ఆలీవుడ్… టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తరహాలో ఆలీవుడ్… అనగా ఆలీ అనబడే కమెడియన్ కమ్ పొలిటిషియన్ కమ్ టీవీ ప్రజెంటర్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్… తాజాగా నిర్మాత ఆలీ తీయబోయే సినిమాలను ఆలీవుడ్ అని పిలవాలట… పేరు బాగుంది… క్రియేటివ్‌గా ఉంది… ఓ సినిమా తీశాడు… అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి… సినిమా పేరు అదే… ఆలీ తత్వం కూడా అదే…
సినిమా తీశాడు కానీ థియేటర్ల దాకా రానివ్వలేదు… అందులో అంత దృశ్యము లేదని తనకూ తెలుసు… దాంతో ఆహా దొరికాడు కదాని అల్లు అరవింద్‌ను అడిగాడు… తనతో ఈమధ్య ‘ఆలీతో సరదాగా’ చాట్ షో కూడా చేశాడు ఈటీవీలో… ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కదాని అరవింద్ కూడా ఏదో ఓ ధరకు కొనేశాడు… ఖేల్ ఖతం… సినిమా ఇప్పుడు ప్రసారమవుతోంది… ఎలా ఉంది..?
చివుక్కుమంది… చివరకు చిన్న చిన్న సినిమాలకు సంబంధించి కూడా తెలుగులో కథలు రాసే దిక్కు లేదా..? ఒకవైపు సూపర్ కథకులు అంటూ కేంద్రం విజయేంద్రప్రసాద్ వంటి స్టోరీ రైటర్లకు రాజ్యసభ సభ్యత్వాలను కట్టబెడుతోంది… ఇంకోవైపు ఘోరమైన కథాదరిద్రం ఆవరించి ఉంది… ఢామ్మని పేలిపోతున్నా సరే పెద్ద స్టార్లకూ మలయాళ కథలు, వాటి రీమేకులే కావాలి… చివరకు చిన్న కథలకూ అంతేనా..?
Ads
ఆలీ తీసిన ఈ సినిమాకు ఒరిజినల్ మలయాళంలో వచ్చిన వికృతి అనే సినిమా… సరే, తీశారుపో… ఆలీకి హీరోయిన్ దేనికి..? పాటలు దేనికి..? కథకు పలుచోట్ల అడ్డంపడతాయి… తనేమైనా రెగ్యులర్ హీరో అనుకుంటున్నాడా..? పైగా ఇప్పుడు సినిమాల్లో పాటలు ఎవడు చూస్తున్నాడు..? డాన్స్ పేరిట పిచ్చి స్టెప్పులేస్తే జనం ఈడ్చి రివర్స్ కొడుతున్నారు… సరే, కథ బాగుంది, ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు… అదీ చేతకాలేదు… నిడివి పెద్ద సమస్య…
నరేష్… తన తాజా ఇన్నింగ్స్‌లో (పవిత్రతో బంధం పెరిగాక…) రెచ్చిపోయి నటిస్తున్నాడు… తన నటనలో పరిపూర్ణత కనిపిస్తోంది… అలాంటి వ్యక్తిని మూగోడిగా చూపించాల్సిన పనిలేదు… ఆలీ, పవిత్రా లోకేష్, మంజుభార్గవి, తనికెళ్ల భరణి తదితర సీనియర్లున్నప్పుడు ఒక్కొక్క పాత్ర చిత్రణ ఎంత బాగుండాలి..? ఏదో కథ నడిపించేశారు… పైగా స్లో… నిజమే, సోషల్ మీడియాలో వికృత ధోరణులు మనిషి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి… ఇదీ ఆ పాయింట్‌పై తీయబడిన సినిమాయే…
కనీసం ఈ బేసిక్ నిజ జీవిత పాయింట్ల మీద సింపుల్ లైన్‌తో స్టోరీలు రాసుకునే దిక్కు కూడా లేదా తెలుగులో… ఎడారిలా కనిపిస్తోందా..? లేక రీమేక్ అయితే దాన్ని చూసి, ఒకటీరెండు చిన్న మార్పులతో లాగించేస్తే సరిపోతుందనే భావదరిద్రమా..? సో, ఆలీ… ఇండస్ట్రీ బాగుండాలి, అందులో మన కథలూ ఉండాలి, మన కథకులూ బతకాలి… ఏమంటావ్..?! కానీ ఏమాటకామాట… ఆలీ, హీరోయిన్‌కన్నా నరేష్, పవిత్రల్ని చూడటానికే ప్రేక్షకుడు ఇంట్రస్టు చూపిస్తున్నాడు కాస్తోకూస్తో…!!
Share this Article