Bharadwaja Rangavajhala………… స్టార్ ఢమాల్…. తెలుగు సినిమాకు సంబంధించి స్టార్ డమ్ అనే మాట ఉనికి కోల్పోయినట్టే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ మధ్య రాజమౌళి కూడా ప్రస్తావించాడు. సీనియర్ ఎన్టీఆర్ , చిరంజీవిలతోనే స్టార్ డమ్ అనే మాట అంతరించిందనే టోన్ లో మాట్లాడారాయన. ఈ మాటలో నిజమెంత ఉంది? అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉండేది. స్టార్ సినిమా విడుదలైతే రివ్యూలు బ్యాడ్ గా ఉన్నా, ఎవరు ఎన్నివిధాలుగా సినిమా బాలేదని చెప్పినా … జనం పట్టించుకునేవారు కాదు. సినిమా బావున్నా బాలేకపోయినా స్టార్ హీరో సినిమా ఒక్కసారైనా చూసేవారు.
కృష్ణ లాంటి హీరోకి ఓపెనింగ్స్ ఉంటే చాలు అనుకునేవారు. రన్ గురించి పట్టించుకోనక్కర్లేదు … కనుక ఓపెనింగ్స్ రాబట్టే తరహా కథలు ఉంటే చాలు అని నిర్మాతలూ దర్శకులూ నటులూ అనుకునేవారు.
Ads
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా ఆడియన్స్ సినిమా హాళ్ల వైపు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కంటెంట్ బావుందా? జస్ట్ బావుంది అంటే కాదు అద్భుతమా? ఈ సినిమా థియేటర్ లో చూడకపోతే ఆ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతామా? లాంటి అనుమానాలు క్లారిఫై చేసుకుని మరీ థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సందేహాలకు అవును అని రిప్లై వస్తే మాత్రం బొమ్మ సూపర్ హిట్టే.
అందుకు ఉదాహరణ కోసం ఎక్కడో చూడక్కర్లేదు … కాంతారా సినిమా ఆడుతున్న థియేటర్లను చూస్తే తెలుస్తుంది.
ఆచార్య అనుభవం తర్వాత చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా మెగాస్టార్ చేసిన గాడ్ ఫాదర్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు బడా స్టార్స్ ని భయపెడుతోంది. రీసెంట్ గా దసరా సీజన్ టార్గెట్ చేస్తూ రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ గాడ్ ఫాదర్. ఫైనల్ రిజల్డ్ ప్రకారం వరల్డ్ వైడ్ ఆ సినిమా వసూలు చేసింది యాభై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు. సినిమాకి నెగెటివ్ టాక్ లేదు. పాజిటివ్ గానే స్పందించారు థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్. కానీ క్రౌడ్ పుల్లింగ్ కు అది చాలదు.
అద్భుతం అంటే తప్ప ఆడియన్స్ కదలడం లేదు. దసరాకే విడుదలైన కింగ్ నాగార్జున ఘోస్ట్ పరిస్థితి కూడా అదే. థియేటర్ దగ్గరే ఆడియన్స్ ప్రాపర్ గా రెస్పాండ్ అవలేదు. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీసును షేక్ చేసేస్తాయి అనుకున్నారు గానీ .. రెండూ ఇలా మిగులుతాయని అనుకోలేదు. కరోనా ముందు ఆడియన్స్ వేరు కరోనా తర్వాత ఆడియన్స్ వేరు..
లాక్ డౌన్ టైమ్ లో ఆడియన్స్ ఓటీటీల ద్వారా ప్రపంచ సినిమాకు ఎక్స్ పోజ్ అయ్యారు. దీంతో ఆడియన్స్ స్థాయి పెరిగింది. ఇది కూడా రిజెక్షన్ కు కారణం.. దీంతో పాటు థియేటర్లు ఆడియన్ ఫ్రెండ్లీగా లేకపోవడం మరో కారణం. దీంతో ఓ మోస్తరు పర్లేదు లాంటి టాక్ వచ్చిన సినిమాలు ఓటీటీలో చూసేందుకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు.
తెలుగు తెర మీద మొదటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ అనుకుంటారు … కానీ అది తప్పు. తెలుగు తెర తొలి సూపర్ స్టార్ నాగయ్య అని చెప్పాలి. పక్షిరాజా వారి బీదలపాట్లు అనే సినిమా కోసం ఆయన తీసుకున్న పారితోషికం అక్షరాలా లక్షరూపాయలు అని అంటారు . ఆయన డేట్స్ ఇస్తే చాలు అన్నట్టుండేది అప్పటి పరిస్థితి. త్యాగయ్య సినిమా చేసిన తర్వాత ఆయనకు లభించిన గౌరవం ఆ తర్వాత తరాల్లో ఎవరికీ దక్కలేదు అనే చెప్పాలి.
అక్కినేని నాగేశ్వర్రావు కూడా ఓ దశలో సూపర్ స్టార్ డమ్ అనుభవించారు. కీలుగుర్రం, బాలరాజు, ముగ్గురు మరాఠీలు సినిమాలు విడుదలై విజయవంతంగా ఆడేస్తున్న రోజుల్లో అక్కినేని సూపర్ స్టారే. జానపద చిత్రం అంటే అక్కినేనే చేయాలి అనే ఇమేజ్ సాధించారాయన. నిజానికి పాతాళభైరవి సినిమాకు ముందు అనుకున్న హీరో ఎఎన్నారే. అయితే అనుకోని కారణాల వల్ల అది ఎన్టీఆర్ కు మళ్లింది. అక్కినేనిని హీరోగా అనుకున్నప్పుడు విలన్ గా ముక్కామలను అనుకున్నారు.
పాతాళభైరవి సినిమా ఎన్టీఆర్ ను సూపర్ స్టార్ ను చేసింది. దీనితో అక్కినేని సూపర్ స్టార్ డంను ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకూ జానపదాలు అంటే అక్కినేనే అన్న ఇండస్ట్రీ కాదు ఎన్టీఆరే అనడం ప్రారంభమైంది. అలా తెలుగు తెర మీద ఎన్టీఆర్ శకం ప్రారంభమైంది. నాగయ్య కీ ఎన్టీఆర్ ఎఎన్నార్ లకూ ఉన్న తేడా ఏమిటంటే … స్టార్ డమ్ సాధించడంతో పాటు చివర వరకూ దాన్ని నిలబెట్టుకున్నారు. ఇదే వారిద్దరి జీవితాల్లోంచీ ప్రతి హీరో నేర్చుకోవాల్సిన సూత్రం. అని అంటారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు…
తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా అవతరించాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాను అనగానే … ఈ థియేటర్లను నింపేది ఎవరూ అనుకున్నారంతా… అలాంటి సందర్భంలో ఖైదీ సినిమాతో నేనున్నా అని చాటింపు వేశాడు చిరంజీవి. నిజానికి అంతకన్నా ముందే చట్టానికి కళ్లు లేవు తోనే బాక్సాఫీసు దగ్గర తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి అన్నమాటలు ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సి ఉంది.
ఇప్పుడెవరూ స్టార్స్ లేరు. హీరోలు మాత్రమే ఉన్నారు. విడుదలవుతున్న స్టార్ల సినిమాలకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి స్టార్ హీరోలకు చెమటలు పడుతున్నాయి. ఈ భయంతోనే త్రివిక్రమ్ సినిమాను వాయిదా వేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బౌండెడ్ స్క్రిప్టుతో వస్తేనే సినిమా అంటున్నారు. అసలే గతంలో ఖలేజా అనుభవం ఉంది ఆయనకి. స్టార్ డమ్ ను ఒకవైపు ఆడియన్స్ భయపెడుతుంటే … మరో వైపు పాన్ ఇండియా మార్కెట్ భయపెడుతోంది.
అనుకోకుండా ఓ చిన్న హీరో సినిమా పాన్ ఇండియా మార్కెట్ కు కనెక్ట్ అయితే వందల కోట్లు వచ్చి పడుతున్నాయి. ఆ మధ్య నిఖిల్ మూవీ కార్తికేయ టూ హిందీ మార్కెట్ కు కనెక్ట్ అయి అక్కడే వంద కోట్లు వసూలు చేసేసింది. అదే హిందీ బెల్టులో గాడ్ ఫాదర్ పది కోట్లు కూడా కష్టమే అనేసింది. అంత మాత్రం చేత నిఖిల్ మెగాస్టార్ స్తాయి నటుడు అనలేం కదా …
ఆ మధ్య వరకూ ప్రభాస్ దీ ఇదే పరిస్థితి … సరిగ్గా ఇలాంటి ఉదాహరణలు అన్నీ కల్సి స్టార్ డమ్ ను ఢమాల్ అనిపించేశాయి. సినిమా జీవుల జీవితాలు మాత్రమే కాదు … స్టార్ డమ్ లు కూడా ప్రతి శక్రవారం మారుతూ ఉంటాయని ఒకప్పుడు దాసరి నారాయణరావు తరచూ చెప్తూ ఉండేవారు. ఆ మాట అప్పట్లో పెద్దగా నిజం కాదు గానీ … ఇప్పుడు పూర్తి నిజంగా పరిణమించింది.
సూపర్ స్టార్ డమ్ అనేది శుక్రవారం శుక్రవారం మారుతూ వస్తోంది. ఏ వారం ఎవరు సూపర్ స్టారో అంత వరకే … ఆ మధ్య ఎటువంటి అంచనాలూ లేకుండా వచ్చిన డిజీ టిల్లూ థియేటర్లను అంత సందడి చేస్తాడని ఎవరైనా ఊహించారా? ప్రస్తుతం సినిమా థియేటర్లలో నిలబడాలంటే భారీ సెట్టింగులు గ్రాఫిక్స్ తదితరాలన్నీ అవసరం లేదు. ఇంట్రస్టింగ్ స్టోరీ చక్కటి టేకింగ్ ఉంటే చాలు … హీరో ఎవరూ అన్నది కూడా చూడకుండా చూస్తున్నారు.
ఈ పరిణామం ఒక రకంగా మంచిదే. ఇప్పుడు చక్కని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. రొటీన్ కథలతో చుట్టేసే సినిమాలకు కాలం చెల్లుతుంది. బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. సినిమా ప్రేమికుల కోణంలో చూస్తే ఈ పరిణామం ఆహ్వానించదగ్గదే … ప్రేక్షకులకు భయపడడం వల్ల పరిశ్రమ కూడా బాగుపడుతుంది అంటున్నారు విమర్శకులు….. స్వస్తి…..
Share this Article