కాంతార సినిమాలోని సూపర్ హిట్ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్ నవరసం పాటకు కాపీ అని ఓ వివాదం… లీగల్ నోటీసులు… మీడియా కవరేజీ… గతంలో ఇదే మంగుళూరు ప్రాంతం నుంచి వచ్చిన పింగారా సినిమాకు కాంతార కాపీ అని మరో వివాదం… ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందట.,.. ఇప్పుడు దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదులుతారట… దీనిపైనా మీడియా కవరేజీ… పనిలోపనిగా భూత్ కోళ సంప్రదాయానికీ హిందూ మతానికీ సంబంధం లేదని మరో చర్చ…
ప్రధాని మోడీ కాంతార సినిమాను చూడాలని అనుకుంటున్నట్టు మరో వార్త… ఇన్ని వార్తల నడుమ ఆ సినిమా మాత్రం దేశవ్యాప్తంగా దూసుకుపోతూనే ఉంది… ప్రజలు కాంతార మీద వస్తున్న నెెగెటివ్ స్టోరీలను పట్టించుకోవడం లేదు… మరింత బలంగా ఆ సినిమా వైపు ఆకర్షితులు అవుతున్నారు… నిజానికి ఆ సినిమాకు క్లైమాక్సే ప్రాణం… రజినీకాంత్ సహా పలు భాషల ప్రసిద్ధ హీరోలు కూడా సినిమాను ప్రశంసిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న ట్వీట్లు సినిమాకు మరింత బలాన్ని పెంచుతున్నాయి… క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటన నభూతో…
ఇదేసమయంలో అది సాధిస్తున్న వసూళ్ల రికార్డుల వార్తలు కూడా కనిపిస్తున్నాయి… సాక్‌నిక్ సైట్ గణాంకాల ప్రకారం ఈ సినిమా ఇప్పటికే 232 కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా… ఇప్పటికీ స్టడీగా సాగుతోంది… దానికి పెట్టిన పెట్టుబడి 16 కోట్లు… ఈ వసూళ్ల లెక్కలు ఓ పెద్ద మాయ… వాటిని వదిలేద్దాం… అలాగే ఐఎండీబీ టాప్ 1000 సినిమాల జాబితాలో నంబర్ వన్ ప్లేసులోకి వచ్చింది కాంతార… ఇది అనూహ్యం… 9.4 ర్యాంకింగుతో ఈ ప్లేసులో ఉండటం అసాధారణంగానే ఉంది… కానీ ఐఎండీబీ ర్యాంకుల లెక్క కూడా ఓ మాయ… అదీ పక్కన పెట్టేద్దాం…
Ads
తాజాగా మరో రికార్డు తెరపైకి వచ్చింది… ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో వీక్షకులు చూసిన సినిమా ఇదేనని లెక్క తేల్చారట కర్నాటకలో… నిజానికి ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం కేజీఎఫ్-2 వసూళ్లు 1200 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నయ్… ఇప్పట్లో దాన్ని బీట్ చేయడం అసాధ్యం… కానీ అక్టోబరు 24 నాటికి కర్నాటకలో (ఆ రాష్ట్రంలోనే) అమ్ముడైన టికెట్ల సంఖ్య లెక్క తీస్తే… కేజీఎఫ్ -2 సినిమాకు 75 లక్షల టికెట్లు తెగితే, కేజీఎఫ్-1 సినిమాకు 72 లక్షల టికెట్లు తెగినాయట… కానీ కాంతార సినిమా టికెట్లు మాత్రం 77 లక్షల టికెట్లు తెగినట్టు ట్రేడ్ పండితులు లెక్క తేల్చారు… పైగా కాంతారా ఇంకా బెంగుళూరులోనే 390 షోస్ నడుస్తోంది… ఇతరత్రా పట్టణాలు, నగరాలు గాకుండా…
ఈలెక్కన ఇప్పటివరకు కన్నడ ప్రజలు ఎక్కువగా చూసిన సినిమా కాంతార అని తేల్చేశారు… సరే, ఈ లెక్కలు కూడా ఓ మాయ అనుకుందాం… ఇప్పటికీ తెలుగు, హిందీ, కన్నడ వెర్షన్లు కలిపి రోజుకు ఏడెనిమిది కోట్ల మేరకు స్టడీగా వసూలు చేస్తున్నట్టు మరో లెక్క… ప్రత్యేకించి తెలుగు, హిందీ భాషల వెర్షన్లు ఇతర స్ట్రెయిట్ సినిమాల్ని దాటేసి, దూకుడు ప్రదర్శిస్తున్నాయి… మొత్తానికి కాంతార సినిమాది ట్రేడ్ పరంగా కూడా రికార్డే..!
Share this Article