మొత్తానికి చెత్తా టీజర్, చెత్తా యానిమేషన్ అని విమర్శలకు గురవుతున్న ఆదిపురుష్ వేషాలు చినికి చినికి గాలివాన అయ్యేట్టు కనిపిస్తున్నాయి… హార్డ్ కోర్ హిందుత్వ వాది, మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా తెర మీదకు వచ్చాడు… అబ్బే, ఆ టీజర్‌లో హనుమంతుడి వేషధారణ బాగాలేదోయ్, ఆ సీన్లు సినిమాలో మాత్రం కనిపించకూడదు మరి, తరువాత మీ ఇష్టం అంటూ దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నాడట… తనే చెప్పాడు…
టీజర్‌లో హనుమంతుడు లెదర్‌తో చేసిన అంగవస్త్రం, లెదర్ చెప్పులు వేసుకోవడం బాగా లేదని ఆయన అభ్యంతరం… హనుమంతుడు ఎప్పుడూ నలుపు, తెలుపు వస్త్రాలు ధరించడు, పైగా తనకు గడ్డాలు, మీసాలు కూడా ఉండవు, హనుమాన్ చాలీసాలోనే హనుమంతుడు ఎలా ఉంటాడో స్పష్టమైన వివరణ ఉంది, కానీ ఈ దర్శకుడు హనుమంతుడి బదులు ఇంకేదో వేషం చూపిస్తున్నాడనీ, ఈ సీన్లు గనుక తొలగించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవు అని నరోత్తముడి ఉవాచ…
తనతోపాటు సామాజిక సంస్థ హిందూ మహాసభ కూడా హనుమంతుడి వేషధారణ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది… ఇక్కడ మనకు ఓ సందేహం… హనుమంతుడు ఎలా కనిపించేవాడని హనుమాన్ చాలీసాలో సదరు రచయిత వర్ణించడమే ప్రామాణికమా..? ఇంకేదైనా శాస్త్ర ప్రామాణికం ఉందా..? గడ్డాలు, మీసాలు ఉండవనీ, నలుపు, తెలుపు వస్త్రాలు ధరించడనీ ఏమిటి నిర్ధారణ..? ఐనా నరోత్తముడు ఇవన్నీ పట్టించుకోడు, తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు, అంతే…
Ads
తలాతోకా లేని వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ అధికార ప్రతినిధులు ముందుంటారు కదా… అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ కూడా దర్శకుడు ఓం రౌత్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది… ‘‘ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు… రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్‌ను చూపించిన తీరు తప్పు… రావణుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు… రాముడు క్షత్రియ యోధుడు… అలాంటిది రాముడు జంధ్యం ఎలా ధరించాడు..? పైగా రావణుడికి జంధ్యం ఏది..? అసలు ఇద్దరిలో ఎవరు బ్రాహ్మణుడు..?’’ అని విరుచుకుపడింది…
దర్శకుడికి తెలియకపోతే రామాయణం, కంబరామాయణం, తులసీదాసు రామాయణం ఉన్నాయి కదా, చదవాలి కదా… ఏ రీసెర్చ్ లేకుండా హిందువులు పూజించే కేరక్టర్లను ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేస్తారా..? ఆయ్ఁ అని విమర్శించింది… ఆ దర్శకుడి టేస్ట్, పనితీరు మీద ఎవరికీ సదభిప్రాయం ఏమీలేదు… తన ఎంపిక ప్రభాస్ దురదృష్టం… కానీ ఈమె విమర్శలు నవ్వు పుట్టించేలా ఉన్నయ్, ఆమెకే అసలు ఏమీ తెలియదని స్పష్టం చేస్తున్నయ్…
పైన బొమ్మలు చూశారు కదా… మన తెలుగువాళ్లు అప్పటి ఎన్టీయార్ దగ్గర నుంచి ఇప్పటి రామచరణ్ దాకా… అందరికీ జంధ్యాలున్నయ్… వీళ్లెవరికీ బుర్రలు లేవంటావా మాళవికా..? రాముడే కాదు, రావణుడు, దుర్యోధనుడికీ జంధ్యాలు వేశాడు ఎన్టీయార్… అది క్షత్రియోచితమే… ఐనా బ్రాహ్మణుడు మాత్రమే జంధ్యం ధరించాలనేమీ లేదు… బహుశా ఆమె చిన్న బుర్రకు తెలియకపోవచ్చు…
చాలా కులాల వాళ్లు జంధ్యాలు ధరిస్తారు… రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి తప్పకుండా జంధ్యంతో కనిపించాలా..? పైగా రాముడికి జంధ్యం ఉండకూడదా..? బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడిన ఎనిమిదో ఏట, క్షత్రియులకు, సూర్యవంశం రాజులకు, చంద్రవంశం రాజులకు, భట్టు రాజులకు గర్భంతో కూడి పదకొండో ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి పన్నెండో ఏట ఉపనయనం చేయాలని వేదోక్తి… అంతేకాదు, విశ్వబ్రాహ్మలు కూడా జంధ్యం ధరిస్తారు… మరి ఈ మాళవిక జ్ఞానం ఎంతో తెలియదు గానీ… జాతీయ, అధికార పార్టీ తరఫున, అదీ రామ-రావణ విషయంలో వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్త సోయి తెచ్చుకుని మాట్లాడాలి కదా..!! అన్నట్టు, ఇక్కడ హనుమంతుడికి జంధ్యం ఉంది… దీన్ని ఏమందాం..!?
Share this Article