గతంలో…. ఇంట్లోనే పురుటినొప్పులు… దగ్గరలో ఎవరైనా మంత్రసాని దొరికితే సాయం… లేదంటే ఇంట్లోని ఆడవాళ్లే సాయం… కాసేపటికి కెవ్వుమని శిశువు ఏడుపు… బొడ్డుతాడుకు ముడి… లోకంలోకి మరో జీవికి స్వాగతం… చాలా ప్రసవాలు ఇవే… కానీ శిశుమరణాలు, బిడ్డ అడ్డం తిరగడాలు, ధనుర్వాతాలు ఎట్సెట్రా ఎన్నో విషాదాలు…
ఇప్పుడు… రెగ్యులర్ చెకప్స్… ముహూర్తం గట్రా చూసుకుని చెబితే ఆ టైంకు లేడీ డాక్టర్ సిజేరియన్ చేస్తుంది… ఆపరేషన్ పెయిన్స్ తప్ప లేబర్ పెయిన్స్ ఉండని స్ట్రాటజిక్, ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్… కాకపోతే తల్లీబిడ్డా వీలైనంతవరకూ సేఫ్… రిస్క్ లెస్ డెలివరీస్… బిడ్డకు సకాలానికి సరైన వేక్సినేషన్లు కూడా…
ఇక కథలోకి వెళ్దాం… నవ్వొచ్చే కథే… తమిళనాడు… మైలదుతురై జిల్లా… ఇరుక్కూర్ గ్రామం… బెలీసియ్ అనే గర్భిణి, భర్త జాన్ క్రిస్టోఫర్… మొదటి డెలివరీ సిజేరియన్ సమయంలో చాలా ఇబ్బందులు పడటంతో ఈసారి హాస్పిటల్‌ను నమ్ముకోదలుచుకోలేదు… ఇంట్లోనే ప్రసవం అనే ఆలోచన చేశారు… ఓ ఎన్జీవో సహకారం కూడా తీసుకున్నారు… ఏవో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు… ఆరోగ్య సిబ్బంది పలుసార్లు చెప్పినా వినిపించుకోలేదు…
Ads
శుభం… ఏ కాంప్లికేషనూ రాలేదు… నార్మల్ డెలివరీ… తల్లీబిడ్డా సేఫ్… కానీ ఆ అర్ధరాత్రి కూడా ఆరోగ్య సిబ్బంది వచ్చారు… పదండి హాస్పిటల్‌కు అంటారు… వీళ్లు వినిపించుకోలేదు… ఈసారి పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు… దాంతో భయపడి అప్పుడే పుట్టిన శిశువుతోపాటు బాలింత హాస్పిటల్‌కు వస్తుందని అనుకున్నారు… కానీ ఆ దంపతులు భయపడలేదు, వినలేదు… సరికదా, పోలీసులు వెళ్లిపోగానే, వెంటనే అక్కడి నుంచి ఆ దంపతులు తమకు తెలిసిన బంధువుల ఇంటికి, అనగా వేరే ఊరికి తాత్కాలికంగా పారిపోయారు…
అసలే ఆరోగ్యశాఖ లక్ష్యం వంద శాతం సంస్థాగత ప్రసవాలు… ఈ హోమ్ ప్రసవంతో అది సాధ్యం కావడం లేదు… ఆరోగ్య సిబ్బంది అహం దెబ్బతింది… దాంతో ఆ బాలింతపై, భర్తపై, ప్రసవానికి సహకరించిన మరో వ్యక్తిపై కేసులు పెట్టారు… కానీ ఏం కేసులు పెట్టాలో మొదట్లో అర్థం కాలేదు… గృహప్రసవం చట్టరీత్యా నేరం కాదు కదా… అందుకని బహిరంగ దూషణ, విధులకు అడ్డం పడటం, నవజాత శిశువు ప్రాణాలను రిస్క్‌లో పడవేయడం సెక్షన్లను వెతికి మరీ కేసు పెట్టారు… ఇది నాన్సెన్స్… సీపీఎం దీన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగింది…
నిజమే… ఆ దంపతుల నిర్ణయం కరెక్టు కాదు… హాస్పిటల్‌లో గనుక ప్రసవం జరిగితే రిస్క్ లేదు… బిడ్డ అడ్డం తిరగడం, ఓవర్ బ్లీడింగ్, ఆక్సిజెన్ అవసరపడటం, ట్రెయిన్డ్ డాక్టర్లు లేదా నర్సుల సాయం, స్టెరిలైజ్డ్ వాతావరణం, హైజినిక్ పరిసరాలు… ఏ కోణం నుంచి చూసినా అది తల్లికి, బిడ్డకు సేఫ్… అయితే ఆ దిశగా ఆరోగ్య సిబ్బంది వాళ్లను కన్విన్స్ చేయకుండా బెదిరింపులకు పూనుకోవడం అబ్సర్డ్…
100 శాతం ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ జరగకపోతే వాళ్లను ఏమీ శిక్షించరు కదా… అన్నింటికీ మించి పోలీస్ కేసులు పెట్టడం ఏమిటి..? కేసులు నమోదు చేసుకున్న ఆ పోలీసుల బుద్ధి ఏమైంది..? ఆ దంపతులు చేసింది తప్పే, కానీ నేరం కాదు… ఆ తేడా తెలియదా..?! ఈ తప్పుడు కేసులు దేనికి..?! ఇంకా నయం… నవజాత శిశువు మీద కూడా పెట్టారు కాదు..!! (అవునూ… బాలింతను ఇంగ్లిషులో ఏమంటారు బాబయ్యా…)
Share this Article