గుర్తుందా..? పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని ఖుష్బూ అప్పట్లో అన్నందుకు ఆమెపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు… గుడికట్టి ఆరాధించిన వాళ్లే కనిపిస్తే ఖతం చేస్తామంటూ వీరంగం వేశారు… ఒకప్పుడు అది సంప్రదాయ విరుద్ధం… కానీ ఇప్పుడు అలా ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎవరూ పట్టించుకోరు… సమాజం దాన్ని ఆమోదించిందని కాదు… దాన్ని ఓ ప్రాధాన్యాంశంగా పరిగణించడం మానేసింది…
జయాబచ్చన్ తెలుసు కదా… లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య… తనూ ఒకప్పుడు హీరోయినే… రాజ్యసభ సభ్యురాలు… సమాజ్‌వాదీ పార్టీ తరఫున… వయస్సు 74… తన మనమరాలు నవ్య నవేలి నందాతో కలిసి ఏదో పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ అమితాబ్‌తో తన లవ్‌స్టోరీ, పెళ్లి తదితర ముచ్చట్లు పంచుకుంది… ఈ ప్రోగ్రాం పేరు ది హెల్ నవ్య… జయాబచ్చన్ కూతురు శ్వేతాబచ్చన్ బిడ్డ నవ్య…
ఆమధ్య ఈ పిల్ల తాలూకు వెగటు వేషాల ఫోటోలు, వార్తలు బోలెడు కనిపించేవి… దాన్నలా వదిలేస్తే… రీసెంట్ ప్రోగ్రాంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంట్రస్టింగు… ‘‘నవ్య ఒకవేళ పెళ్లి గాకుండానే తల్లి అవుతానంటే నేను అభ్యంతరపెట్టను, అంగీకరిస్తాను’’ అన్నదామె… ‘‘బంధం చిరకాలం నిలవాలంటే భౌతిక ఆకర్షణే ప్రధానం… మా కాలంలో మేం ప్రయోగాలు చేయలేకపోయాం, ఇప్పటికాలం వేరు… భౌతిక బంధం అనేదే ఏ జంటకైనా మరీ మరీ ముఖ్యం… ఎన్నయినా చెప్పుకోవచ్చుగాక, నేను ఇలా మాట్లాడుతుంటే కొందరికి నచ్చకపోవచ్చుగాక… కానీ ప్రేమ, తాజాగాలి, సర్దుబాటు’ వంటి అంశాలతో రిలేషన్ షిప్ చాలాకాలం నిలబడదు… ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నన్నిరోజులే బంధం’’ అని తేల్చిపడేసింది…
Ads
సరే, అది ఆమె అభిప్రాయం… ఇన్నేళ్ల వయస్సులో ఆమె ప్రేమాదోమా, అనురాగం, అభిమానం అనేవి ఓ నాన్సెన్స్, ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కటే అల్టిమేట్ అని సూత్రీకరణలు చేస్తుంటే ఏమని వ్యాఖ్యానించగలం గానీ… మనమరాలా, పెళ్లిగాకుండా బిడ్డను కను, నా మద్దతు ఉంటుంది అని బహిరంగంగా చెప్పిన తీరు ఆశ్చర్యం అనిపించింది… ఒకప్పటి ఖుష్బూ ఎదుర్కున్న పరిస్థితికీ, ఇప్పుడు సమాజమే అడ్జస్లయిపోయిన స్థితికీ తేడా కనిపిస్తోంది…
పెళ్లి గాకుండానే తల్లి కావడం అనే ఊహే మా తరానికి ఓ విచిత్రం… మా వల్ల అవి అయ్యేవి కావు… మా తరువాత తరానికి కూడా… (శ్వేతతరం)… కానీ మీ తరానికి కొంత అలా ఆలోచించే, అడుగులేసే స్కోప్ ఉంది… నా మాటలు విచిత్రంగా ధ్వనించవచ్చుగాక… కానీ ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఎంచుకొండి…, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీద్వారా పిల్లల్ని కనాలని ఉందనీ, సమాజం చెబుతోంది కాబట్టి పెళ్లిచేసుకుందామనీ స్వేచ్ఛగా వ్యాఖ్యానించేంతగా, డిస్కస్ చేసుకునేంతగా ఆ క్లోజ్‌నెస్ ఉండాలి… అని జయాబచ్చన్ యువతరానికి పిలుపునిచ్చింది…
భలేవారే, చెప్పడానికి ఎన్నయినా చెబుతుంది, నిజంగా ఆ పరిస్థితి వస్తే అందరికన్నా ముందు కొరడా పట్టుకునేది ఈమే అంటారా..? కావచ్చు… అన్నట్లు ఆమె అలియాభట్, రణవీర్ సింగ్, ధర్మేంద్ర, షబనా ఆజ్మీతో కలిసి కరణ్ జోహార్ తీయబోయే రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ అనే సినిమాలో కనిపించబోతోంది… 74 ఏళ్ల వయస్సులో మళ్లీ సినిమాయా అని ఆశ్చర్యపోకండి… ఏం..? 80 ఏళ్ల వయస్సులో అమితాబ్ నటించడం లేదా..?! ఆరోగ్యం ఉంది, ఎనర్జీ ఉంది, ఆసక్తి ఉంది… తప్పేముంది..?!
Share this Article