ఆ వీడియోల విస్పోటనం ఎలా ఉంది..? హైకోర్టుల జడ్జిలు, అత్యున్నత దర్యాప్తు సంస్థలు, సుప్రీం జడ్జిలు, పాత్రికేయ సంస్థలు, పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులందరికీ అర్జెంటుగా పంపించారు కదా… రెస్పాన్స్ ఎలా ఉంది..? దేశమంతా గగ్గోలు పుడుతోందా..? జీరో… ఏ స్పందనా ఏ వైపు నుంచీ లేదు… అసలు అందులో ఏముందని..? ఎవరూ పట్టించుకోలేదు… అసలు తెలంగాణ, ఏపీల్లోనే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… బీజేపీయేతర సీఎంలు, యాంటీ బీజేపీ పార్టీలు కూడా లైట్ తీసుకున్నాయి… చివరకు ఆ కుమారస్వామి కూడా స్పందించినట్టు కనిపించలేదు…
అసలు టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చాలని ప్రయత్నించారు కదా, ఏమైంది అది..? ఎక్కడ ఆగింది…? అంటే బీఆర్ఎస్‌గా మారలేదు కాబట్టి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయడం లేదా..? లేకపోతే బరిలోకి దిగేదా..? మోడీకి, అమిత్ షాకు వాచిపోయేదా..? రెండు రాష్ట్రాల్లో గాయిగత్తర మొదలయ్యేదా..?
ఐనాసరే, ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టి… నమస్తే తెలంగాణ చెప్పినట్టు దేశం కోసం ధర్మయుద్ధం యజ్ఙంలో భాగంగా 60, 70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల టీం వెళ్లి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ దుర్మార్గ రాజకీయాల గురించి ప్రచారం చేస్తారట… అసలు వీడియోలనే ఎవరూ పట్టించుకోలేదు… వీళ్లు చెప్పేవి ఎవరు పట్టించుకోవాలి..?
Ads
అసలు కేసీయార్ టీంలో ఎందరికి హిందీ వచ్చు..? ఆ రెండు రాష్ట్రాల్లో ఏం చెబుతారు..? ఓహో, తెలుగువాళ్లు ఉన్న అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, గాంధీనగర్, జునాఘడ్, భావనగర్, పోర్‌బందర్, ద్వారక, నవ్‌సారి పఠాన్, సురేంద్రనగర్, గోద్రా నగరాల్లో ప్రచారం చేస్తారట… అక్కడ తెలుగువాళ్లే వాళ్ల ఇళ్లల్లో వీళ్లకు విడిది ఏర్పాటు చేస్తారట…
3 స్పెషల్ ఫ్లయిట్లు, రెండు ఛాపర్లు కూడా బుక్ చేసుకున్నారట… 6 విడతల్లో బీజేపీ బట్టలు విప్పుతారట… మరి అక్కడి దాకా వెళ్లాలి కదా… అవును గానీ, గత జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాగే యాంటీ బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తామని పింక్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నట్టున్నారు కదా… వెళ్లారా..? హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగువాళ్లు లేరు గానీ గుజరాత్‌లో ఉన్నారు… కానీ ఈ నాలుగు రోజుల బాగోతానికి ఒకేసారి వాళ్లు బీజేపీకి వ్యతిరేకమైపోరు… వాళ్లకు స్థానిక రాజకీయాలు, పరిస్థితులు, భవిష్యత్తులో వాళ్ల స్థితిగతుల ఆలోచన ముఖ్యం…
పోనీ, బీజేపీకి వోటు వేయవద్దు, మరి ఎవరికి వేయాలి..? కాంగ్రెస్‌కా..? గుజరాత్‌లో, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెసే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి… సో, టీఆర్ఎస్ భారీ టీం, భారీ ఖర్చుతో ప్రచారం చేస్తే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలా.,.? వారెవ్వా…!!
ఇవన్నీ సరే గానీ… ఈ ప్రచారాలు దేనికి..? రాబోయే బీఆర్ఎస్ పార్టీకి సహకరించబోయే, లేదా విలీనం కాబోయే ప్రజాశక్తి డెమొక్రటిక్ పార్టీ ఉంది కదా… దానిసాయం తీసుకుంటే గుజరాతీల్లో కూడా యాంటీ బీజేపీ ప్రచారం చేయవచ్చు కదా… అర్థం కాలేదా..? ఆ పార్టీ నాయకుడి పేరు వాఘేలా… ఆమధ్య కేసీయార్‌ను కలిశాడు… ఇద్దరూ భేటీ వేశారు… మస్తు మంతనాలు చేశారు…
ఈ 82 ఏళ్ల లీడర్ గతంలో మోడీ గురువు… బీజేపీని చీల్చి, కాంగ్రెస్ మద్దతులో అప్పట్లో సీఎం అయ్యాడు… ఆ చీలికవర్గానికి పెట్టుకున్న పేరు రాష్ట్రీయ జనతా పార్టీ… తరువాత కాంగ్రెస్‌లో కలిసిపోయాడు, బయటికి వచ్చాడు, 2017లో జనవికల్ప మోర్చా అని ఓ సొంత పార్టీ పెట్టుకున్నాడు… ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోతే ఎక్కడో జైపూర్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా హిందుస్తాన్ కాంగ్రెస్ పార్టీ అనే ఓ అనామక పార్టీ పేరిట 95 స్థానాల్లో పోటీచేసింది వాఘేలా పార్టీ…
వచ్చిన వోట్లు ఎన్నో తెలుసా..? 83 వేలు… మీరు చదివింది నిజమే… 95 సీట్లలో కలిపి 83 వేలు… ఒకప్పటి సీఎం, గుజరాత్ లయన్ సాధించిన వోట్లు అవే మరి… తరువాత ఎన్సీపీలో చేరాడు… ‘‘కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’’ అన్నట్టుగా..!! దరిద్రం ఏమిటంటే… ఎన్సీపీ గుజరాత్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి పార్టీ తనను పీకేసింది… ఇంకేం చేస్తాడు..? ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పాడు… మొన్నటి ఆగస్టులో ఆయన ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ అనే కొత్త దుకాణాన్ని తెరిచాడు… ఇదీ వాఘేలా చరిత్ర… హిమాచల్ ప్రదేశ్‌లో ప్రచారాానికి ఎప్పుడు బయలు దేరుతున్నారు సార్… ఈనెల 12 నుంచే పోలింగ్…! వారం రోజులు కూడా వ్యవధి లేదు..!!
Share this Article