నిజానికి ఇది మెయిన్ పేజీలో ఓ ప్రధానవార్తగా పబ్లిష్ చేయాల్సిన కనెక్టింగ్ వార్త…! ఈ సొల్లు విద్వేష రాజకీయ వార్తల్లోనే ఇంకా ఎన్నాళ్లు మునిగితేలతాం..? ఇదుగో ఇలాంటి వార్తల్ని హైలైట్ చేసుకుంటే ఎందరికి సాంత్వన… మరెందరికి తమ భావి జీవితాలపై ఆశలు… మరీ లోకల్ జోన్ పేజీ వార్తగా చూశాయి మన తెలుగు పాత్రికేయ పెద్దబుర్రలు, ఇప్పుడు ఆ వార్తలోని విశేషం ఏమిటో అర్థమవుతోంది, శుభం… సరే, ముందుగా సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన ఆ అసలు వార్త ఏమిటో (కొంత వాల్యూ ఆడిషన్‌తో) చదువుదాం…
చెన్నైలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని బ్రిటిష్ కాలం నాటి ఓ మానసిక చికిత్స కేంద్రం ఉంది… దేశంలోనే అది అతిపెద్ద మెంటల్ హాస్పిటల్… ఆస్తి సంబంధ సమస్యలతో మానసికంగా డిస్టర్బయిన మహేంద్ర అనే 42 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం చేరాడు… మెల్లిమెల్లిగా తన అస్వస్థత నుంచి కోలుకున్నాడు… తండ్రి మరణం తరువాత మానసిక సమస్యలతో దీప అనే 38 ఏళ్ల మహిళ కూడా చికిత్స కోసం చేరింది, ఆమెకూ త్వరలోనే నయమైంది…
వాళ్లిద్దరినీ ‘హాఫ్ వే హోం’లో ఉంచారు హాస్పిటల్ డాక్టర్లు… హాఫ్ వే హోం అంటే వ్యాధి నయమైనట్టే లెక్క, కానీ వెంటనే బయటికి డిశ్చార్జ్ చేయకుండా తాత్కాలిక ఆశ్రయం ఇస్తారు అందులో… అక్కడ ఈ ఇద్దరి నడుమ పరిచయం పెరిగింది, ప్రణయంగా మారింది… ప్రణయం అనడంకన్నా అవగాహన పెరిగిందనడం కరెక్టు… తమ పెళ్లికి ఇబ్బందులేమిటో తెలుసు, ఒకరికొకరం తోడుగా బయట మామూలుగా బతకగలమనే నమ్మకం ఏర్పడింది… బయటికి రాగానే హత్తుకుని తీసుకువెళ్లేవాళ్లు కూడా లేరు వాళ్లకు… సో, ఓ సాధారణ లవ్ యవ్వారం కాదు, లెక్కలు అన్నీ వేసుకుని మరీ పెళ్లికి సిద్దపడ్డారు…
Ads
723 రోగులు, అందులో 246 మంది మహిళలే… చాలామంది రోగపీడితులు వయోలెంట్‌గా ఉంటారు… అక్కడే చిన్న చిన్న సమస్యలతో అక్కడ చేరినవాళ్లూ ఉంటారు… హాస్పిటల్‌లో చేరకుండా బయట మెంటల్ డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకునేవాళ్లూ కోకొల్లలు… కానీ ఒకసారి మెంటల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని బయటికి వెళ్తే సమాజం ఎప్పటికీ ‘మెంటల్ గాళ్లు’ అనే చూస్తుంది… ఇక పెళ్లి దాకా ఎవరు ముందుకొస్తారు..? మహేంద్ర, దీప సమస్య కూడా అదే… విడివిడిగా పెళ్లి కోసం ప్రయత్నించలేరు, కుదరదు, ఎవరూ దొరకరు, మరి మనమే ఒక్కటైతే..? ఆ ఆలోచన నుంచి ఇక రిలేషన్ పెరిగింది…
ఇక్కడ అభినందించాల్సిన అంశం ఏమిటంటే… హాస్పిటల్ డైరెక్టర్ పూర్ణ చంద్రిక ఆలోచించి, అడుగు ముందుకేసిన తీరు… ఈ జంట తరచూ కలిసి తిరగడం, ప్రేమ వ్యవహారం ఆమెకు ఓ ఫిర్యాదులాగా అందింది… మొదట్లో కొన్ని ఆంక్షలు పెట్టింది అడ్మినిస్ట్రేటర్‌లా… తరువాత ఆలోచించింది… వాళ్ల జీవితాలు వాళ్ల ఇష్టం… వాళ్లు ఆల్‌రెడీ సగం డిశ్చార్జ్ చేయబడిన రోగులు… పైగా వాళ్లు ఒక్కటైతే హాస్పిటల్‌కు ఏమిటి నష్టం..? ఇలా ఆలోచిస్తుంటే ఆమెకు హాస్పిటల్‌కు పేరు తెచ్చే ఓ ఐడియా తళుక్కుమంది… అంతేకాదు, లక్షలాది మంది మానసిక అస్వస్థులకూ, వారి మీద దుఖపడేవాళ్లకు నచ్చే ఐడియా… కీలకమైన ఓ విషయాన్ని సమాజంలోకి బలంగా తీసుకుపోయే ఐడియా…
వాళ్లిద్దరికీ మనమే పెళ్లి చేస్తే పోలా..? అదీ ఆ ఐడియా… కొంత రిస్కీ… కానీ ఆమె నిర్ణయం తీసుకుంది… మానసిక అస్వస్థత కూడా అన్ని రోగాల్లాంటిదే… చికిత్సలు ఉన్నయ్, మందులు ఉన్నయ్, సుగర్ బీపీ వస్తే జీవితాంతం మెయింటెయిన్ చేయడం లేదా..? ఇదీ అంతే… పక్కా సాధారణ జీవితం గడపొచ్చు అనే మంచి సందేశం సమాజంలోకి వెళ్లడానికి దీన్ని ఉపయోగించదలిచింది ఆమె… హాస్పిటల్ సిబ్బంది సై అన్నారు… లోకల్ ఎమ్మెల్యే తనే ఓ తాళిబొట్టు కొనుక్కునివచ్చాడు… మంత్రి శేఖర్ బాబు, ఎంపీ దయానిధిమారన్ బంధువుల్లా వచ్చారు… హిందూ పద్దతిలో జరిగిన ఈ పెళ్లిలో వాళ్లిద్దరికీ ఆ హాస్పిటల్‌లోనే కొలువులు ఇచ్చే ఆర్డర్లు ఇచ్చి ఆశీర్వదించారు… ఇదీ వార్త… ఎంత పాజిటివిటీ ఉంది వార్తలో…
నిజమే కదా… ఒక్కసారి మెంటల్ హాస్పిటల్‌కు వెళ్లి, నయమై తిరిగొస్తే మళ్లీ మామూలుగా చూస్తున్నామా..? మనవాళ్లనే మనం గతంలోలాగా ట్రీట్ చేయం… పిచ్చిది, పిచ్చోడు అని ఒక్కసారి ముద్రపడిందంటే ఇక లైఫ్ లాంగ్ దాన్ని మోస్తూ తిరగాల్సిందే… ఆ వివక్షను భరించాల్సిందే… ఇదీ ఓరకమైన సామాజిక జాఢ్యమే… అది బ్రేక్ పడాలంటే చాలాకాలం పడుతుంది… లేదంటే గానుగాపూర్‌లు, కొండగట్టులే గతి…!!
Share this Article