ధన త్రయోదశి సందర్భంగా అందరూ ఎంతోకొంత బంగారం కొనాలని కొన్నేళ్లుగా మన తెలుగు మీడియాలో సాగుతున్న ప్రచారం.., బోలెడు స్టోరీలు రాస్తారు… ఫోటోలు వేస్తారు… ధన్‌తేరాస్ పేరిట ఈరోజుకు అత్యంత పవిత్రతను కట్టబెట్టి తెలుగు మీడియా తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాఠకులకు చేస్తున్న ద్రోహం… కేవలం బంగారం దుకాణాలకు గిరాకీ పెంచే ఓ పిచ్చి ప్రయత్నం…
మనం ఆమధ్య విపరీతంగా మీమ్స్, పోస్టులు, సోషల్ చెణుకులు చదివాం గుర్తుందా…? పర్సులో అయిదు యాలకులు పెట్టుకోవడం, బీరువాలో దాల్చినచెక్క… వాడెవడో మరీ బల్లి తోకను జిల్లేడు చెట్టుకు కట్టాలని కూడా చెప్పాడు… అదుగో ఈ ధన త్రయోదశి సంబంధ వార్తల్ని, కథనాల్ని అంతకు భిన్నంగా ఏమీ తీసుకోనక్కర్లేదు… సేమ్, సేమ్…
ఎవడికి ఏది నోటికొస్తే అది రాసేస్తాడు… ఒకడు ఓ పత్రికలో రాశాడు ఏమిటంటే… అమృతం కోసం సాగరాన్ని మథిస్తుంటే లక్ష్మిదేవి పుట్టిందట, ఆమె వెంట ధన్వంతరి పుట్టాడట, పుట్టాక సూర్యుడి దగ్గర శిష్యరికం చేసి వైద్యాన్ని నేర్చుకున్నాడట… అందుకని లక్ష్మిదేవితోపాటు ధన్వంతరికీ పూజలు చేయాలట… అసలు ఒకదానికీ మరోదానికీ ఏమైనా సంబంధం ఉందా..? ప్రతివాడూ ప్రవచనకారుడే అయిపోయాడు ఈమధ్య…
Ads
ఇది సాక్షి సైట్… బహుశా పత్రికలో కూడా ముద్రించే ఉంటాడు… మరీ ఈమధ్య ఓ రీతి లేకుండా, గతి లేకుండా కొట్టుకుపోతున్నది ఈ పత్రిక… లక్ష్మిని, కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుతో 21 బియ్యపు గింజలను ఎర్రటి బట్టలో కట్టి బీరువాలో ఉంచుకోవాలట… జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే సరిసంపదలకు లోటు ఉండదట, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట… పర్సులో యాలకులు ప్రవచనం గుర్తొచ్చిందా..? మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సిగ్గూశరం లేని రాతలకు తెగబడితే ఇక ఏం చెప్పాలి..?
ఇంకా ఏం రాసిందో తెలుసా..? ధనత్రయోదశి రోజున కొత్త చీపురు కొనడం అదృష్టానికి చిహ్నమట… చీపురును శ్రీమహాలక్ష్మిగా భావిస్తారట… రోజూ పొద్దున జీతెలుగులో రెండు ప్రోగ్రాములు వస్తాయి… పేరుకు భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు… కానీ అందులోని అపరదేవుళ్లు మనల్ని రకరకాల వింత పూజలు, తంతులతో పాతరాతి యుగానికి తీసుకెళ్తుంటారు… తెలుగు టీవీ ప్రోగ్రాముల్లోకెల్లా అత్యంత చెత్త కార్యక్రమాలవి… ఇలాంటివి యూట్యూబ్ చానెళ్లు విచిత్రమైన థంబ్ నెయిల్స్‌తో ప్రచారం చేస్తుంటాయి… వాటికీ మెయిన్ స్ట్రీమ్‌కు తేడా లేకుండా పోయింది…
దీపావళి జరుపుకోవడానికి రకరకాల కారణాలుంటయ్… అందులో మహాలక్ష్మి పూజ కూడా ఒకటి… ఉత్తరాది వ్యాపారులకు దీపావళి నుంచే కొత్త వ్యాపార సంవత్సరం ప్రారంభం… అందుకే దీపావళి రోజే కొత్త ఖాతా పుస్తకాల్ని స్టార్ట్ చేస్తారు… (తెలంగాణలోనూ చాలామంది వ్యాపారులు దీన్ని పాటిస్తారు…) రెండు స్టాక్ ఎక్స్‌చేంజులు కూడా మూరత్ ట్రేడింగ్‌ను ప్రత్యేకంగా సాయంత్రం వేళ నిర్వహిస్తాయి… వ్యాపారేతరులకు దీపావళి అంటే ప్రధానంగా నరకాసుర వధ సందర్భం… నరక చతుర్దశి రోజున హారతులు స్వీకరించడం అందుకే… దానికీ అమావాస్య రోజున సాగే మహాలక్ష్మి పూజలకు సంబంధం లేదు…
నిజానికి పండుగపూట ఎంతోకొంత స్థోమత ఉన్నంతమేరకు బంగారం లేదా వెండి కొనాలనేది తెలంగాణలో కూడా ఉన్నదే… కానీ అది దీపావళికి కాదు… దసరాకు..! ప్రత్యేకించి ఇంట్లో ఆడపిల్లలుంటే ఎంతోకొంత బంగారం కొనాలని చెబుతారు… పెళ్లి ఈడు నాటికి ఎంతోకొంత బంగారం జమ అవుతుందని నమ్మకం, ఆశ, పొదుపు… దాన్ని తొక్కిపారేసి, కొత్తగా ధనత్రయోదశిని రుద్దుతున్నారు… తోడుగా ధన్వంతరిని ఎందుకు కలుపుతారో మీడియా ప్రవచనకారులకే తెలియాలి… వాళ్లే కదా జాతిని నడిపించే కరదీపికలు…
Share this Article