కాంతార గురించి ఏమైనా చెప్పండి సార్… ఆ హ్యాంగోవర్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం…. ఇవీ మెసేజులు…! నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల మీద వేసిన ముద్ర అంతా ఇంతా కాదు… ప్రత్యేకించి హిందీ ప్రేక్షకులైతే ఫుల్లు కనెక్ట్ అయిపోయారు… కర్నాటక కోస్తా ప్రజలకే పరిమితం అనుకున్న ఓ చిన్న సినిమా మొత్తం సినిమా వాణిజ్య సూత్రాలనే పెకిలించి వేస్తోంది… ఎక్కడి 15 కోట్లు, ఎక్కడి 400 కోట్లు… ఇంకా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో బాగా నడుస్తోంది… ఓఓఓ అనే ఆ క్లైమాక్స్ అరుపులు థియేటర్లను అదరగొడుతూనే ఉన్నాయి…
ఈ సినిమా విజయంతో రిషబ్ శెట్టికి బోలెడు ఆఫర్లు వచ్చిపడుతున్నయ్… తను దేనికీ కమిట్ కావడం లేదు… కాకపోతే హిందీ నుంచి వస్తున్న ఆఫర్లే తనను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నయ్… దర్శకుడిగా ఓ సినిమా చేసిపెట్టు, ఫలానా ప్రాజెక్టులో కలిసి పనిచేద్దాం, పోనీ, ఈ సినిమాలో నటించు, ఏం కావాలో అడుగు వంటి ఆఫర్లు… నిజానికి బాలీవుడ్ మన సౌత్ యాక్టర్లను, ప్రత్యేకించి లీడ్ రోల్స్‌లోకి అస్సలు ఇష్టపడదు… డబ్బింగ్ చేసిన సినిమాల్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు గానీ, బాలీవుడ్ సిండికేట్లు మనల్ని అస్సలు ఎంటర్ కానివ్వవు, ఎంటరైనా నిలవనివ్వవు, నిలబడే ప్రయత్నం చేసినా సరే, వెంటపడి ముంబై బయటికి తరిమేస్తాయి…
అదేమంటే… ఇడ్లీ సాంబార్ అనే వెక్కిరింపులు సరేసరి… ఇవన్నీ తెలియవా రిషబ్ శెట్టికి… అందుకే కొన్ని మ్యాగజైన్ల ఇంటర్వ్యూలలో తను బాలీవుడ్‌కు పనికిరానని పక్కాగా చెప్పేశాడు… ఎవరేమనుకుంటే తనకేమి..? ముంబై మాఫియాలు, సిండికేట్లు పనిచేయనివ్వవు, ఎందుకొచ్చిన తాపత్రయం… ఇదీ తన లెక్క… అంతేకాదు, మనసులో ఓ తడి… ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎంతెంత కష్టపడ్డాను.., ఎంత కాలాన్ని, వయస్సును ధారపోశాను కన్నడ సినిమా కోసం… ఇది నా ఇండస్ట్రీ…
Ads
మాషబుల్ ఇండియా అనే మ్యాగజైన్ సరదాగా ఓ ఉల్టా ప్రశ్న వేసింది… వోకే, రిషబ్, కన్నడ ఇండస్ట్రీతో నీ అటాచ్‌మెంట్ అర్థం చేసుకుందాం, నీకు హిందీ సినిమాలు అక్కర్లేదు, కానీ బాలీవుడ్‌కు నీ అవసరం కనిపిస్తోంది, హిందీ సినిమా అంటే అదీ ఇండియన్ సినిమాయే కదా అనేది ఆ ప్రశ్న…
బాగుంది ప్రశ్న… నిజానికి బాలీవుడే కాదు, ఏ ఇండస్ట్రీ కూడా ఫలానా వ్యక్తి అవసరముందని ఫీల్ కాదు… మెరిట్ ఉన్నవాళ్లు ఉంటారు, లక్ లేనివాళ్లు వెళ్లిపోతారు… అయితే ఈ ప్రశ్నకు రిషబ్ ఇచ్చిన జవాబు బాగుంది… అంతకుముందు చెప్పాడు కదా, తను రక్షిత్ శెట్టి కలిసి ఎలా కష్టాలు పడేవాళ్లో… థియేటర్ల ముందు టికెట్లను ఫ్రీగా పంచిన అనుభవాలు, క్లాప్ బాయ్‌గా పనిచేసిన అవస్థలు, వాటర్ క్యాన్లు అమ్మి బతికిన రోజుల గురించీ సిన్సియర్‌గానే పంచుకున్నాడు… సక్సెస్ వచ్చింది కదాని హైఫై కోతలకు పోలేదు… రెస్టారెంట్లు, సివిల్ కన్‌స్ట్రక్షన్స్ పనులు కూడా చేశాడు…
తాజా ఇంటర్వ్యూలో మరో విషయం చెప్పుకొచ్చాడు… ‘‘బీకామ్ పూర్తి చేశాక నేను ఎంబీఏ రెండుసార్లు ట్రై చేశాను… ప్చ్, చేయలేకపోయాను… సైనైడ్ అనే సినిమాకు పనిచేశాను… నిజానికి క్లాప్ బాయ్‌గా కూడా కాదు… చెబితే నమ్మరు గానీ, షూట్ టైమ్ కాగానే ఆర్టిస్టులను స్పాట్‌కు పిలుచుకుని వచ్చే బాయ్ నేను… అంతగా ఈ కన్నడ ఇండస్ట్రీలో కష్టపడ్డాను… ఇప్పుడు ఎలా వదిలిపెడతాను…’
చెప్పనేలేదు కదూ… కన్నడంలో ఎక్కువ మంది చూసిన సినిమాగా ఆల్‌రెడీ కేజీఎఫ్-2 రికార్డును బద్దలు కొట్టేసిన ఈ కాంతార కర్నాటకలో ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాగా మరో రికార్డు క్రియేట్ చేస్తోంది… హిందీలో దాదాపు 70 కోట్ల దాకా వసూలు చేయగా, ఒక్క కన్నడంలోనే 170 కోట్ల వసూళ్లు దాటినట్టు ట్రేడ్ వార్తలు చెబుతున్నాయి… తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు దీటుగా… కాదు, కాదు, వాటిని మించి నడుస్తోంది… ఏం రికార్డులురా బాబూ…!!
Share this Article