అమితాబ్ వయస్సు 80 ఏళ్లు… తన కలం నుంచి మొదటిసారిగా వైరాగ్యంతో కూడిన ఓ పోస్టు… అదీ తన పర్సనల్ బ్లాగులో తనే రాసుకున్నాడు… మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాల్ని వివరిస్తున్నానని అనుకున్నాడు, కానీ తనకు వయస్సు మీద పడుతోందనీ, కొత్తనీరు వేగంగా ముంచెత్తుతోందనీ, తన వంటి పాతనీటికి కాలం చెల్లుతోందనీ గుర్తించలేదు…
‘‘కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు, మార్పును అంగీకరించాలి… ఇంతకుముందు నన్ను పలకరించడానికి ముంబైలోని నా ఇల్లు, అందులోనూ జల్సా దగ్గరకు ప్రతి ఆదివారం వందల సంఖ్యలో అభిమానులు వచ్చేవాళ్లు… (జల్సా అభిమానులతో భేటీ కోసమే కట్టుకున్నాడు, వాళ్లతో సందడిగా కొంతసేపు గడిపేవాడు)… ఇప్పుడు జనం పెద్దగా రావడం లేదు…
కొందరు మాత్రమే కనిపిస్తున్నారు… వాళ్లలోనూ ఒకప్పటి కేరింతలు, జోష్, ఉత్సాహం మాయమయ్యాయి… తమ ఫోన్లతో ఫోటోలు తీసుకుంటున్నారు, అంతే… ఎన్నో ఏళ్లుగా సండే మీట్స్ పేరిట కలుస్తూనే ఉన్నాను… మార్పు గమనిస్తుంటే సమయం మన కోసం ఆగదనే సత్యం అర్థమవుతోంది…’’ అని అందులో రాసుకొచ్చాడు… నిజాయితీగానే రాసుకున్నాడు…
Ads
నిజం కూడా… సమయం ఎవరి కోసమూ ఆగదు… ఈరోజు వీర తోపు… రేపటి విలువ ఓ కట్టెల మోపు… ఈ కట్టెకు కూడా వయస్సయిపోతుంది… వాస్తవానికి అమితాబ్ చాలా నయం… ఈ వయస్సులోనూ కొట్టుడు, కుమ్ముడు, చంపుడు, నరుకుడు పాత్రల జోలికి పోవడం లేదు… వీపుకు బద్దలు కట్టుకుని ‘మేరా అంగనా మే’ వంటి స్టెప్పులు ఏమీ వేయడం లేదు… బిల్డప్పులు కూడా నిల్… ఏ పాత్ర దొరికితే అది… ఏ భాషయినా సరే… లీడ్ రోలే కావాలని ఏమీ లేదు… వయో ఔచిత్యం లేని వేషాల్ని ఒప్పుకోవడం లేదు…
సినిమాలకన్నా తన ధ్యాస బాగా కౌన్ బనేగా కరోడ్‌పతి షో పైనే… ఒక దశలో దివాలా తీసిన తనను గట్టెక్కించింది అదే… ఈరోజుకూ అమితాబ్‌ను జనంలో ఉంచుతున్నదీ అదే… టీవీ షో ఉపయోగాల్ని సరైన సమయంలో అనివార్యంగా గుర్తించింది, ఇక వదలనిదీ అమితాబే కావచ్చు బహుశా… అదీ బిగ్‌బాస్ వంటి వెకిలి షోలకు పోలేదు… డిగ్నిఫైడ్ షో… అలాంటివాడు కూడా ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్‌కు బాధపడుతున్నాడు… నిజానికి అక్కర్లేదు… అమితాబ్‌కు ఇండియన్ సినిమా పుస్తకంలో పెద్ద అధ్యాయమే ఉంది… దాన్నెవడూ తిరగరాయలేడు… అమితాబ్ అంటే అమితాబే… అంతే…
ఆమధ్య చిరంజీవి కూడా ఏదో బుక్ ఆవిష్కరణలో మాట్లాడుతూ ఇలాగే బాధపడ్డాడు… ‘‘మా ఇంట్లోనే నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడూ రామ్ చరణ్, బన్నీ, తేజ్, వైష్ణవ్… వీళ్లే హీరోలు అన్నట్లు.. వాళ్ల పాటలే పెట్టమంటూ ఉంటారు… సరదాగా నాకు ఎక్కడో కడుపు మండిపోతూ ఉంటుంది… మనకి ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి… అవి అడగరు ఎందుకు అనుకుంటూ ఉంటాను… నేను ఎవరినో, ఏమిటో చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకే ఏర్పడింది…’’ తను సరదాగా చెప్పినా అదే కఠిననిజం… తన బిల్డప్పులను ఇంకా జనం మెచ్చుకుంటున్నారనీ, చప్పట్లు కొడుతున్నారనీ భావిస్తున్నాడు…
ఆచార్య ఎందుకు ఫ్లాపయిందో… ఎన్నిరకాల వేషాలు వేసినా గాడ్ ఫాదర్ ఎందుకు నష్టాల్ని మిగిల్చిందో తనలో ఆత్మమథనం ఉండదు… చూస్తూ ఉండండి, మళ్లీ వాల్తేరు వీరయ్య కూడా ఆ బిల్డప్పులతోనే వస్తాడు… ఇంకా ఏం కావాలి చిరంజీవికి..? ఈ ప్రశ్నకు తన దగ్గరే జవాబు లేదు… అమితాబ్, చిరంజీవే కాదు… రజినీకాంత్… తన వయస్సు 71… వేల కోట్ల సంపద… బోలెడు ఆధ్యాత్మిక సంపదను ఆర్జించానని అంటుంటాడు… హిమాలయాలకూ వెళ్లి వస్తుంటాడు… తీరా చూస్తే మళ్లీ అవే బిల్డప్పుల సినిమాలు… ఇంకా ఏం కావాలి రజినీకాంత్ నీకు..?
మోహన్‌బాబు… వయస్సు 70… ప్రేక్షకుల్ని చీట్ చేసేలా సన్నాఫ్ ఇండియా సినిమా ఎందుకు తీసినట్టు..? అందులో ఏముంది..? కుటుంబమంతా అదోరకంగా మాట్లాడుతుంటారు… ఆ ప్రభావంతోనే జిన్నా వంటి సినిమాలు అత్యంత అవమానకరంగా బోల్తా కొడుతుంటాయి… ఐనా ఆత్మమథనం ఉండదు… ఎవరూ చెప్పేవాళ్లు ఉండరు వాళ్లకు, చెప్పినా వినరు… రిజల్ట్ జిన్నాలాగే ఉంటుంది మరి… ఐనా వెండి తెర మీద ఇంకా ఏం కావాలి మోహన్‌బాబూ తమరికి..?
మమ్ముట్టి… తన వయస్సు కూడా 71… ఇంకా సినిమాల్లో హీరో వేషాలు… ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే… అందరిలోనూ ఇంకా ఏదో తాపత్రయం… ఎందుకో అర్థం కాదు… ఇదే మాట ఎవరైనా అడిగితే ఈ కళామతల్లి సేవలోనే నేలకొరగాలని తపన అంటారు… పెద్ద అబ్సర్డ్… కళామతల్లి ఓ భ్రమాత్మక రూపం… ఎవరూ సేవ కోసం రాలేదు, రారు… పొట్ట కూటి కోసం, డబ్బు కోసం, పాపులారిటీ కోసం, ఇండస్ట్రీ ఇచ్చే సుఖాలు, వైభోగాల కోసమే వస్తారు… కానీ ఏ వయస్సు వరకు..? అమితాబ్‌లా ‘‘ఎవడూ రావడం లేదు, పట్టించుకోవడం లేదు’’ అని బాధపడే దశ వరకా..?! శోభన్‌బాబు రిటైర్‌మెంట్ గురించి తెలుసా వీళ్లకు..?!
Share this Article