అర్పుతం అమ్మాల్… బహుశా మన దేశంలోని ప్రతి వ్యవస్థనూ టచ్ చేసిందామె… ఎన్నిరకాల మార్గాలున్నాయో ఏ ఒక్కటీ వదల్లేదు… తన కొడుకు పెరారివలన్‌ను వదిలిపెట్టాలని కోరుతూ ఆమె చేసిన పోరాటం వంటిది మరొకటి లేదేమో మన న్యాయవ్యవస్థలో..! తమ స్థానిక శ్రేయోభిలాషుల దగ్గర నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, తమిళనాడు కేబినెట్, గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధాని… ఎవరు సాయపడగలరని అనిపిస్తే వాళ్ల దగ్గరకు ఆమె విజ్ఞప్తి వెళ్లేది… అదీ సరైన పద్ధతిలోనే… చివరకు గెలిచింది, కొడుకు యావజ్జీవ జైలుశిక్ష నుంచి విడుదలయ్యాడు…
నిన్న సుప్రీం కోర్టు రాజీవ్ హంతకులందరినీ రిలీజు చేయాలని ఆదేశించింది కదా… దానికీ పెరారివలన్ విడుదలనే ప్రస్తావించింది… రాజీవ్ హంతకుల విడుదలకు సుప్రీం తన అసాధారణ అధికారాల్ని (ఆర్టికల్ 142) వినియోగించింది… నిజానికి పెరారివలన్ విడుదల సమయంలోనే అందరూ అనుకున్నారు… మిగతావాళ్లను కూడా విడుదల చేస్తారని… వెరసి రాజీవ్ హత్య కేసు ఇలా ముగింపుకొచ్చింది… ముందుగా ఆమె పోరాటం తెలుసుకుని, మిగతావి చదువుకుందాం…
ఆ ఆర్టికల్ 142ను సుప్రీంకోర్టు గతంలో యూనియన్ కార్బయిడ్, అయోధ్య కేసుల్లో మాత్రమే వినియోగించింది సుప్రీంకోర్టు… యూనియన్ కార్బయిడ్ అంటే తెలుసు కదా, బ్యాటరీలను తయారు చేసే కంపెనీ, భోపాల్ ట్రాజెడీకి మూలం… అవును, ఈ పెరారివలన్ కేసులోనూ బ్యాటరీయే మూలకారణం…
Ads
రాజీవ్ హత్య నాటికి తన వయస్సు 19 ఏళ్లు… ఆ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తన ఇంటికి వచ్చింది… తల్లి అడిగింది ఏమిటని..? మీవాడిని విచారించాలి, తరువాత వదిలేస్తాం అన్నారు… అంతే ఇక… పాతికేళ్లపాటు తిరిగి ఇంటికి రాలేదు తను… ఇంతకీ తన మీద నేరారోపణ తెలుసా..? తొమ్మిది వోల్టుల పవర్ ఉండే బ్యాటరీ సెల్స్‌ను మనం టార్చి లైట్లలో, రేడియోల్లో వాడుతూ ఉంటాం కదా… ఎవరో తెలిసినవాళ్లు అడిగితే అలాంటివి రెండు కొనుక్కొచ్చి ఇచ్చాడు… ఆ సెల్స్ ఉపయోగించే థాను అనే ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళం సభ్యురాలు తనను తానే పేల్చేసుకుని, రాజీవ్ గాంధీని బలిగొన్నది…
మొదట నిందితులకు ఉరిశిక్ష విధించారు… తరువాత యావజ్జీవ కారాగారానికి తగ్గించారు… ఇది చచ్చేవరకూ జైలులోనే ఉండాల్సిన యావజ్జీవం… రెమిషన్లు తీసుకుని ఏ పద్నాలుగేళ్లకో విడుదలైపోయే జీవితఖైదు కాదు… ఈ కేసులో రాజీవ్ కుటుంబసభ్యులు సోనియా, రాజీవ్, ప్రియాంక హంతుకులను క్షమిస్తున్నట్టు ప్రకటించారు… కానీ ఇది ఆ కుటుంబానిది మాత్రమే కాదు, దేశానిది కూడా… అందుకే ప్రతి వ్యవస్థ నిందితుల పట్ల కఠినంగానే వ్యవహరించింది…
పలు ప్రజాసంఘాలు వీళ్ల విడుదలకై ఎడతెగని పోరాటాలు చేశాయి… చివరికి కేసు అటు తిరిగి, ఇటు తిరిగి, ఏళ్లకేళ్లు నానీ, నానీ… ఇదుగో ఇప్పుడు సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాల్ని వినియోగిస్తే తప్ప ‘‘142 ఆర్టికల్ చెప్పిన సంపూర్ణ న్యాయం’’ సిద్ధించలేదు… ఇక ఇప్పుడు తన సహనిందితులు నళిని, మరో నలుగురైదుగురి విడుదలకూ మార్గం సుగమం అయినట్టే…
ఈ కేసు దర్యాప్తులో ఉన్న సీబీఐ మాజీ ఎస్పీ త్యాగరాజన్ తనే స్వయంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చాడు… పెరారివలన్ వాంగ్మూలాన్ని సరిగ్గా రికార్డు చేయలేదని, తప్పులున్నాయని…! తను కొన్న బ్యాటరీ సెల్స్ దేనికి వినియోగించబోతున్నారో పెరారివలన్‌కు తెలియదని పేర్కొన్నాడు… అలాంటప్పుడు కుట్రలో భాగస్వామి ఎలా అవుతాడు..? ఈ కేసులో శిక్షలు ఖరారు చేసిన త్రిసభ్య బెంచ్ జస్టిస్ థామస్, పైసా ఫీజు ఆశించకుండా సాయం చేసిన అడ్వొకేట్ గోపాల శంకరనారాయణన్… రాష్ట్రపతులకు లేఖలు రాసిన జస్టిస్ కృష్ణ అయ్యర్… అనేకమంది అర్పుతం అమ్మాల్ వెన్నుదన్నుగా నిలిచారు… కథ సుఖాంతమైంది… అయినట్టు కనిపిస్తోంది… ఈమె కొడుకుకు విముక్తి దొరికినట్టే మిగతావాళ్లకూ ఇప్పుడు విముక్తి లభించింది…
Share this Article