గంభీరమైన, లోతైన న్యాయచింతనలోకి వెళ్లాల్సిన పనిలేదు… సంక్లిష్టమైన వాదప్రతివాదాలూ అవసరం లేదు… ప్రతి జాతికీ ఓ కసి ఉంటుంది… అది తన అహాన్ని తృప్తిపరచుకునే కసి… తనపై ఏరకమైన దాడిచేసినా అది ఊరుకోదు… ఊరుకుంటే దానికి ఓ ప్రత్యేక జాతి లక్షణం లేనట్టే… ఉదాహరణకు ఇజ్రాయిల్… తమను నష్టపరిచే ఎవడినైనా సరే వెంటాడి, వేటాడి ఖతం చేస్తుంది… ఏ స్థాయి సాహసానికైనా తెగబడుతుంది… ఇక మనం మన ప్రపంచానికి వద్దాం…
కసబ్… ఎక్కడి వాడు..? మన శతృదేశస్థుడు… మనమంటే విపరీతమైన కోపం… ఈ మనం అనే సమూహంలో తన మతస్థులు కూడా ఉంటారు, అందరూ ఉంటారు… ఐనా మనం అంటే వాడికి ద్వేషం… ముంబైలోకి జొరబడి ఎడాపెడా కాల్పులు జరిపాడు… దొరికాడు… సరే, కొన్నాళ్లు విచారణ జరిపి, తరువాత ఉరి తీసేశాం… వాడి కథ ఖతం… వాడొక ఉగ్రవాది… వాడిది ఉగ్రవాద చర్య… మన భాషలో అంతే కదా…
మురుగన్, శాంతన్… శ్రీలంక దేశస్థులు… కారణాలు ఏవైనా సరే, రాజీవ్‌ను హతమార్చే ఆపరేషన్ కోసం ఇండియాలో అడుగుపెట్టారు… అదొక టీం, అదీ ఉగ్రవాద చర్యే… రాజీవ్‌ను హతమార్చారు… పట్టుబడిన కొందరిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు… మొదట ఉరిశిక్ష… తరువాత యావజ్జీవ జైలు శిక్షకు తగ్గింపు… ఆ తరువాత విడుదల కోసం ఉద్యమాలు… చివరకు సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలతో ‘సంపూర్ణ న్యాయం’ పేరిట విడుదల చేసేసింది… మమ్మల్ని మా దేశం పంపించేయండి అనడుగుతున్నారు వాళ్లిప్పుడు…
Ads
అసలు ఏమిటి సంపూర్ణ న్యాయం… ఒక జాతి తన కసిని చూపించాల్సిన హంతకులపై ఏకంగా సుప్రీంకోర్టే అసాధారణ అధికారాలను అసాధారణ రీతిలో ఉపయోగించి మరీ విడుదల చేయాల్సిన పనేమిటి..? అంత అవసరమేమిటి..? కసబ్ ఎంతో, మురుగన్ కూడా అంతే కదా… రెండూ ఉగ్రవాద చర్యలే కదా… కసబ్ కోసం కూడా ‘పొలిటికల్ ఫాయిదా’ ఉద్యమాలు చేసేవాళ్లుంటే వదిలేసే వాళ్లమా..? ఇది సగటు భారతీయుడి మథనం… దీనికి లోతైన చర్చ, విశ్లేషణ ఉండదు… ఓ మథనం ఉంటుంది…
వాళ్లను విడుదల చేయాలనేది తమిళుల బలమైన కోరిక అని అక్కడి పార్టీల భ్రమ… అందుకే డీఎంకే, అన్నాడీఎంకే సహా అందరూ ప్రయత్నించారు… అదేమంటే శ్రీలంక తమిళులకు మద్దతు… అంటే వాడెవడో ఇక్కడికి వచ్చి, ఇక్కడి భావి ప్రధానిని ఖతం చేసినా సరే, మనవాడేనా..? మన రూట్స్ ఉన్నవాడైతే క్షమించాల్సిందేనా..? ఐనా మొన్నమొన్నటిదాకా చైనా చంకలో చేరి, ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని, హిందూ మహాసముద్రంలో చైనాకు ఓ అడ్డాగా మారింది ఈ శ్రీలంకే కదా… పాకిస్థాన్‌కన్నా ఆ దేశం ఏం తక్కువ..?!
ప్రతి పార్టీ బయటికి ఓరీతిలో, లోపల మరో రీతిలో మాట్లాడుతుంది… అంతెందుకు..? సోనియా కుటుంబం క్షమిస్తుంది… ఆమె చెప్పుచేతల్లోని పార్టీ ఖండిస్తుంది… సుప్రీం తీర్పు విచారకరం అని ప్రకటిస్తుంది… రాహుల్ ఇది కోర్టులు తీసుకోవాల్సిన నిర్ణయం అంటాడు, తీరా ఇప్పుడు కిమ్మనడు…
పైగా ఇందులో అధికారాలు, పరిధుల చర్చ… గవర్నర్లు ఈ ఫైళ్లను తొక్కిపెట్టడం ఏమిటి అంటుంది సుప్రీం… అందుకని వాళ్ల అధికారాలను తోసిరాజని మరీ తన సొంత నిర్ణయాన్ని వెలువరిస్తుంది… అసలు ఈ అసాధారణ అధికారాలను ఏ సందర్భాల్లో వినియోగించాలి..? ఉగ్రవాద కేసుల్లో వాడొచ్చా..? అసలు శిక్ష అంటే ఏమిటి..? పరివర్తన కోసమేనా..? పరివర్తనే శిక్ష పరమార్థం అయితే ఉరిశిక్షే ఉండకూడదు కదా… ఈ కేసే తీసుకుందాం…
మొత్తం 41 మంది మీద చార్జిషీటు ఫైల్ చేస్తే, అందులో 12 మంది ఆల్‌రెడీ మరణించారు అప్పుడే… మొత్తం 26 మందికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధిస్తే, తరువాత సుప్రీంకోర్టు 19 మందిని విడుదల చేసింది… మిగతా ఏడుగురిలో నలుగురి మరణశిక్షనే ఖాయం చేసింది… తరువాత యావజ్జీవానికి తగ్గించబడింది… 2014లోనే… సుప్రీంకోర్టు ఒకవేళ ప్రవర్తన బాగున్నట్టయితే వారిని విడుదల చేయవచ్చునని చెప్పింది… జయలలిత ప్రభుత్వం దానికి సిద్ధపడింది కూడా… ఇప్పుడు విడుదల చేసేసింది… అంటే ప్రవర్తన బాగుంటే విడుదల చేసే పక్షంలో… ఉరిశిక్షను యావజ్జీవిత జైలుశిక్షగా మార్చడం దేనికి..? (అంటే బతికి ఉన్నంత కాలం జైలులోనే ఉండటం…)… మరి మిగతా కేసుల్లోలాగే యావజ్జీవంగా మార్చేస్తే అయిపోయేదిగా… (రెమిషన్లతో కొంతకాలానికి విడుదల చేయడం…)…
సరే, ప్రవర్తన బాగుంది, చదువుకున్నారు, సోనియా కుటుంబం క్షమించింది… ఇవి కారణాలా..? ఇక్కడ బాధితురాలు దేశం… ఒక జాతిగా ఈ కేసును చూడాలి… సరే, ఇప్పుడు టైగర్లు లేరు, వీళ్లు జైలులో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే… వదిలేస్తే సరి అనుకునే పక్షంలో మిగతా ఉగ్రవాద కేసుల్ని ఇదే కోణంలో పునస్సమీక్ష చేయగలమా..? మరి భీమారావు కోరేగావ్ కేసులో అంత కాఠిన్యాన్ని బెయిళ్ల విచారణ దశలోనే కనబరుస్తున్నాం దేనికి..? నిందితుల వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు, మానవీయ కోణం లేదు… అంటే మన న్యాయానికి ఒక నిర్దిష్ట దిశ ఉండదా..? డైనమిక్ అంటారా..? మరి ఆ చలనస్థాయి దేని మీద ఆధారపడి ఉంటోంది… ఇదంతా న్యాయం లోతుపాతుల మీద పూర్తి అవగాహన లేని ఓ సగటు భారతీయుడి మథనం… అంతే…
Share this Article