దీపావళికి ముందు ఏం సినిమాలున్నయ్..? కొన్నిరోజులు బింబిసార, సీతారామం బాగానే నడిచాయి… వాటికి డబ్బులొచ్చాయి… రెండూ హిట్… ఇక కార్తికేయ-2 అనూహ్యమైన హిట్… హఠాత్తుగా అదీ పాన్ ఇండియా సినిమా అయిపోయింది… కోట్లకుకోట్లు నడిచొచ్చాయి… వోకే, ఇంకా..?
దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో జిన్నాది ఓ విషాదగాథ… ఫాఫం, మా అధ్యక్షుడు మంచు విష్ణు అందులో హీరో, పాన్ ఇండియా సినిమా… సన్నీలియోన్, పాయల్ రాజపుత్ కూడా ఉన్నారు… కోన వెంకట్ కథ… ఇంకేం కావాలి..? కనీసం ఆరేడు కోట్లకయితే ఢోకా ఉండొద్దు కదా… కానీ సినిమా గురించి తలుచుకోగానే మోహన్‌బాబు, విష్ణుల మాటలు గుర్తొచ్చి, జనం ఆ థియేటర్ల వైపు వెళ్లడమే మానేశారు… ఫలితంగా మొదటి వారం ఫాఫం కోటి రూపాయలు కూడా వసూలు చేసిందో లేదో డౌటే…
ఐనా వాళ్లు మారరు, ఎవరో అగ్రహీరో కక్షకట్టి, ఆఫీసులు పెట్టి తమపై మరీ దుష్ప్రచారం చేశారంటారు… ఫలానా యూట్యూబర్ల మీద లీగల్‌గా వెళ్తాం అంటారు… సరుకు బాగుండి, మౌత్ టాక్ బాగుంటే ఇవేవీ సినిమా గెలుపును ఆపలేవు అని చెప్పేవాళ్లు కూడా లేరు వాళ్లకు… ఉన్నా సరే, వాళ్లు వినరు… దాన్నలా వదిలేస్తే జాతిరత్నాలు అని ఓ మంచి హిట్ తీసిన దర్వకుడు అనుదీప్ ఈసారి తమిళ నటుడు శివకార్తికేయన్‌తో ప్రిన్స్ తీశాడు… ఓ తెలుగు హీరోను తీసుకుంటే బాగుండేది… ఇప్పుడది చెన్నైలోనే వంద షోలు నడుస్తోంది…
Ads
డబ్బులొస్తున్నాయి, మరీ ఫ్లాప్ కాదు, కానీ అదిప్పుడు పెద్దగా పోటీలో లేదు… పొన్నియిన్ సెల్వన్ గొప్ప, భారీ, పెద్ద, స్టార్ సినిమా కావచ్చు… కానీ తెలుగు బుర్రలకు ఎక్కలేదు… తెలుగులో వసూళ్లు చాలా తక్కువ… అదీ ఇప్పుడు పెద్దగా పోటీలో లేదు… కొంతమేరకు కార్తి నటించిన సర్దార్ కొంతమేరకు బాగానే డబ్బులు వసూలు చేసింది, క్రమేపీ వీక్ డేస్‌లో వీక్ అయిపోయింది… సినిమా ఎలా ఉన్నా సరే, దాని కోసం థియేటర్లకు పరుగులు తీసేంత సీన్ మాత్రం లేదు… ఇదీ చెన్నైలోనే 240 షోలు నడుస్తోంది… హైదరాబాద్‌లో వీకే…
వెంకటేష్ అతిథిగా నటించిన ఓరి దేవుడా సినిమా కూడా ఫ్లాపే… బహుశా పెట్టిన పెట్టుబడి కష్టమ్మీద వచ్చి ఉంటుంది… హైదరాబాదులోనే 80 షోల వరకూ నడుస్తోంది… ఇంకోవారం ఇలాగే నడిస్తే గట్టెక్కుతామని బయ్యర్ల ఆశ ఫాఫం… మస్తు హైప్ క్రియేట్ చేయబడిన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ ఎత్తేసినట్టే… అప్పటికే ఆచార్యతో మస్తు చేదు అనుభవం మూటగట్టుకున్న చిరంజీవి ఈ గాడ్ ఫాదర్ హిట్ అనిపించడం కోసం చాలా తిప్పలు పడ్డాడు… కానీ చివరాఖరికి 20, 30 కోట్ల మేరకు నష్టమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు… అంటే చిరంజీవికి రెండు వరుస ఫ్లాపులు…
రాబోయే వాల్తేరు వీరయ్య సినిమా వ్యాపారం మీద దీని ప్రభావం ఉంటుంది… అంతకుమించి చిరంజీవి సినిమా వాస్తవ రేంజ్ ఎంత అనే చర్చకు తెరతీసినట్టయింది గాడ్ ఫాదర్ వైఫల్యం… ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే… కొన్ని సినిమాలకు ఈ పరిస్థితులు భలే కలిసొస్తాయి… చుట్టూ ఇన్ని సినిమాల వైఫల్యాలు ఇప్పుడు కాంతారా సినిమాకు అనుకోని వరం అయ్యాయి… ఇప్పుడు ఆ సినిమాకు బలమైన పోటీ లేదు మార్కెట్‌లో…
ఇప్పటికే 250 కోట్లు వసూలు చేసిన ఈ 15 కోట్ల చిన్న సినిమా… తెలుగులో డబ్ చేసి వదిలితే, ఇక్కడా 50 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించింది… అంతేకాదు, ఇప్పుడు మార్కెట్‌లో పోటీపడే సినిమా లేకపోవడంతో 550 థియేటర్లకు పెరిగిపోయింది… ఫస్ట్ దాన్ని కేవలం 300 థియేటర్లలోనే రిలీజ్ చేశారు… దీపావళి సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం కోసం 250కు తగ్గించారు, ఆ సినిమాలు ఫట్ మని పేలిపోవడంతో అది కలిసొచ్చి కాంతారా ఏకంగా థియేటర్ల సంఖ్యను డబుల్ చేసుకుంది ఇప్పుడు… సుడి…
ఇప్పటికీ ఈ సినిమా బెంగుళూరులో 400 షోలతో నడుస్తోంది… నెలరోజులు దాటినా ఈ రేంజ్ తగ్గడం లేదు… రోజువారీ కలెక్షన్ల సంఖ్య ఎలా ఉన్నా… ప్రస్తుతం కన్నడ, హిందీ, తెలుగు వెర్షన్లు నోట్లను ముద్రించుకుంటున్నయ్… నిజానికి ఆ సినిమాకు అంత రేంజ్ ఉందా..? ఇది పెద్ద ప్రశ్నే… దానికి నిజమైన సమాధానం… ప్రస్తుతం వందల థియేటర్లలో ఏ చెట్టూ లేదు… ఈ ఆముదం చెట్టే మహావృక్షం… అదే నిజం…!! అంటే సినిమా బాగాలేదని కాదు… ఈ సినిమా చాలామందికి చాలా పాఠాలు నేర్పించింది, ఈ సినిమాయే ఓ చరిత్ర..!!
Share this Article