అందరికీ తెలుసు… ఒకప్పుడు ఘాట్ల నుంచి కాశీ విశ్వనాథుడి మందిరం వెళ్లాలంటే పెద్ద చిరాకు… అక్రమ భవనాలు, ఇరుకు దారులు, పారిశుధ్యలోపాలు… దళారులు సరేసరి… ప్రధాని మోడీ కాశీని తన నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నాక యోగికి ఓ బాధ్యత అప్పగించాడు… కాశిని ఓ దారికి తీసుకురావాలని…!
ఇంకేముంది..? యోగి తలుచుకుంటే అదెంత పని… బుల్‌డోజర్లు కదిలాయి… బోలెడు అక్రమ కట్టడాలు నేలకూలాయి… రెండుమూడేళ్ల క్రితం కాశీకి వెళ్లినవారికి, ఇప్పుడు వెళ్తున్నవారికి కాశీలో ఎంత తేడా కనిపిస్తుందో తెలుసు… దీంతో పర్యాటకుల రాకపోకలు పెరిగాయి… భక్తుల రాకడ బాగా పెరిగింది… అదెంత వరకూ అంటే..? ఇప్పటివరకూ పర్యాటకులను ఆకర్షించడంలో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, వారణాసి దాన్ని దాటేసింది…
గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మికాంత్ వైనాగర్ చెబుతున్న అంకెలు ఏమిటంటే..? ‘‘2021-22లో గోవాకు 3.5 కోట్ల మంది పర్యాటకులు మాత్రమే రాగా… కాశీకి 10.5 కోట్ల మంది వచ్చారు… అందులో 8.5 కోట్ల మంది కేవలం కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వచ్చినవాళ్లే…’’ గంగ ఆరతి ప్రారంభించడం, ఘాట్ల నుంచి గుడి దగ్గరకు వీథులు విశాలం కావడం, అక్రమ కట్టడాలు కనుమరుగు కావడం కాశీకి ఉపయుక్తంగా మారింది…
Ads
గంగాలో క్రూయిజ్ ప్రారంభించారు… ప్రైవేటు రంగంలో కూడా వసతి సౌకర్యాలను పెంచారు… ఈరోజు దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక- సాంస్కృతిక స్థలి వారణాసి… నిజానికి గోవాలో ఒకప్పుడున్న జోష్ ఇప్పుడు లేదు… జూదం ఆడేవాళ్లు వెళ్లే కేసినోలు తప్ప ఇంతకుముందులా గోవా బీచులు పర్యాటకుల్ని ఆకర్షించడం లేదు…
మద్యపానం మీద ఆంక్షలు, పెరిగిన ధరలు కూడా పర్యాటకుల్ని నిరుత్సాహపరుస్తున్నాయి… దీంతో పర్యాటకుల సంఖ్య పడిపోయి, గోవా ప్రధానాదాయానికే గండి పడుతోంది… దీంతో గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ తప్పనిసరై దేశంలో వర్క్ షాపులు, రోడ్ షోలు నిర్వహిస్తూ తిరిగి పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడానికి తిప్పలు పడుతోంది…
కానీ వారణాసి కథ వేరు… గుడిని బాగా డెవలప్ చేశారు… గతంలో రకరకాల కారణాలతో కాశికి వెళ్లడానికి సందేహించిన భక్తులు, పర్యాటకులు కూడా ఇప్పుడు కాశి బాట పడుతున్నారు… పితృకర్మలు చేసేవాళ్లు, ఇక్కడి నుంచి త్రివేణీ సంగమం వెళ్లేవాళ్లకు కూడా ఇప్పుడు కాశీయే అడ్డా… దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తుల్లో ఈమధ్య ఓ కొత్త ట్రెండ్… ఫోన్లు, దైనందిన వ్యవహారాలకు, చికాకులకు దూరంగా కాశీలో 11 రోజులపాటు గడపడం…
పొద్దున, సాయంత్రం గుడి దర్శనం… మిగతా వేళల్లో నిర్‌వ్యాపకంగా భక్తిచింతనలో మునగడం… గతంలో అయితే ఒక్కసారి కాశీకి చేరితే, ఇక అక్కడే మరణం కోసం వేచిచూస్తూ, మరణించిన అనంతరం అంత్యక్రియలకూ ముందే డబ్బులు కట్టి పెట్టడం చాలామందికి పరిపాటే… ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది… ఏటా కొన్నిరోజులు లేదా వీలున్నప్పుడు విశ్వనాథుడి సన్నిధిలో కాలం గడపడం అలవాటుగా చేసుకుంటున్నారు చాలామంది… ఈ ధోరణి ఇంకా పెరిగితే..? ఏమో..! అయితే కాశీలో డెవలప్ చేయాల్సింది ఇంకా ఉందని భక్తుల ఉవాచ…!
Share this Article