నో, నో… నాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఐడీ కార్డుతో అస్సలు పనిలేదు… ఖర్గేకు వోటేయాలా..? శశిధరూర్‌కు వోటేయాలా అనే ప్రశ్నే లేదు… అసలు నేను కాంగ్రెస్‌లో ఎప్పుడున్నాను..? అయిపాయె, ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేశాక, కేంద్ర మంత్రి పదవి కొన్నాళ్లు… తరువాత రాజ్యసభ గడువు పూర్తయ్యాక మళ్లీ కాంగ్రెస్ మొహం చూసిందెక్కడ..? అసలు ఏపీలో కాంగ్రెస్ ఉన్నదెక్కడ..?
నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని వాళ్లే చెప్పుకుంటారు… లేనని వాళ్లే అంటారు… మళ్లీ వాళ్లే ఖండిస్తారు… నేను అసలు ఒక్క మాటా మాట్లాడానా..? ఏ పార్టీలోకి జంప్ కాలేదు… ఎవరి పంచన చేరలేదు… నా స్టెప్పులు, నా ఫైట్లు, నా బిల్డప్పులు, నా ఫ్యాన్స్… మళ్లీ నా ఇమేజీ లోకంలోకి నేను వచ్చి పడ్డాను… వయస్సుదేముందిలే… తెలుగు ప్రేక్షకులు అవేమీ పట్టించుకోరు…
సారీ రాహుల్… నువ్వు తెలుగు రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నప్పుడే నేను ఇలా చెప్పాల్సి వచ్చినందుకు ఏమీ అనుకోకు… ఐనా నువ్వేమీ అనుకోవని నాకు కూడా తెలుసు… నా తమ్ముడిని, తన పార్టీని ఉద్దరించాల్సిన బృహత్తర బాధ్యత నాపై ఉంది… నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నాను, కానీ రాజకీయాలు నాకు దూరంగా ఎప్పుడున్నాయని… సో, రాజకీయాల్లో ఉంటా, కానీ ప్రత్యక్షంగా తెరపై ఉండను… కేవలం తమ్ముడి కోసం మంత్రాంగం, నైతిక మద్దతు ఎట్సెట్రా… నేను సైలెంట్ అయిపోయి, త్యాగం చేయడం ద్వారా తమ్ముడి రాజ్యాధికార సాధనకు బాటలు వేయడం… నో, నో, రేప్పొద్దున తమ్ముడు అధికారాన్ని సాధించినా సరే, నాకు సీఎం పోస్టు అక్కర్లేదు, వాడి కష్టార్జితం నాకు దేనికి..? తనే అనుభవించనీ…
Ads
ఎస్, ప్రజారాజ్యం నిమజ్జనం తనకు నచ్చలేదు… మాకు దూరమయ్యాడు… సొంత పార్టీ పెట్టుకున్నాడు… చూస్తూనే ఉన్నాను… నిర్భీతి, నిక్కచ్చితనం, నిజాయితీ, నిబద్ధత అన్నీ తమ్ముడి సొంతం… మొత్తానికి తను అనుకున్నది సాధిస్తాడనే నమ్మకం ఉంది నాకు… అలాంటప్పుడు కాంగ్రెస్‌లో ఎలా ఉండగలను..? అసలు కాంగ్రెస్‌లో ఎప్పుడు సరిగ్గా ఉన్నానని..!!
ఈ ఐడీకార్డు ఫేకో, రియలో నాకు తెలియదు, తెలుసుకునే ఆసక్తీ లేదు… ఎవరో సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ అట, కార్డు జారీ చేసినట్టున్నాడు… నవ్వొచ్చింది సుమీ… నిజంగానే నేను కాంగ్రెస్‌లోనే ఉన్నట్టయితే నా రేంజుకు నేను పీసీసీ డెలిగేట్‌నా..? నేను మాజీ కేంద్ర మంత్రిని… గట్టిగా తలుచుకుంటే కాంగ్రెస్‌కు నాలుగు వోట్లు సంపాదించి పెట్టడానికి కొంతైనా నా ఇమేజీ ఉపయోగపడగలదు… కానీ వీలు కాదే… నా తమ్ముడి పార్టీని ఓ గాడిన పడేయాలి కదా…
ఒక పెద్దన్నగా నా కర్తవ్యాన్ని నేనెలా మరిచిపోగలను..? ఇక నో దాపరికమ్స్… ఇన్నాళ్లూ మాట్లాడలేదు… ఏమో, రేప్పొద్దున గాడ్‌ఫాదర్ రిజల్ట్ నన్ను ఎటు తీసుకుపోనుందో ఇప్పుడే ఏం చెప్పగలను..? కానీ ఒక్కటి మాత్రం క్లియర్… నేను కాంగ్రెస్ పార్టీ వాదిని కాదు… తమ్ముడి జనసేనకే నా సపోర్ట్… తను చంద్రబాబు వైపు అంటే నేనూ అటే… తను మోడీ వైపు అంటే నేనూ అటే… మోడీ ప్లస్ బాబు వైపు అంటే మరీ మంచిది… తమ్ముడూ, చేతిలో ఉన్న సినిమాలు చకచకా పూర్తి చేసి రెడీగా ఉందాం… వోకేనా..?!
Share this Article