అవును… రావణుడు ఇలాగే ఉంటాడని ఎవరు రాశారు..? రామాయణం కొన్ని శతాబ్దాలుగా పఠింపబడుతూనే ఉంది… అనేక భాషలు, అనేక కళారూపాల్లో తరతరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం… అది మన నెత్తుటిలో ఇంకిపోయిన కథ… అయితే ఆయా పాత్రల రూపురేఖల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు చెప్పుకున్నారు… పలు ప్రాంతాల్లో ఒరిజినల్ కథకే బోలెడు మార్పులు చేసి చెప్పుకుంటుంటారు… బేసిక్ కథ ఒకటే… కట్టె, కొట్టె, తెచ్చె… దీని చుట్టూ కథ ఎలా అల్లుకుంటాం అనేది క్రియేటర్ ఇష్టం…
పౌరాణిక సినిమాల్ని తీయడంలో మన తెలుగువాళ్లు ప్రసిద్ధులు… రాముడంటే ఇలా ఉండాలి, రావణుడంటే ఇలా ఉండాలి అని బెంచ్ మార్కులు గీసి పెట్టారు… నీలమేఘఛాయ అనేది రాముడి రూపానికి కామన్… అంతేతప్ప మీసాలు ఉంటాయా, ఉండయా, జుట్టు పెంచుకుని ఉండేవాడా..? గడ్డం పెంచేవాడా..? అవన్నీ సెకండరీ..! మాంసాహారా..? శాకాహారా..? అనేది మరో చర్చ… అప్పటి ఆ రాజుల ఆహారసంస్కృతి, అలవాట్లు ఎలా ఉంటే అలా..? అందులో రచ్చ దేనికి..?
అడవుల్లో తిరుగుతున్నప్పుడు మీసాలు, గడ్డాలు పెరగవా..? మాంసం తినకుండా గడిచేది ఎలా..? 14 ఏళ్లు అరణ్యవాసం చిన్న విషయమేమీ కాదు… రావణాసురుడి సంగతీ అంతే… రావణుడు అనగానే భీకరమైన మొహం, తలపై రెండు కొమ్ములు, బుర్ర మీసాలతో ఉన్న రూపం మన మెదళ్లలో చాన్నాళ్లుగా ప్రోగ్రామైపోయి ఉంది… కానీ ఒరిజినల్‌గా తను రాముడిని మించిన దైవభక్తుడు… ఐనా, నామాలు పూసుకున్న రావణాసురుడి సాత్వికరూపాన్ని మనం ఎందుకో ఇష్టపడం, క్రియేటర్స్ చూపించరు… ఎందుకు..?
Ads
రావణుడిని అలా విలన్‌గా చిత్రీకరించారు కాబట్టి… అందుకే భీకరరూపాన్నే చూపిస్తూ, ఆ రూపంలోనే తన తత్వాన్ని సగం చెప్పేస్తుంటారు… రాముడు మంచి బాలుడు అని చెప్పటానికి వీలుగా తన రూపాన్ని వీలైనంత సాత్వికంగా చూపిస్తుంటారు… భిన్నంగా చూపిస్తే వెంటనే జనం నుంచి యాక్సెప్టెన్సీ రాదు… కష్టం…! మన వేరే రూపాల్ని చూసీ చూసీ అలాగే ట్యూన్ అయి ఉన్నాం కాబట్టి..!
అసలు ఇన్నేళ్లుగా చెప్పుకుంటూనే ఉన్న రామాయణాన్ని కొత్తగా ఇంకేం చెప్పగలం..? అదీ అసలు ప్రశ్న… అందుకే కొందరు వేర్వేరే పాత్రల కోణం నుంచి కొత్త తరహాలో కథలను చెబుతుంటారు… స్టోరీ రీటెల్లింగ్… కాదంటే మన పాత ఎన్టీయార్ తరహాలో రావణుడి విలనీని తగ్గించి, కాస్త హీరోయిజాన్ని అద్దుతుంటారు…
ఇప్పుడేమో అంతా గ్రాఫిక్స్ ట్రెండ్ కదా… పైగా యుద్ధాలు, యాక్షన్, సూపర్ హీరోయిజం ధోరణి నడుస్తోంది… దాంతో ఆదిపురుష్ సినిమా తీస్తున్న దర్శకుడు, నిర్మాత పూర్తిగా గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్టు టీజర్ చెబుతోంది… నిజానికి గ్రాఫిక్స్‌ను అవసరమైనచోట, అవసరమున్నట్టే వాడుకోవాలి… లేకపోతే యానిమేషన్ ఫిలిమ్ అయిపోతుంది… కార్టూన్ ఫిలిం… ఆదిపురుష్ టీజర్ అలాగే ఉంది… ఇప్పుడొక ప్రశ్న… కేవలం బాణాలు, గదలు, యుద్దం, యాక్షన్ మాత్రమే చూపాలంటే ఇక ప్రభాస్, సైఫ్ దేనికి..? వాళ్ల పోలికలతో ఓ కార్టూన్ యానిమేటెడ్ ఫిలిమ్ చుట్టేసి, వదిలేస్తే పోలా..?
నాలుగు అస్త్రాలు, తెర నిండా మంటలు, బీభత్సం కావాలంటే ఆ దిక్కుమాలిన బ్రహ్మాస్త్ర మళ్లీ చూస్తే సరిపోదా ఏం..? యూట్యూబ్ నిండా బోలెడు కార్టూన్ రామాయణాలున్నయ్… అవి చూస్తే పోలా..? కథను కొత్తగా చెప్పగలగాలి, ఏ పాత్ర ఔచిత్యం పోకుండానే..! పాత్రల నడుమ ఘర్షణ, ఎమోషన్స్, కదిలించే కొన్ని సీన్లు, ఎలివేట్ చేసే బీజీఎం, ఆకట్టుకునే పాటలు, వాటి చిత్రీకరణ, మంచి నటన, సూటిగా తగిలే మాటలు… సినిమా అంటే ఎన్ని ఉండాలి..? వాటికేమీ ప్రాధాన్యం లేకుండా కేవలం కార్టూన్ యానిమేషన్ గ్రాఫిక్స్‌నే నమ్ముకుంటే… ప్రభాస్‌కు ఇది మరో రాధేశ్యామ్ అవుతుంది..!
నిజానికి టీజర్ చూస్తేనే నవ్వొచ్చింది… సైఫ్ రూపం చూసి కాదు… తన తలలు పైకీ కిందకూ విచిత్రంగా ఎగురుతుంటయ్… డీసెంట్ హెయిర్ కటింగ్ సరేసరి… పైగా ఆ గడ్డం… కొమ్ముల్లేవు… తలకు ఏ చిన్న ఆభరణమూ లేదు… రావణుడు అలా ఉండొద్దని ఏమీ లేదు… కానీ మనకు ఆడ్‌గా ఉంది చూడటానికి..!
వేల కళారూపాలు కూడా రాముడిని నీలమేఘ వర్ణుడనే వర్ణించాయి… నో, మేం ఇలాగే మంచి దేహఛాయతోనే చూపిస్తాం అంటూ ప్రభాస్‌ను ఫెయిర్ కలర్లో చూపిస్తాం అంటున్నాడు దర్శకుడు ఈ టీజర్ ద్వారా… ఇదే నా క్రియేటివిటీ అంటూ ఆ దర్శకుడు ఓం రౌత్ అలాగే అడమెంటుగా ఉండి, విడుదల చేస్తే… అది తన ఖర్మ, ప్రభాస్ దురదృష్టం…! వందల కోట్లు సరయూనదిలో నిమజ్జనం చేసినట్టే…!! అవునూ, రావణుడు అనగానే కాస్త బిన్ లాడెన్ లుక్ ఎందుకు తీసుకొచ్చినట్టు ఈ దర్శకుడు..?!
Share this Article