సాధారణంగా పాన్ ఇండియా మూవీ అంటే..? ఏముంది… మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో డబ్ చేసుకుని రిలీజ్ చేసుకోవడం, మంచి బయ్యర్లను ఎంపిక చేసుకోవడం… మరీ రాజమౌళి మార్క్ మార్కెటింగ్ అయితే దేశదేశాలు వెళ్లి, కొత్త సంపాదన ప్రాంతాల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం…! పాన్ వరల్డ్ సినిమా కావాలంటే ఇంగ్లిషులోని కూడా డబ్ చేసి, చేతనైతే ఇతర దేశాల్లో ఆ సినిమాల్ని విడుదల చేసుకోవడం…
అంతేకదా… నిజానికి మలయాళం, కన్నడ మార్కెట్లు కూడా చిన్నవే… తెలుగు, తమిళం, హిందీ ఈ మూడు భాషలు చాలు దేశమంతా సినిమా ప్రాచుర్యంలోకి రావడానికి..! కానీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఏకంగా 11 భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తాడట… అదేనండీ, ది వ్యాక్సిన్ వార్ అని సినిమా ప్రకటించాడు కదా… కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం సృష్టించాడు కదా, తన కొత్త ప్రాజెక్టు ఇది… వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజు…
హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడం, ఉర్దూ, అస్సామీ (లెక్కలో ఒకటి ఎక్కువే వస్తోంది, వాళ్ల ప్రెస్ నోట్ ప్రకారం…) ఇందులో మలయాళం ఇంకా చేర్చనేలేదు… ఇన్ని భాషల్లోకి తర్జుమాలు అంటే ఏదో సంకల్పంతో తీస్తున్న సినిమా అని అర్థం… తను అసలే వివేక్ అగ్నిహోత్రి, జాతీయవాది, అనగా ప్రొబీజేపీ, ప్రొమోడీ… అంటే బహుళ ప్రాచుర్యం కోసం ఉద్దేశించిన సినిమా ఇది…
Ads
అంటే వ్యాక్సిన్ విషయంలో మోడీ సాధించిన విజయాలకు విస్తృత ప్రచారమే ఆ ఉద్దేశం అనీ, ఇది బీజేపీ స్పాన్సర్డ్ సినిమా అనీ అర్థం చేసుకోవాలి… డబ్బు ఇవ్వకపోవచ్చు, కాశ్మీర్ ఫైల్స్‌తోనే బోలెడంత డబ్బు వచ్చింది, అది చాలు… కానీ కాషాయ శ్రేణులు సినిమాను మూలమూలకూ తీసుకెళ్తారు… బ్రహ్మాండమైన రీచ్… అదీ నిర్మాతలకు కలిసిరాబోయే అంశం… ఉభయతారకం… అయితే…
కాశ్మీర్ ఫైల్స్ కథ వేరు… అనేక చేదు వాస్తవాల్ని ఇన్నాళ్లూ దాచిపెట్టారు… అదొక నరమేధం… అదొక ఉన్మాదం… అది యావత్ హిందూ జాతికే జారీచేయబడిన యుద్ధహెచ్చరిక… అందుకే అది ప్రేక్షకులకు కనెక్టయింది… కానీ వ్యాక్సిన్ వార్ ఓ వెరీ డ్రై సబ్జెక్టు… అందుకే ఆ కథను ఎలా రాసుకున్నారు అనేది ఆసక్తికరమే… పైగా పదే పదే కరోనా పేరు, దానితో కనెక్టయి ఉన్న పేర్లను వినడానికి కూడా జనం ఇష్టపడటం లేదు…
ఇంతకీ వ్యాక్సిన్ కోసం వార్ ఏం జరిగింది..? ఇదేనా కంటెంట్..? దేశాల నడుమ జరిగిన యుద్ధమా..? దేశంలోనే జరిగిన యుద్ధమా..? వ్యాక్సిన్ తయారీలో ఎవరు ముందు సక్సెస్ అయితే వాడి పంట పండినట్టే… అందుకే కంపెనీల నడుమ, దేశాల నడుమ ఓ యుద్ధమే జరిగింది… అది చూపించదలుచుకున్నాడా..? నిజానికి వ్యాక్సిన్ విషయంలో మోడీ విధానాలు అర్థరహితంగా సాగాయి… వేరే దేశాలకు ఉచితంగా పంపిస్తూ, మన దేశంలో అడ్డగోలు ధరలు (తయారీ ధరతో పోలిస్తే మరీ మరీ మరీ ఎక్కువ) ఖరారు చేయడంపై రాష్ట్రాలు కస్సుమన్నాయి…
కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ తయారీ కంపెనీల మీద జులుం ప్రదర్శించాయనే విమర్శలు, అదర్ పూనావాలా అందుకే విదేశాలకు వెళ్లిపోయాడనీ వార్తలు వచ్చాయి… విధిలేక మోడీ దిగివచ్చి ధరలను హేతుబద్ధం చేయాల్సి వచ్చింది… ఇప్పటికీ వ్యాక్సిన్‌పై కేంద్రానికి ఓ స్థిరవిధానం లేదు… అసలు ప్రయోగ ఫలితాల పరిశీలనే సరిగ్గా జరగలేదనే ఆరోపణలు కూడా ఉండనే ఉన్నాయి… ఇవన్నీ కన్వీనియెంటుగా దాచిపెట్టేసి, మోడీ విధానాలకు జైజై అనిపించడమే ఈ సినిమా సంకల్పం కావచ్చు బహుశా… కావచ్చు ఏమిటి… దాని కోసమే…!
Share this Article