కాంతారకు ఎందుకింత ప్రశంస..? అంధవిశ్వాసాలను పెంచి పోషించే సినిమాకు ఏమిటీ అభినందనలు..? ఇవీ వినిపించే ప్రశ్నలు… అవి పరిమిత, సంకుచిత జ్ఙానం వేసే ప్రశ్నలు… అయితే ప్రజలపై బలమైన ప్రభావం చూపించగల సినిమాను ఒకే చట్రంలో పరిశీలించడం మూర్ఖత్వం అవుతుంది… చూసే కోణం, విశ్లేషకుడి రాగద్వేషాలు, జ్ఙానపరిధి, విశ్లేషణ సామర్థ్యం వంటి ఎన్నో అంశాలుంటయ్… జస్ట్, ఊరకే కొట్టేస్తే ఎలా..? సింపుల్‌గా నాలుగు సినిమాల్ని పరిశీలిద్దాం…
ఐఎండీబీలో టాప్ ర్యాంకు కాంతార… చాలా అరుదైన రికార్డు.,. గుడ్… గుర్తించదగిన ఓ గొప్పదనమే… కానీ ఒక సినిమా నాణ్యతకు, ప్రజాదరణకు, అభిరుచికీ అదేమీ గీటురాయి కాదు… టాప్ 50, టాప్ 100 పరిశీలిస్తే అర్థమవుతుంది… ఇప్పుడు మనం ఆ లోతుల్లోకి వెళ్లబోవడం లేదు కూడా… అది మరోసారి చెప్పుకుందాం… అయితే ఈమధ్య హిందీలో తీసిన సినిమాలన్నీ ఫట్‌మని దీపావళి తోకపటాకుల్లా పేలిపోతున్నయ్… కారణాలేమిటో ఆత్మసమీక్ష లోపించి, సౌతిండియా సినిమాల్ని తిట్టిపోయడం మొదలుపెట్టారు కొందరు… అది మరో మూర్ఖత్వం…
మీ ప్రేక్షకులకు ఏం కావాలో మీకు తెలియదు… ఇన్నేళ్లు చెత్తను ప్రేక్షకుల మెదళ్లలో నింపారు, నింపారు… ఇప్పుడు ప్రేక్షకుడు కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని కోరుకుంటున్నాడు… మారని హిందీ సినిమాల్ని ఈడ్చి తంతున్నాడు… మరి సౌత్ సినిమా..? హిందీ ఇండస్ట్రీ ఏడ్చినంత గొప్పగా ఏమీ లేదు, కాకపోతే బెటర్… కాంతార దగ్గరకు వద్దాం మళ్లీ…
Ads
పొన్నియిన్ సెల్వన్ :: మణిరత్నం నిస్సందేహంగా ఈ దేశం గర్వించదగిన దర్శకుడు… కానీ తనకు తమిళం తప్ప మరేమీ పట్టదు… తనది గ్లోబల్ లుక్ కాదు… పొన్నియిన్ సెల్వన్ అనేది తన డ్రీమ్ ప్రాజెక్టు, అది తమిళ ప్రైడ్ కథ… ఎన్ని వందల కోట్లను ఖర్చు చేస్తున్నాడనేది కాసేపు వదిలేయండి… తమిళంలో తప్ప ఇంకెక్కడా అది క్లిక్ కాలేదు… అదే కార్తి, అదే విక్రమ్, అదే జయం రవి, అదే త్రిష… ఎస్, జస్ట్, తమిళం… ప్రత్యేకించి అనేకాంశాల్లో తమిళం, తెలుగు కలిసి ప్రయాణిస్తుంటాయి కదా, తమిళంలో 300 కోట్ల దాకా వసూలు చేస్తే, తెలుగులో జస్ట్, 10 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటలేక కుయ్యో మొర్రో అంటోంది…
తమిళులకు సరే, ఇతర భాషల్లో ప్రేక్షకులకు ఆ పాత్రల్ని, బేసిక్ కథను పరిచయం చేయడానికే మణిరత్నం శక్తియుక్తులు హరించుకుపోతాయి అనుకున్నాం మనం… నిజానికి మణిరత్నం ఆ శ్రమ, ఆ ప్రయాసకు పూనుకోలేదు… తన తమిళ ప్రేక్షకుల కోసం, తన తమిళతనంతో మాత్రమే సినిమా తీశాడు… అదీ మిగతా భాషల్లో ఆ సినిమా చేతులెత్తేసింది… అయితే ఒక ప్రాంతంలో మాత్రం సినిమా సూపర్ హిట్… అందులో డౌట్ లేదు… స్థానికత వల్ల వచ్చిన బలం…
అయితే ఇదే బలం అన్నిచోట్లా పనిచేస్తుందా లేదు..? ఉదాహరణకు మరక్కర్… కేరళలో అదీ పొన్నియిన్ సెల్వన్‌లాగే ప్రసిద్ధమైన కథ… సముద్రవిజేతగా ఆ ప్రాంత ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటారు… దానికీ వందల కోట్లు ఖర్చుపెట్టాడు మోహన్‌లాల్, రాజీపడలేదు… పొన్నియిన్ సెల్వన్‌లాగే గ్రాఫిక్స్… కానీ ఫ్లాప్… జనం ఎందుకో ఇష్టపడలేదు… కారణం కథలో దమ్ములేక కాదు, కేరళ ప్రైడ్‌లా వెలగాల్సిన కథను సరిగ్గా ప్రజెంట్ చేయడంలో వైఫల్యం, ఆసక్తికరంగా ప్రేక్షకుడికి కథ చెప్పలేకపోవడం… కథ చెప్పడం అంటే మరో ఉదాహరణ చెప్పాలి…
తెలుగులో అల్లూరి, కుమ్రం భీమ్… రెండు ఆదివాసీ ప్రాంతాల చారిత్రిక పోరాటాలకు నాయకులు… సరిగ్గా తీసి ఉంటే ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలవాల్సిన సినిమా… కానీ వాళ్ల కథల్ని పూర్తిగా వక్రీకరించి, చివరకు అల్లూరిని బ్రిటిష్ సైన్యంలో జవానుగా మార్చిన నీచమైన క్రియేటివ్ ఫ్రీడం… రాజమౌళి టేస్ట్ అది… ఇలాంటి కథల్ని రాసిన విజయేంద్రప్రసాద్‌ను చూసి, ఆయన మెడలోని రాజ్యసభసభ్యత్వం పక్కుననవ్వింది… బీజేపీ పెద్దల మందబుద్ధిని పరిహసిస్తున్నట్టుగా… ఇదీ తెలుగు ప్రైడ్ దురవస్థ… దీనికీ వందల కోట్ల ఖర్చు, గ్రాఫిక్స్… తెలుగు సినిమాకు ఓ మకిలి…
మరి కాంతార… జస్ట్, 15 కోట్ల ఖర్చు… ఇక్కడ మనం చెప్పుకున్న మూడు సినిమాల క్యారవాన్ల ఖర్చు కాదు… కానీ ఈరోజు వసూళ్లలో గానీ, అనితర సాధ్యమైన కథ ప్రజెంటేషన్ గురించి గానీ… ప్రత్యేకించి క్లైమాక్స్… దేశం ఏకరీతిలో చప్పట్లు కొడుతోంది… ఇందులోనూ ఒకటీఅరా గ్రాఫిక్స్… ఎస్, నా మంగుళూరు ప్రైడ్ అన్నాడు దర్శకుడు రిషబ్ గర్వంగా… నా సంస్కృతిని, నా మట్టి కథను, నా ప్రజల కళాశ్వాసను ప్రజెంట్ చేస్తున్నాను అన్నాడు… చేసి చూపించాడు…
ఎక్కడా కథ నుంచి డీవియేషన్ లేదు… అట్టహాసాల్లేవు, ఆడంబరాల్లేవు… అందుకే జనం సినిమాలను అబ్బురంగా గుండెలకు హత్తుకున్నారు… తమ కథ, తమ సినిమా, తమ కల్చర్, తమ భాష, తమ ఆట, తమ పాట… మరింత వెలిగిపోతూ… అదే కాంతార విజయం…!! తక్కువ ఖర్చుతో ఓ ప్రాంత కళాసంస్కృతికి కట్టిన పట్టం అది… అందులో మెరిట్ ఉంది, తపన ఉంది, తపస్సు ఉంది… మరి మెచ్చుకోళ్లలో తప్పేముంది..?!
మరి నాలుగూ ఆయా స్థానికులు మెచ్చి, ఎన్నో ఏళ్లుగా కీర్తిస్తున్న కథలే కదా… మరి ఏమిటీ భిన్న ఫలితాలు..? కొంచెం లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది… మన తెలుగు సినిమా పెద్దల నీచాభిరుచులూ అర్థమవుతాయి… ఎంతసేపూ బిల్డప్పులు, డొల్ల ఇమేజీలు, వసూళ్ల లెక్కలు కాదు… కళాకారుడికి ఓ తడి ఉండాలి… అది ఆరిపోయిన ఎడారి ఏమిటో అర్థం కావాలంటే ఈ నాలుగు సినిమాలను కాస్త భిన్నంగా చూడాలి..!! ఏళ్ల కెరీర్ కాదు, ఇదిరా నా సినిమా అని ఛాతీ విరిచి చూపించగల ఒక్క సినిమా నీ పుస్తకంలో ఉండాలి… అది రూట్స్‌ను ముద్దాడినప్పుడు అర్థమవుతుంది…!!
Share this Article