల్వన్ ప్రిరిలీజ్ సభలో ఏదేదో మాట్లాడి, తొలిసారిగా సుహాసిని పరిణత వ్యాఖ్యల మీద సందేహాల్ని కలిగించింది… మీ తెలుగు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి ఇది తెలుగు సినిమాయే అనే వ్యాఖ్య మరీ బండ్ల గణేష్, కేఏపాల్ తరహాలో ఉందని మనం చెప్పుకున్నాం కూడా… ఈ సినిమా దిల్ రాజు బిడ్డ అనే వ్యాఖ్య కూడా బాగోలేదు… మరి ఇప్పుడు ఆమెను అనుకోకుండా మెచ్చుకునే సందర్భం ఎక్కడ వచ్చిందంటే..?
ఉమైర్ సంధూ ఓ ట్విట్టరాయుడు ఉన్నాడు… తనకుతాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకుంటాడు… సినిమా చూడగానే ఆ సినిమా మీద ఏదో రెండు మూడు వాక్యాల రివ్యూ వదులుతాడు…. ఎక్కువ శాతం సూపర్, బంపర్, డూపర్ వంటి మెచ్చుకోళ్లే ఎక్కువ… ఇక తనేదో ట్వీట్ చేయగానే తెలుగులో డిజిటల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కళ్లకద్దుకుని, అదొక సర్టిఫికెట్లా భావించి… తొలి రివ్యూ వచ్చేసింది అంటూ పబ్లిష్ చేస్తారు… తొలి రివ్యూ పేరిట ఉమైర్ సంధూ సమీక్షలు మొత్తం లెక్కేస్తే కొన్ని వేలు… తీరా చూస్తే అందులో చాలావరకు నిజం కావు…
Ads
తనకు ఎంత తోస్తే అంత ఏదో రాసేస్తాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే తను సూపర్ హిట్ అన్నాడు అంటే, ఆ సినిమా సంకనాకిపోయినట్టే అని అర్థం… మరి ఇన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఎందుకు తనకు క్రెడిబులిటీ ఇస్తున్నాయి..? జవాబు లేని ప్రశ్న… గుడ్డెద్దు చేలో పడ్డ జర్నలిజం కదా… (సారీ, దీన్ని జర్నలిజం అంటున్నందుకు…) సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా రిలీజుకు ముందు సమీక్షలు జనంలోకి వదలొచ్చా..? ఇదీ పెద్ద ప్రశ్నే…
మొన్నామధ్య పొన్నియిన్ సెల్వన్ ఆహా, ఓహో, విక్రమ్, కార్తి ఇరగదీశారు, గ్రాఫిక్స్ అదిరిపోయాయి, ఐశ్వర్యారాయ్ అందానికి తిరుగులేదు, చప్పట్లు కొట్టే సీన్లు బోలెడు అని రాసుకుంటూ పోయాడు… నిజానికి ప్రశంసే… కానీ ఆనవాయితీ ప్రకారం ఇది మైనస్ అవుతుంది… మరి సుహాసినికి నిజంగానే ఈ ఉమైర్ సంధూ అనే ప్రపంచ ప్రఖ్యాత రివ్యూయర్ తెలుసో తెలియదో మనకు తెలియదు గానీ… ‘‘ఎవరు మీరు..? రిలీజుకు ముందే సినిమా ఎలా చూశారు..?’’ అని కామెంట్ రాసింది…
‘‘ఎవడ్రా నువ్వు..? రిలీజుకు ముందే ఏమిట్రా ఈ కూతలు’’ అన్నట్టుగా అనిపించింది అది చదవగానే… సుహాసిని కామెంట్ మీద భలే అప్లాజ్ వచ్చింది కూడా… అవును, సుహాసినిలే అడగాలి… మరి ఉమైర్ సంధూను మోసే సోకాల్డ్ ఫేక్ జర్నలిస్టులు సిగ్గు తెచ్చుకుంటారా..? సరే, ఇదిక్కడ వదిలేద్దాం…
Who is this please. What is your access to a film yet to release
— Suhasini Maniratnam (@hasinimani) September 28, 2022
సరే, రిలీజుకు ముందే సినిమాలు చూసే చాన్స్ వస్తుందేమో, ఏదో రాస్తున్నాడులే అనుకుందాం… కానీ టీజర్లకు రివ్యులు రాసేస్తున్నాడు… అవేమైనా సెన్సార్ పరిశీలనకు వస్తున్నాయా..? మరి అవెక్కడ చూస్తున్నట్టు..? డిజిటల్ జర్నలిస్టులకు ఈమాత్రం సోయి ఉండటం లేదా..? దిగువన ఈ ట్వీట్ చూడండి…
#Adipurush Teaser = BLOCKBUSTER ❤❤ ! Speechless. #Prabhas love you.
— Umair Sandhu (@UmairSandu) October 1, 2022
ఏదైనా అతి చేయవద్దు… ఎప్పుడో విరిగిపోతుంది… అది ఉమైర్‌కు అర్థమవుతున్నట్టు లేదు… ప్రభాస్ అభిమానులు కూడా ఈ ప్రశంసను నెగెటివ్‌గా తీసుకున్నారు… టీజర్ రిలీజ్ కాకముందే ఈ బ్లాక్ బస్టర్ కూతలు ఏమిట్రా అని ఎదురుదాడి చేస్తున్నారు… నిజమే కదా మరి… ఐనాసరే, ఉమైర్‌కు ఇవి సరిపోవు..!!
Share this Article