Sunitha Ratnakaram….. రేవా (REVA)… ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడం వైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు.
కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో అనుకోకుండా కనెక్ట్ అవుతుంది, ఉత్త డ్రామాను దాటేసి ఆత్మాన్వేషణ వైపు సాగిపోతుంది. అది ఆధ్యాత్మికంగా… ఒక నదీ తీరాన ఆ నర్మదా నదీ పరిక్రమ రూపేణా… చివరి పదిహేను ఇరవై నిమిషాల కోసం అంత సినిమా చూడడం అవసరమా అనొచ్చు, కానీ ఎన్ని చెత్త సినిమాలు భరించట్లేదు పెద్ద బడ్జెట్తో తీశారు, మనకు నచ్చిన హీరో, హీరోయిన్ అన్న పిచ్చి కారణాలకు ….
ఆ మనవడి మీద కాస్త జాలిపడ్డ మేనేజర్ ‘‘ఒక్క దారి వుంది, ఆ ఆశ్రమం ట్రస్టీలు గనక మాకేమీ వద్దు ఈ ఆస్తిపాస్తులు అని సంతకం పెడితే నీకు మొత్తం వచ్చేస్తుంది, ఇంకే గోలా వుండదు’’ అని చెబుతాడు… మనవడికి ఈ మాట నచ్చేసి, అమెరికా నుంచి ఆ పళంగా సదరు మేనేజర్ అంకుల్ సాయంతో వచ్చేస్తాడు ఈ మాయా దేశానికి… వెంటనే మనం అనుకునేస్తాం, అబ్బో, ఇక ఇక్కడి ట్రస్టీలు పేద్ద జమాజెట్టీలు అయి వుంటారు, మనోడు పోరాటాలు చేయాల్సిందే ఆ సంతకాల కోసం అని… తీరా చూస్తే ఆ ట్రస్టీలు ఒక నమ్మకమైన పెద్ద గుమస్తా లాంటి మనిషి, ఇంకో హీరోయిన్ అమ్మాయి, ఇద్దరు పరమ అమాయకపు అన్నదమ్ములు… ముందుగా వాళ్ళమ్మ అక్కడేవో పనులు చూసుకునే మనిషి ట్రస్టీగా ఉండేదట, ఆమె పోయాక వీళ్ళు ఆ స్థానానికి వచ్చారు. వీళ్ళు కాక ఒక ఫకీరు అంటే నిజంగా ఫకీరే, ఇంకా ఒక శాస్త్రి…
Ads
మొదటి ఐదుగురిని ముందే చూపించేసాక వాళ్లలో నలుగురు శాస్త్రి సంతకం పెడితేనే మేమూ పెడతాం అనగానే కనీసం ఈయనైనా వీణ్ణి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు అనుకుంటాం. చిత్రంగా ఆయన నువ్వు ఆ విదేశీ మనవడివి నాకు నమ్మకం వుంది అని ఒక ప్రశ్న కూడా లేకుండా కాయితాల మీద సంతకాలు పెట్టేస్తాడు. మనవాడికి అప్పటికి ఈ మనుషులు చాలా తేడా మనుషులు అని అర్థం అవుతుంది.
వాళ్ళు మాట్లాడే నర్మదా, రేవా, సేవ, ధర్మంపై నమ్మకం అనేవి వాడి భాషలో ఉత్త పనికిమాలిన మాటలూ; “ఇక్కడ చేసే పనులతో ఆదివాసీలను నేను ఉద్దరిస్తున్నానో లేదో తెలీదు, కానీ వాళ్ళ జీవితాలు కాస్త సౌకర్యవంతంగా గడవడానికి ఉపయోగపడితే అంతే చాలు” అనే ఆ హీరోయిన్ అమ్మాయి మాటలు;
“మందు అని చెప్పి ఇస్తే ఆ మనిషి ఆ నీళ్లు తాగదు, కానీ నర్మదా అని ఇస్తే వెంటనే తాగుతుంది, అందుకే కావలసిన మందు అందులోనే కలిపి ఇస్తాను, ఈ దేశం నమ్మేది ఆధ్యాత్మికతని, శ్రద్దనీ; మతంపై శ్రద్ధ లేకుంటే ఏమీ ఇబ్బంది లేదు, కానీ మనిషిపై శ్రద్ధ వదలకూడదు” అన్న శాస్త్రి మాటలు;
“నువ్వు పరిక్రమలో విశ్వాసం లేదంటున్నావ్, విశ్వంతరాళాలలో ఉన్న గోళాల మధ్య, పదార్థంలోని అణువుల మధ్య వున్నది పరిక్రమ కాక ఇంకేమిటో చెప్పు” అంటూ నర్మదా పరిక్రమ మీద విశ్వాసం వుండి పరిక్రమ చేసిన మౌలానా అలీ బక్ష్ మాటలు అర్థమవుతున్నట్టు తోస్తాయి ఆ మనవడు కరణ్ కి…
కొంత డ్రామా తర్వాత ఈ కరణ్ అనుకోకుండా నర్మదా పరిక్రమ మొదలుపెట్టడమే అసలు కథ. అందరూ చెబుతున్నట్టు మనిషి రూపంలో తప్పక దర్శనమిచ్చే రేవా ఈ కరణ్ కి దర్శనమిచ్చిందా సినిమాలో చూడండి. ఈ రేవా ఎవరో అనుకోకండి, నర్మదని అక్కడ జనాలు పిలుచుకునే ఆప్యాయమైన పేరు.
సినిమాలో చాలా అంశాలు mediocre గా వుంటాయి, మామూలు సినిమాలాగే… అంత మంచి మనుషులు, ప్రాక్టికల్ గా ఉండని మనుషులు ఊహకు రావడం కష్టమే, కానీ ఉంటారేమో.. మూడు మిలియన్ డాలర్ల అప్పు గ్యాంస్ స్టర్ల నుంచి తీసుకున్న వాడు అమెరికా దాటడమే కష్టం, ఇక మిగతావన్నీ ఉత్తమాటలు, అట్లాంటివి చూసుకుంటే ఎంత బావుంటుంది అని అనుకోకుండా ఉండలేం ప్రేక్షకులుగా… అంత గొప్ప ఆదర్శాలున్న తాత ఈ మనవడిని ఇంత వెధవాయిగా పెంచడం కూడా బాగా వుండదు, సర్లే, ఇట్లాంటివి ఎన్నైనా రాసుకోవచ్చు కానీ ఒక సినిమా మనసుకు పట్టేంత దగ్గరగా తీశాక వీటిని పట్టించుకోవాలనిపించలేదు నాకు వ్యక్తిగతంగా.
ఈ సినిమాని నాకు చాలా దగ్గరగా చేసినవి నర్మద, నర్మదా పరిక్రమా, నర్మదా ప్రవాహపు అత్యద్భుత దృశ్యాలు, ఆ అడవులూ, తగిన సంగీతం, శ్రద్ధ పట్ల మర్యాద… హీరోయిన్ పేకముక్క కాకపోవడం కూడా బావుంది, చూడముచ్చటగా కూడా వుంది… ఆ అమ్మాయి తెలుగు సినిమాల్లో కూడా చేసిందట, నాకు తెలీదు కానీ… (మోనాల్ గజ్జర్, బిగ్‌బాస్ ఫేమ్) మీకు ఇట్లాగే తోచకపోనూవచ్చు సినిమా చూసాకా… నేనెప్పుడో చూసానే ఏమిటీ ఈవిడ ఇంత రాసింది అనీ అనిపించవచ్చు… అంచేత ఇది నా నమ్మకాలు, అనుభూతులతో పూర్తిగా బయాస్ కాబడిన రాత అని డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా… ప్రైమ్ లో వుంది… నా పరిక్రమ ఎప్పటికో మరి..!!
Share this Article