అరె., ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూనే ఫైట్లు చేసిందా..? ఎంతటి కన్విక్షన్..? ఎంతటి కమిట్మెంట్..? చివరకు డబ్బింగ్ కూడా సెలైన్ ఎక్కించుకుందట కదా… నిజంగా గ్రేట్.. అవునూ, సానుభూతితో ప్రేక్షకుల్ని రప్పిద్దాం అనే ఆలోచనతోనే సినిమా ప్రమోషన్ ఇలా ప్లాన్ చేశారా..? ఇన్నాళ్లు మయోసిస్‌తో పోరాడుతున్నప్పుడు ఒక్కమాట బయటచెప్పని సమంత సరిగ్గా సినిమా రిలీజుకు ముందే తన వ్యాధి గురించి బయటికి చెప్పుకోవడం ఏమిటి..? ఈ వుమెన్ సెంట్రిక్, పాన్- ఇండియా సినిమా ప్రమోషన్ కోసమేనా..?
….. అనే ముందస్తు చిక్కు ప్రశ్నల్ని మైండులో నింపుకుని థియేటర్‌కు వెళ్లాల్సినంత సినిమా ఏమీ కాదు ఇది… కాకపోతే ఉన్నంతలో పర్లేదు, మరీ తేలికగా కొట్టిపారేయదగినది మాత్రం కాదు… దానికి కారణం కూడా సమంతే… సమంత లేకపోతే ఈ కథ, ఈ ప్రజెంటేషన్ ఈమాత్రం బాగుండేది కాదు… అలా బాగా చేసేసింది, బాగా అలవాటైపోయి… నటరాక్షసి…
హరి, హరీష్… ఈ దర్శకులకు మంచి కథే దొరికింది… సరోగసీ నేపథ్యం అని ప్రచారం చేశారు గానీ… సరోగసీ రిలేటెడ్ కథ కాదు… అక్కడక్కడా దాన్ని కూడా టచ్ చేసినా సరే, పిండాలతో బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీ, మాఫియా, ఎక్కడెక్కడికో విస్తరించిన సేల్స్ నెట్‌వర్క్, ఆ ప్రయోగాలకు వేదికగా ఓ ఫర్టిలిటీ హాస్పిటల్… అక్కడ చికిత్సకు చేరిన సమంత, క్రైమ్ ఇన్వెస్టిగేషన్… యాక్షన్ థ్రిల్లర్‌గా కథనం… దానికి తగినట్టుగా హీరోలకు దీటుగా సమంత ఫైట్లు… డూపులు, రోపులు లేకుండా… ఆమెకు దీటుగా వరలక్ష్మి నటన… ఇవన్నీ బాగున్నయ్…
Ads
యశోద అద్దె గర్భానికి ఎందుకు అంగీకరించిందనే అంశం కూడా ఇంట్రస్టింగుగానే సాగింది… మొదట్లో సాదాసీదాగా మొదలై, ఇంటర్వెల్, ఆ తరువాత కాస్త ఊపందుకుని, తరువాత చల్లబడి, చివరకు సాదాసీదాగానే ముగిసింది సినిమా… విలనీ ఏమిటో, విలన్లు ఎవరో కొన్ని ట్విస్టులు వాటంతటవే రివీల్ గాకుండా యశోదే బయటపెట్టినట్టు ఉంటే బాగుండేది…
రెండు ఫ్లాష్ బ్యాకులు, శత్రు-సంపత్ ఇన్వెస్టిగేషన్ సీన్లు సిల్లీగా ఉన్నా… కథనం బోర్ కొట్టదు, అలాగని హై అనిపించే సీన్లు కూడా పెద్దగా లేవు… అంటే కథ బాగుంది, ప్రజెంటేషన్ దానికి తగినట్టు లేదు అని అర్థం… అందుకే మరోసారి మనకే అనిపిస్తుంది… నిజంగా ఇది మంచి పాత్రే, వుమెన్ సెంట్రిక్ సినిమా… సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది… ఐనా ఓ వ్యాధితో పోరాడుతూ, కష్టపడి చేయడం సమంతకు అంత అవసరమా అని…!
సంగీతం సోసో… ఈమాత్రం ఫైట్లకు మన ఫైటర్లు సరిపోతారు కదా, మరీ హాలీవుడ్ స్టంట్‌మాన్ రావల్సినంత ఇంపాక్ట్‌ఫుల్ ఫైట్ కొరియోగ్రఫీ అనిపించలేదు… ఉన్ని ముకుందన్ సహా మిగతా పాత్రధారులు వోకే అంటే వోకే… వాళ్ల కేరక్టరైజేషన్ అంతేమరి… వరలక్ష్మి తనకు అప్పగించిన పాత్ర కేరక్టరైజేషన్ మేరకు బాగా చేసింది, కానీ ఆ కేరక్టరైజేషన్ కూడా ఒకరకంగా వీకే… సమంత సెంట్రిక్ కదా… ఆమే హైలైట్ అవుతూ వస్తుంది చివరిదాకా…
అయితే వచ్చే సమస్యల్లా… మన ప్రేక్షకులు కూడా హీరోయిజానికి అలవాటు పడీ పడీ… హీరోయినిజాన్ని ఓపట్టాన అంగీకరించరు… అంటే వ్యతిరేకిస్తారనే, ఇష్టపడరనో కాదు… అంత ఆసక్తిని కనబరచరు అని… మూర్ఖ ఫ్యానిజం తమ హీరో ప్రతి కదలికకూ చప్పట్లు కొడుతుంది… అంతటి మురిపెం, పిచ్చి, పైత్యం హీరోయినిజం పట్ల ప్రదర్శింపబడదు…
యశోద సినిమా కూడా వుమెన్ సెంట్రిక్ కథ కాబట్టి పెద్ద పెద్ద స్టార్లకు కూడా అక్కరకు రాదు… ఇక మనకు కష్టపడి పనిచేయగల, మెరిట్ ఉన్న తారామణుల్లో స్టార్ మణి సమంతే కాబట్టి ఆమే ఈ కథకు పెద్ద దిక్కయింది… అయితే థియేటర్ దాకా వెళ్లి చూడాల్సినంత సీనుందా..? లేదు… అలా చూస్తే మరీ పైసల్ వేస్ట్ అనే అసంతృప్తి కూడా ఏమీ పెద్దగా ఉండకపోవచ్చు…! సమంత వల్ల…!!
Share this Article