‘హడ్డీ మార్ గుడ్డి దెబ్బ’… గూగుల్ చేయకండి, అర్థం దొరకదు… తెలంగాణలో పలుచోట్ల ‘ఫ్లూక్ బీటింగ్’కు లోకల్ వ్యక్తీకరణ అది… అవునూ… కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతార, చార్లి777, గరుడగమన వృషభవాహన, విజయాలు, వేల కోట్ల వసూళ్లు కేవలం అదృష్టమేనా..? ఇక మా అంతటి తోపులు లేరని రిషబ్, యశ్, రక్షిత్ గొప్పలు చెప్పుకుంటున్నారా..? ఏతులు కొడుతున్నారా..? ఈ డౌట్ చాలామందిలో ఉంది… ఎందుకంటే సక్సెస్ బాటలో ఉన్నప్పుడు నోరు ఏదైనా పలికిస్తుంది…
కానీ ఇది అపోహ మాత్రమే… ఒక సెక్షన్ దర్శకులు, హీరోలు, నిర్మాతలకు కమిట్మెంట్ ఉంది… కన్విక్షన్ ఉంది… అన్నింటికీ మించి పలు అంశాలపై అవగాహన ఉంది… లేకపోతే మాట్లాడరు… హుందాగా వ్యవహరిస్తారు… మొన్న ముంబైలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో యశ్ చెప్పిన జవాబులు తన మెచ్యూరిటీకి అద్దం పట్టాయి… తమ బాట ఏమిటో కూడా స్పష్టం చేశాడు…
సాంస్కృతిక వైవిధ్యం, సంపన్న భిన్నత్వం… ఈ పదాల్ని ఒక్కసారి మన హీరోల నోటి నుంచి ఊహించండి… ఒక విష్ణు, ఒక విష్వక్సేన్ వంటి ఒకరిద్దరు మినహా ఎవరికైనా అవి అర్థం చేసుకునేంత తెలివి ఉందా..? ‘‘నేను బేసిక్‌గా కన్నడ… నా ఇండస్ట్రీ గురించే నేను ఆలోచిస్తాను… మన సంస్కృతుల్లో వైవిధ్యమే మన బలం… అంతేతప్ప శాండల్‌వుడ్ బాగుపడిపోతోంది… బాలీవుడ్ భ్రష్టుపట్టిపోతోంది వంటి విమర్శలు అబ్సర్డ్… అసలు ఈ వుడ్లన్నీ (చెక్క, కలప) కాలబెట్టాలి… ఓన్లీ ఇండియన్ సినిమా…’’ అంటున్నాడు యశ్…
Ads
రాజదీప్ సర్దేశాయ్ ఎంత గోకడానికి (ప్రొఫెషనల్‌గానే) ట్రై చేసినా టెంప్ట్ కాలేదు, నోరు జారలేదు… చివరకు బెల్గాం ఇష్యూలో కూడా… (బెల్గాం మాది అంటారు మహారాష్ట్రియన్లు… వదిలేదు లేదు అంటుంది కర్నాటక… ‘‘ఒక్క బెల్గాం దేనికి..? వీలయితే ప్రత్యేకంగా వేరే దేశమే అడుగుతారు మీరు’’ అని రాజదీప్‌కు చురక అంటించాడు యశ్…
కాంతార ఇరగదీస్తోంది నువ్వు లేకపోయినా అన్నాడు రాజదీప్… నాది కాదని ఎవరన్నారు, అది మాదే… మా కన్నడ సినిమా… కన్నడంలో ఏ సక్సెస్‌నైనా నేను ఎంజాయ్ చేస్తాను… ఐనా అది మా హొంబళె వాళ్ల సినిమాయే, మన రిషబ్ సినిమాయే… నాది గాకుండా ఎలా పోతుంది..?’’ అన్నాడు… పలుసార్లు రాజదీప్ దగ్గర యశ్ జవాబులకు అదనపు ప్రశ్నలు లేకుండా పోయాయి…
‘‘ఇదే బాలీవుడ్ పదేళ్ల క్రితం మమ్మల్ని వెకిలి చేసేది… మా సినిమాలను అడ్డగోలు చీప్ రేట్లకు కొని, పిచ్చి శీర్షికలు పెట్టి, నాసిరకం డబ్బింగుతో జనం మీదకు వదిలేవాళ్లు… కామెంట్లు చేస్తూ నవ్వేవాళ్లు… కేజీఎఫ్ సినిమా మార్కెటింగ్ కోసం ముంబై వచ్చేటప్పటికీ ఇదే స్థితి… నిజానికి బాహుబలితో రాజమౌళి ఈ బాట చూపకపోతే ఇదీ ఉండకపోయేదేమో… ఇప్పుడు మా సినిమాలే మీకు కావల్సి వచ్చాయి… డబ్బింగ్ కాబట్టి అలో చేస్తున్నారు, స్ట్రెయిట్‌గా హిందీలోనే నిర్మిస్తామంటే బాలీవుడ్ ఎలా రియాక్టవుతుందో తెలుసు మాకు…’’ అని చెబుతూ పోయాడు…
‘‘ఈ విజయాలు మా బుర్రలకు ఎక్కవు… మేం దారితప్పేలా చేయవు… మా డాడీ ఇప్పటికీ బస్ నడిపిస్తాడు… నా కొడుకు సక్సెస్ నా సక్సెస్ ఎలా అవుతుంది అనడుగుతాడు… ఎస్, డౌన్ టు ఎర్త్ ఉంటాం… మబ్బుల్లోకి ఎగిరి వెళ్లం… కేజీఎఫ్-3 మీద నిజంగా చెబుతున్నా, ఇప్పటికీ మా ఆలోచనల్లో లేదు అది… చేస్తాం, కానీ ఇప్పుడే కాదు, దానికి టైం రావాలి… మరి నెక్స్ట్ ఏమిటంటే..? చెబుతాం త్వరలో… శంకర్‌తో సినిమా తీస్తున్నామనే ప్రచారాన్ని కొట్టిపారేశాడు…
సేమ్, రిషబ్ ఇలాగే మాట్లాడతాడు… కేజీఎఫ్ యశ్‌తోపాటు ప్రశాంత్ నీల్ అలాగే మాట్లాడతాడు… సావాసదోషం కదా, రక్షిత్ శెట్టి అలాగే మాట్లాడతాడు… రిషబ్ రైటర్ కదా, అందరికీ అంటిస్తుంటాడు… మరణించాడు గానీ పునీత్ రాజకుమార్ కూడా ఈ టీంలో బాగా ఫిట్టయ్యేవాడే… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఒక్కరు, తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరైనా కాస్త బుర్ర పెట్టి ఇలా తడబాట్లు, తొట్రుపాట్లు, పొరపాట్లు లేకుండా… ఓ కన్విక్షన్‌తో మాట్లాడేవాళ్లున్నారా..?
Share this Article