అదుగో తోక… ఇదుగో పులి… బాపతు గాసిప్స్ సినిమా ఇండస్ట్రీలో బోలెడు… అవి ఈమధ్య చాలాసార్లు గతితప్పి, సెలబ్రిటీలపై ద్వేషాన్ని గుమ్మరిస్తున్నాయి… ఓ రేంజ్ వరకు అబద్ధాలు, రూమర్లను సెలబ్రిటీలు కూడా లైట్ తీసుకుంటారు… ఎలాగైతేనేం, వాళ్లకు పబ్లిసిటీ కావాలి, జనంలో ఉండాలి, సినిమా వార్తల్లో కనిపించాలి… కానీ ఈ గుసగుసలు శృతి మించితే, ఓ గీత దాటితే… సెలబ్రిటీల కన్నీళ్లు, రుసరుసలు, బుసబుసలు…
నిన్నటి నుంచీ నటి స్నేహ, హీరో ప్రసన్నలు విడిగా ఉంటున్నారనీ… ఆ వివాహ బంధం విచ్ఛిన్నమైనట్టేననీ మన తెలుగు సైట్లు, కొన్ని చానెళ్లు తెగ రాసేస్తున్నాయి… వాళ్ల కథనాలకు బేస్ ఏమిటయ్యా అంటే..? ఏమీ లేదు… ఇలా అని కోలీవుడ్ కోడై కూస్తున్నది అనే వేగ్ సమర్థనతో కుమ్మేస్తున్నారు… అంతే… దాదాపు ప్రతి కథనం ఒకే సైజు, ఒకే టైపు… ఒకే టోన్… అంటే ఒకరిని చూసి ఒకరు… అబద్ధమైతే అందరిదీ అబద్ధమే అవుతుంది కదాని…!
స్నేహ అంటే తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు… ప్రసన్న మనవాళ్లకు పెద్దగా పరిచయం లేదు… కానీ స్నేహ అనేక తెలుగు సినిమాల్లో హోమ్లీ పాత్రలు చేసింది… పైగా ఈమధ్య చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులయ్యాయి… తాజాగా క్రికెటర్ షోయబ్, టెన్నిస్ స్టార్ సానియా బ్రేకప్ వార్త కూడా బాగా వైరల్ అయిపోయింది… సో, స్నేహ విడాకులు అనే స్టోరీకి రీడబులిటీ మాత్రం ఖచ్చితంగా ఉంది… ప్రతి వార్త చివరలో ఇక నిజం ఏమిటో ప్రసన్న గానీ, స్నేహ గానీ చెప్పాలి అని ముగించారు…
Ads
ఓహో, మనం తోచినట్టు రాసి పారేసి, నిజమేమిటో చెప్పవోయ్ అని వాళ్లనే అడిగేస్తే సరిపోతుందన్నమాట… నిజానికి స్నేహ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్… తమ ఫ్యామిలీ ఫోటోలు, తన ఫోటోలు, తన పిల్లలతో ఫోటోలు గట్రా షేర్ చేస్తుంటుంది… సినిమాలు మానేశాక పెద్దగా బుల్లి తెర, వెండి తెర జోలికి రాలేదు… తను, తన భర్త… ఇద్దరు పిల్లలు… అంతే… కానీ ఆమధ్య ఏదో రాంచరణ్ సినిమాలో కనిపించింది… మంచి పాత్రే… ఈమధ్య ఏదో తెలుగు టీవీ షోలో జడ్జిగా కనిపిస్తోంది… అందుకే తరచూ హైదరాబాదులో కనిపిస్తోంది…
అయితే వీళ్ల విడాకులపై కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నదీ అని రాస్తున్నారు కదా, ఓసారి చెక్ చేద్దాం అనుకుని ట్రై చేస్తే, నాకు ఫెయిల్యూరే దక్కింది… కాకపోతే వాళ్లకు పెళ్లయిన 2012 నుంచి 2017 దాకా అప్పుడప్పుడూ విడాకుల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి… అవి సహజం… కానీ ఈమధ్యకాలంలో స్నేహ, ప్రసన్నల నుంచి అలాంటి బ్రేకప్ సంకేతాలు ఏమీ కనిపించినట్టు వార్తల్లేవు… ఆమె సోషల్ మీడియాలో కూడా ఏమీ హింట్స్ ఇవ్వలేదు… సమంత తన ప్రొఫైల్లో అక్కినేని అనే పదాన్ని కత్తిరించేసినట్టుగా…!
స్నేహ ఇన్స్టాలో గత అక్టోబరులో జరిగిన బర్త్ డే వేడుకల ఫోటోల్ని కూడా షేర్ చేసుకుంది… అంటే ఒకే నెలలో వాళ్లకు మనస్పర్థలు వచ్చేసి, విడివవిడిగా బతకడం వరకూ వెళ్లిపోయిందా వేగంగా బ్రేకప్ కహానీ… మరి కోలీవుడ్ మీడియా కోడికూత వినిపించడం లేదేమిటి..? అంటే హైదరాబాద్ సర్కిళ్లలోనే పుట్టించారా ఈ వార్తను… ఇక్కడి మీడియాయే విడాకులు ప్రసాదించబోతోందా..? స్నేహ అలియాస్ సుహాసినీ రాజారాంనాయుడు దృష్టికి ఇంకా ఈ వార్తలు పోలేదా..? వీళ్లు ఎన్నిసార్లు విడాకులు ఇవ్వలేదులే అని లైట్ తీసుకుందా..? లేక నిజంగానే ఏమైనా ఉందా..?!
Share this Article