ఏడు కొండల వెనుక నుంచి జిన్నా అనే టైటిల్ వస్తుంటే… అది ఏమైనా వివాదానికి దారితీస్తుందేమో అనుకున్నారు… ఐనా అనితర సాధ్యమైన మరో షిర్డి గుడిని కట్టించి, ఇక భక్తులు షిర్డికి వెళ్లనక్కర్లేదన్న అత్యంతాతి హిందూ భక్తిపరుడు మంచు మోహన్‌బాబుతో పెట్టుకోవాలంటే హిందూ సంస్థలకు కూడా అంత ధైర్యమెక్కడ ఉంటుంది..?
పైగా ఇంట్రడక్షన్‌లో జైశ్రీరాం అనిపిస్తే సరి… అంతేనా..? హీరో చేతి మణికట్టుకు మూడు ఓంకారాలు చెక్కిన ఓ బ్రేస్‌లెట్, దానికి హనుమంతుడి బొమ్మ… ఇంకేం కావాలి..? పాకిస్థాన్ జాతిపిత పేరు జిన్నా కదా… అదేమైనా వివాదాస్పదం అవుతుందా..? అబ్బే, అదీ లేదు… అది జిన్నా కాదట… గిన్నా అట… అలియాస్ గాలి నాగేశ్వరరావు అట… షార్ట్ ఫామ్‌లో జిన్నా అయ్యాడట… పిచ్చి లేస్తున్నట్టుగా ఉందా..? అవును మరి, కోన వెంకట్ కథ అంటేనే అది… ఈ సినిమాలోనూ అదే…
అసలు సినిమాయే చిన్న చీటింగ్ హహహ… అంతటి పోర్నరి సన్నీని తీసుకొచ్చి పెట్టారు… మరో బాంబు పాయల్ రాజ్‌పుత్ అన్నారు… తీరా చూస్తే సినిమాలో ఆ రేంజ్ గ్లామర్ ఏముంది..? లేదు, సరికదా, ఆ స్వల్పమాత్రం హైప్ కూడా రాలేదు… పేలవమైన అడ్వాన్స్ బుకింగులే తార్కాణం… సరే, ఇదంతా ఫర్ ఫన్… సినిమా విషయానికొస్తే… ఇది సన్నీ లియోని సినిమా… పైగా వాళ్లు ముందే చెప్పినట్టుగా ఇందులో హారర్ లేదు, మన్నూమశానం ఏమీ లేదు… ఓ రొటీన్ కథకు కోన వెంకట్ ఎప్పటిలాగే కామెడీ కేరక్టర్లను కట్టేసి పరుగులు తీయించాడు… మూగ, చెవిటి పాత్రలో ఎంట్రీ ఇచ్చిన సన్నీతో నటింపజేయడానికి ప్రయత్నించారు…
Ads
నిజానికి కరెంటు తీగ నాటి సన్నీకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది… మొహంలో ఆ చార్మ్ పోయింది… బరువు పెరిగినట్టుంది కాస్త… కాకపోతే ఎక్స్‌పోజింగుతో సరిపెట్టకుండా ఆమె పాత్రకు కొంత ప్రాధాన్యం ఇచ్చారు… స్థూలంగా చెప్పాలంటే విష్ణు పాత్రకన్నా ఈమె పాత్రకే ప్రాధాన్యం… ఏదో కష్టపడింది, కానీ పాయల్ రాజ్‌పుత్ పాత్ర గురించి, ఆమె గురించి మాత్రం చెప్పుకోవడం వేస్ట్… సినిమాలో గుర్తుండేవి మరో రెండు పాత్రలు చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్…
కొన్ని కామెడీ సీన్లు పండాయి… కానీ బేసిక్‌గా ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక కామెడీ అనే ఫార్ములా అంతగా ప్రేక్షకులకు ఎక్కదు… పైగా ఎప్పుడైతే సన్నీ పాత్ర తాలూకు సస్పెన్స్ విడిపోతుందో ఇక సినిమాలో గ్రిప్ సడలిపోయింది… ఏమాటకామాట మంచు విష్ణు బిడ్డలు అరియానా, వివియానా పాడిన పాట బాగుంది…
అయితే బేసిక్‌గా కథానాయకుడి పాత్ర కేరక్టరైజేషన్ అనౌచిత్యమే మైనస్… తన అప్పులు తీర్చడం కోసం, తన అవసరాల కోసం, ఓ చిన్ననాటి స్నేహితురాలిని చీట్ చేయడం అనేది ప్రేక్షకుడికి మింగుడుపడదు… సరే, ఇదంతా కథ కోసం, ఫన్ కోసం అంటారా..? కాదు… ఇది బలమైన యాంటీ సెంటిమెంట్ ఫ్యాక్టర్… ఐనా ఇవన్నీ ఆలోచిస్తే అది కోన వెంకట్ సినిమా ఎందుకు అవుతుంది..?
ఇంతసేపూ మనం కోన వెంకట్ గురించే చెప్పుకుంటున్నాం, కానీ దర్శకుడి పేరు సూర్య అని వేశారు కదా టైటిల్స్‌లో అనే డౌట్ వచ్చిందా..? మనకూ సమజ్ కాలేదులే గానీ చివరగా :: తనను ట్రోల్ చేయడం మీద కూడా ఈ సినిమాలో డైలాగ్స్ వేసుకున్న విష్ణు ఈమధ్య కొన్ని విమర్శలు చేశాడు…
తనను బదనాం చేయడానికి ఓ అగ్రహీరో ప్రత్యేకంగా ఓ ఐటీ కంపెనీయే పెట్టాడని, పెయిడ్ రివ్యూయర్లున్నారనీ, తన మీద చెత్త వీడియోలు పెట్టే యూట్యూబ్ చానెళ్లు మూసేయిస్తామనీ చెబుతున్నాడు… ఆ అగ్రహీరోకు విష్ణు అంత బలమైన పోటీదారుడా..? ఆ చర్చలోకి వద్దు గానీ… అలాంటి అగ్ర హీరోలకు సమాధానం చెప్పాలంటే న్యాయవివాదాలు, వ్యాజ్యాలు, పంచాయితీలు, విమర్శలు కావు… బలమైన సినిమాతోనే జవాబు చెప్పాలి… ప్చ్, జిన్నా ఆ దిశలో లేదు..!!
Share this Article