మునుగోడులో ఎవరు గెలుస్తారు…? నిజానికి ఇది ప్రశ్న కాదు… మునుగోడును బీజేపీ ఎందుకు నెత్తిమీదకు తెచ్చిపెట్టుకుంది..? ఏం ఫాయిదా ఆశించింది..? ఈ పిచ్చి స్ట్రాటజీలతో కేసీయార్‌ను ఢీకొట్టాలని భావిస్తోందా..? అసలు బీజేపీలో మనసు పెట్టి ఆలోచించే వాళ్లే లేకుండా పోయారా..?
రకరకాల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి… వాటిల్లో అధికశాతం పేర్లు ఎప్పుడూ వినలేదు… బాగా బయాస్డ్… కానీ ఆరా సర్వేను మనం ఒక విశ్లేషణకు బేస్ గా తీసుకుందాం… వాళ్లు లేటుగా ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు… దాన్ని బట్టి టీఆర్ఎస్ భారీ తేడాతో బీజేపీ మాడు పగులగొట్టబోతోంది… అది నిజమైతేనే సుమా…! అదే జరుగుతుందని ‘ముచ్చట’ ఓ నిర్ధారణకు వచ్చి, ప్రకటించడం లేదు… ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి ఆరా, ఏడా, ఎనిమిదా, ఏ సంస్థ అనేది అప్రస్తుతం… అది అనిశ్చితం… ఇదే సంస్థ దుబ్బాకలో బోల్తా కొట్టింది… కానీ ఒకవేళ ఈ సర్వే నిజమైతే మాత్రం … నిజమైతే బీజేపీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం, ఎందుకంటే..?
(పోలింగ్ 5 గంటల తరువాత చాలామంది ఎగ్జిట్ పోల్స్ వాళ్లు వదిలేశారు… ఆరా సర్వే టీం ఏం చేసిందో తెలియదు… అసలు టర్న్ ఆ టైంలోనే అంటున్నారు…) అయితే బీజేపీ ఈ ఉపఎన్నిక ద్వారా ఏం కోరుకుంది..? మునుగోడు గెలవగానే దక్షిణ తెలంగాణలో రెడ్లందరూ బీజేపీ ఆఫీసు ఎదుట క్యూ కడతారని భ్రమించిందా..? ఓ జాతీయ పార్టీ ఆలోచనల్లో ఇంత డొల్లతనం ఏమిటో అర్థం కాదు… రాష్ట్రంలో ఆరో, ఏడో మజ్లిస్ సీట్లను వదిలేస్తే అసలు ఎన్ని సీట్లలో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారు..? అది కదా జరగాల్సిన అంతర్మథనం… అది కదా జరగాల్సిన వర్క్…
Ads
పెద్ద ఫిగర్స్ పార్టీలో చేరితే నయాపైసా ఫాయిదా లేదు… ఏయే సీట్లలో ఏ పార్టీలో ఎవరు బాగా వర్క్ చేస్తున్నారో అధ్యయనం కావాలి… భరోసా ఇవ్వాలి… పార్టీలోకి తెచ్చుకోవాలి… ఎక్కడా ఈ దిశలో కసరత్తు లేదు… రాజగోపాలరెడ్డి పార్టీలో చేరగానే పోలోమంటూ రెడ్లు వచ్చేస్తారని ఎలా భావించింది పార్టీ…? మరి ఇతర కులాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల మాటేమిటి..? నాగం వంటి రెడ్లను ప్రొటెక్ట్ చేసుకో గలిగిందా..? క్షేత్ర స్థాయి నుంచీ బలోపేతం చేసుకోవాలి తప్ప, అర్జెంటుగా ఓ పెద్ద ఫిగర్ పార్టీలో చేరగానే కేసీయార్ సర్కారు కూలిపోయి, బీజేపీ కుర్చీ ఎక్కుతుందనే పిచ్చి భ్రమ, ప్రణాళిక ఏమిటసలు..?
ఒకవైపు కేసీయార్ వాయిల్ బరిగెలు తీసుకుని, బజారులో బట్టలిప్పి తోముతున్నాడు… తన వాదనల్లో బోలెడు లోపాలు ఉండవచ్చుగాక… కానీ తనకు సరైన జవాబులు ఇచ్చేవాడు లేడు… ఎన్నో ఏళ్లుగా కేసీయార్ అవినీతి, జైలు, కాళేశ్వరం అక్రమాలు అనడమే తప్ప బీజేపీ నుంచి నిజమైన కదలిక ఏముంది..? చివరకు కవిత ఇరుక్కుంటుందని భావిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కూడా ఎక్కడికక్కడే గప్‌చుప్…
హుజూరాబాద్‌లో గెలుపు కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేయడం వల్ల వచ్చింది… అదొక దుష్ట సమీకరణం… దుబ్బాకలో బీజేపీ గెలుపునకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓ కారణం… మునుగోడులో కేసీయార్ ఈ ‘బంధు’ పథకాలు గట్రా పెట్టుకోదలుచుకోలేదు… బీజేపీకంటే ఎక్కువ డబ్బుతో కొట్టాలని అనుకున్నాడు… కొట్టాడు… స్ట్రెయిట్ పోల్ మేనేజ్‌మెంట్… ఆ దెబ్బకు బీజేపీ తల్లడిల్లిపోయింది…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు కాదు, ఇటు కాదు… కాంగ్రెస్‌లో ఉండలేడు, బయటపడలేడు… టీఆర్ఎస్ బీసీ వోట్లను పర్‌ఫెక్ట్‌గా ఆర్డనైజ్ చేసుకుంది… టీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోయి, కొన్ని ప్లాన్లు అమల్లోకి తెచ్చింది… బీజేపీ ఈ విషయంలో తెల్లమొహం వేసింది… మీడియా సరేసరి… తెలంగాణలో మీడియా టీఆర్ఎస్ చంకలో ఉన్నదే కదా…
సరే, ఇవన్నీ కాదు, మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని అనుకుందాం… బీజేపీకి వచ్చే ఫాయిదా ఏముంది..? తొక్కలో సీటు, పోతే పోయింది అనుకుంటాడు కేసీయార్… కనీసం బీజేపీలో అంతర్గతంగానైనా ఒక ప్రశ్న చర్చకు వచ్చే వీలుందా..? ‘‘మునుగోడు ఉపఎన్నికను ఎందుకు నెత్తి మీదకు తెచ్చిపెట్టుకున్నాం..? ఫాయిదా ఏమిటి..? ఇది గెలిస్తే మరో ఉపఎన్నిక తెస్తాం, డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంది..?’’
Share this Article