దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమిటి..? ఒక సినిమాను జస్ట్ తనే నిర్మించి, మిగతా అంశాల్లో వేలుపెట్టకపోవడం, ఓ చిన్న దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇవ్వడం ఏమిటి… అని అప్పట్లో ఓ చిన్న ఆసక్తి… హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఆ సినిమాకు ప్రాణంగా నిలిచి… 4 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు 40 కోట్లు వచ్చిపడ్డయ్… అందుకని ఆ దర్శకుడు కేవీ అనుదీప్ తదుపరి ప్రాజెక్టు మీద ఆసక్తి… తాజాగా విడుదలైన ఆ సినిమా పేరు ప్రిన్స్…
అందులో హీరో శివ కార్తికేయన్… అప్పట్లో కౌసల్యా కృష్ణమూర్తిలో కనిపించినట్టున్నాడు… డాన్, డాక్టర్ అంటూ ఈమధ్య తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించాడు… సరే, ఓ తమిళ నటుడు… మల్టీ టాలెంటెడే కానీ మన తెలుగుకు చుట్టరికం చాలా తక్కువ… సరే, అనుదీప్ తనను హీరోగా ఎంచుకున్నాడు కదా అని ఓ చిన్న ఆసక్తి… జాతిరత్నాలులో ఫరియా అయినా, ప్రిన్స్‌లో మరియా అయినా హీరోయిన్లకు పెద్ద సీనేమీ ఉండదు… అయితే మరి ఆ జాతిరత్నాలు అంత పెద్ద హిట్ కదా, మరి ఈ ప్రిన్స్ మాటేమిటి..? అదీ చిన్న ఆసక్తి…
నిజానికి జాతిరత్నాలు సినిమా ఎలా హిట్టయ్యిందనేదే పెద్ద మిస్టరీ… అసలు లాజిక్కు లేకుండా సినిమా తీయడం ఎలాగో ప్రపంచానికి చెప్పిన సినిమా అది… అంతటి ఘోరమైన కథ, కథనాన్ని మనం చూడలేం… కానీ జబర్దస్త్ తరహా పంచ్ డైలాగులు, సీన్లు వరుసగా ఒకదానిపై ఒకటి మనల్ని ఊపిరాడనివ్వవు… సిల్లీ ఫెలోస్ అని నవ్వుకుని, ఆ నవ్వు ఆపేలోపు మరొకటి… నవ్వుతూనే ఉంటాం, సినిమా అయిపోతుంది… అయితే ప్రతిసారీ ఇది రిపీటవుతుందా..? కాదు… అసలే కాదు, కొన్ని కొన్నిసార్లు మాత్రమే వర్కవుట్ అవుతాయి… ఎస్, ప్రిన్స్ అందుకే తన్నేసింది…
Ads
సేమ్, జాతిరత్నాలు… ఇందులో కూడా కేరక్టర్లు వస్తుంటాయి, పోతుంటాయి, మాటల అతిసారవ్యాధి పట్టినట్టు మాట్లాడుతూనే ఉంటాయి… తలాతోకా లేని సిల్లీ కామెడీ… కానీ ఒక దశలో ప్రేక్షకుడికి చిరాకెత్తుతుంది… మరీ సెకండాఫ్ ఓ దశ ఓ దిశ లేకుండా పోయింది… ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కాస్త కామెడీ నవ్వించినా సరే, సెకండాఫ్‌లో దర్శకుడు చేతులెత్తేశాడు, నిజానికి తను చేతులెత్తేయలేదు, తనదైన స్టయిల్ అది, అందులోనే పరుగు తీశాడు, ఎటొచ్చీ ప్రతిసారీ జాతిరత్నాలే రిపీట్ కాదు కదా…
సినిమాలో కామెడీ వేరు… నవ్విస్తుంది, ఆహ్లాదాన్నిస్తుంది… కానీ సినిమానే కామెడీ చేస్తే..? లాజిక్కులు లేకుండా, కథ మన్నూమశానం లేకుండా, ఎమోషన్స్ లేకుండా… జాతిరత్నాలు సెకండ్ పార్ట్ తీసుకొచ్చాం చూడండి అంటే కుదురుతుందా..? కుదరదు… ఇదీ అంతే… అవునూ, బ్రిటిషర్ అయితే పెళ్లి చేసుకోకూడదా..? అది దేశభక్తికి వ్యతిరేకమా..? ఇప్పటికీ బ్రిటిషర్లకు దేశంలో ఆస్తులు, భూములున్నాయా..? ఆంగ్లో ఇండియన్స్ వేరు- బ్రిటిషర్స్ వేరు అనే సంగతి ఈ దర్శకుడికి తెలుసా..? సర్లెండి, ఇవన్నీ ఆలోచిస్తే అది ప్రిన్స్ ఎందుకవుతుంది..? ఏవో పది వాగుడుకాయల్ని కేరక్టర్లను చేసేసి, ఫుల్ కామెడీ పీస్ తీసేశాను అన్నట్టుగా కలరిచ్చాడు దర్శకుడు… ఇదేమరి కామెడీ అంటే… సిల్లీ కామెడీ…!! అవునూ… ఇందులో ఒక్క తెలుగు కమెడియన్ మొహం కనిపించలేదు… అన్నీ తమిళ మొహాలే… హీరోయిన్ కూడా from ఉక్రెయిన్… ఇంతకీ ఇది తమిళ్ డబ్బింగా, తెలుగు స్ట్రేయిటా….
Share this Article