చిన్న సినిమా అని తేలికగా తీసుకునే పనిలేదు… అది తప్పు కూడా… ప్రత్యేకించి ‘పెద్ద సినిమాల’కు రోజులు బాగాలేవు… స్టార్లు, బిల్డప్పులను జనం ఇష్టపడటం లేదు… అక్షయ్, అజయ్, చిరంజీవి, మోహన్‌లాల్ అందరూ ఈ ఫలితాల్ని అనుభవిస్తున్నవాళ్లే… అదేసమయంలో సరిగ్గా తీయబడిన కొన్ని చిన్న సినిమాలు తోకపటాకులు అనుకుంటే సుతిలి బాంబుల్లా పేలాయి… ఉదాహరణకు, కార్తికేయ-2, కాంతార, సీతారామం ఎట్సెట్రా… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ వంటి గ్రాఫిక్ మసాలాల గురించి చెప్పుకోవడం దండుగ…
ఇదెందుకు చెప్పుకోవడం అంటే… దర్శకుడికి గనుక తను తీయబోతున్న సినిమా మీద పూర్తి సోయి ఉండి, ప్రేక్షకుడికి కొత్తగా ఏం చెబుతున్నాననే ధ్యాస ఉండాలి… ఆ దిశలో వర్క్ జరగాలి… ఉదాహరణకు ‘అనుకోని ప్రయాణం’ అనే సినిమా… అప్పట్లో 2007లో గెట్టింగ్ హోమ్ అని ఓ చైనా సినిమా వచ్చింది… దానికి కరోనా లాక్ డౌన్ నేపథ్యం కలిపితే ఈ అనుకోని ప్రయాణం కథ… సరే, ఏదో ఫ్రీమేక్… తెలుగీకరించుకోవడంలో వైఫల్యం…
నిజానికి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌తోపాటు ఒకప్పటి నటుడు నరసింహరాజు, ప్రేమ, తులసి, శుభలేఖ సుధాకర్, కొందరు కమెడియన్లు ఎట్సెట్రా ఉన్నప్పుడు కథాకథనాల మీద ఎంత శ్రద్ధ చూపించాలి… పైగా ఒకప్పుడు తెలుగు సినిమాల దుమ్ముదులిపిన పరచూరి బ్రదర్స్ డైలాగులు రాశారు… మనసుపెట్టి రాశారు… ఎంత బాగా వాడుకోవాలి..? ప్చ్, అదే కొరవడింది… నిజానికి మంచి కంటెంటు… హఠాత్తుగా తన దోస్త్ మరణిస్తే, అసలు మానవసంబంధాల మీదే నమ్మకం లేని హీరో ఆ దోస్త్ శవాన్ని పలుకష్టాలకోర్చి తన సొంత గ్రామానికి చేర్చడం కథ… ఈలోపు తను ఏం నేర్చుకున్నాడనేది కథలో నీతి…
Ads
కరోనా బాపతు సీరియస్ కష్టాలను ఇప్పుడు చూడటం ఎవడికీ ఇష్టం లేదు… అథవా చూపినా సరే, దానికి కాస్త కామెడీ కోటింగ్ అవసరం, అదీ సరిగ్గా సూటయ్యే కాస్త నాణ్యమైన కామెడీ… కానీ ఈ సినిమాలో ఎంత నాన్‌సీరియస్‌నెస్ అంటే రాజేంద్రప్రసాద్‌కు ఓ ఫైట్… కమెడియన్ల కామెడీ అస్సలు పేలలేదు… నిజానికి ఇలాంటి సినిమాల్లో ఎమోషన్ బలంగా ఆవిష్కారం కావాలంటే మంచి పాటలు అవసరం… అదీ లేదు…
కథ అర్థమైంది కదా… ‘‘భువనేశ్వర్ లోని ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ లో రోజువారీ కూలీలు రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు… ఇద్దరూ దోస్తులు… జీవితాలు సాఫీగా సాగుతుంటాయి… ఈలోపు కరోనా లాక్ డౌన్, నరసింహరాజు చనిపోతాడు… ఆ శవాన్ని రాజమండ్రి దగ్గర సొంతూరికి చేర్చాలి… అసలు బంధాలంటేనే చిరాకుపడే రాజేంద్రప్రసాద్ ఈ బాధ్యతను నెత్తిమీద వేసుకుని అనుభవించిన తిప్పలేమిటనేదే కథ…
బేసిక్ స్టోరీ లైన్ బాగుంది… కానీ దాన్ని తెలుగు ప్రేక్షకుడికి ఎక్కేలా ప్రజెంట్ చేయడంలో ఫెయిల్యూర్ కనిపిస్తోంది… అసలు సినిమా ఎత్తుకోవడమే వైకుంఠపాళిలోని నిచ్చెనలను, పాముల్ని చూపించిన దర్శకుడు ఇక అక్కడే తన క్రియేటివిటీని, థాట్ ప్రాసెస్‌ను ఆపేసినట్టున్నాడు… పరుచూరి బ్రదర్స్ కలాల్లో ఇంకా సిరా గడ్డకట్టిపోలేదు… అలాగే వేడిగానే ఉంది… అర్థవంతమైన డైలాగ్స్ రాశారు…
రాజేంద్రప్రసాద్ నటన ఓరకమైన మొనాటనీ… నరసింహరాజు, తదితరుల గురించి చెప్పుకోవడం వేస్ట్, వాళ్ల నుంచి సరైన ఔట్‌పుట్ రాబట్టుకోవడంలో కూడా దర్శకుడికి తడబాటే… నిజానికి రన్ టైమ్ కూడా తగ్గించొచ్చు… అదైనా చేయలేకపోయారు… వెరసి అనుకోని ప్రయాణం అంతగా ఆకట్టుకోలేదు…!!
Share this Article