సీతారామరాజు, కుమ్రం ఇక జల్, జంగిల్, జమీన్ పోరాటంలో నిమగ్నం అవుతారు… ఈలోపు వీళ్ల కథ ఇచ్చిన ప్రేరణతో తమిళనాట వీరపాండ్య కట్టబ్రహ్మన ఆంగ్లేయులపై ఉడికిపోతుంటాడు… తను రహస్యంగా వచ్చి రామరాజును, భీమ్‌ని కలిసి కర్తవ్యబోధ తీసుకుని వెళ్తాడు… ఆంగ్లేయులపై పోరాటం మొదలుపెడతాడు… తమిళ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిపోతుంటాయి…
మరోవైపు ఝాన్సీరాణి ప్రాణాలైనా ఇస్తాను తప్ప ఈ క్షుద్ర ఆంగ్లేయులకు లొంగేది లేదంటూ భీష్మించుకుంటుంది… సమరానికి పిలుపునిస్తుంది… ఆమె దత్తుకొడుకును బ్రిటిష్ సైన్యం కిడ్నాప్ చేస్తుంది… మైసూరుకు తరలిస్తుంది… మొత్తం కోటను అప్పగిస్తేనే కొడుకును ఇస్తాం అంటుంది… ఆమె రహస్యంగా వెళ్లి కట్టబ్రహ్మన సాయాన్ని అర్థిస్తుంది… అతను అభయహస్తమిస్తాడు…
ఒకసారి ఎందుకైనా మంచిది, సావర్కర్ సలహాను, భగత్‌సింగ్ సూచనల్ని కూడా తీసుకుందాం అని అడవిలో ప్రణాళిక వేస్తారు… సావర్కర్ అప్పటికే ఓ నిప్పురవ్వ… తనే భగత్‌సింగ్, ఆజాద్ తదితర మెరికల్ని తయారు చేస్తాడు… కానీ బ్రిటిషర్లకు తనపై అనుమానం రాకుండా తను బ్రిటిష్ జైళ్ల శాఖలో సిపాయిగా పనిచేస్తూ, సమరయోధుల నడుమ కొరియర్‌గా కూడా పనిచేస్తుంటాడు… అప్పుడప్పుడూ అండమాన్ దాకా తనను పంపిస్తుంటారు…
Ads
తమిళనాడు నుంచి బ్రహ్మన సైన్యం, మరోవైపు ఝాన్సీ సైన్యానికి నడుమ సీమ నుంచి సైరా నర్సింహారెడ్డి సైన్యం వచ్చి కలుస్తుంది… అడవిలోని జంతుజాతిని కూడా ట్రెయిన్ చేసి, వాటినీ తీసుకుని ఉమ్మడిగా వెళ్లి మైసూరులో బ్రిటిష్ గవర్నర్ రూథర్‌ఫర్డ్ నివాసం, పటాలం మీద దాడి చేస్తారు… ఆయుధాలు తీసుకుంటారు… ఝాన్సీ కొడుకును విడిపిస్తారు… జయజయనాదాలు చేస్తూ అక్కడి నుంచి తమ రాజ్యాలకు తరలివెళ్తారు… బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం దక్షిణ భారతంలో ఎమర్జెన్సీ పెడుతుంది… పటేల్, గాంధీ, నెహ్రూలను బ్రహ్మన దగ్గరకు రాజీచర్చలకు పంపిస్తుంది… ఈ కథ ఇలా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది… ఆర్ఆర్ఆర్-3 త్వరలో అని శుభం కార్డు పడుతుంది…
ఏమిటి జుత్తు పీక్కుంటున్నారా..? ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని రాజమౌళి ప్రకటించాడు కదా… తండ్రి విజయేంద్రప్రసాద్ ఆ కథారచనలోనే నిమగ్నం అయి ఉన్నట్టు కూడా చెప్పాడు… అసలే బీజేపీ కొత్తగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది ఆయనకు… మరి సావర్కర్ తదితరుల్ని హీరోలుగా చేయకపోతే ఏం బాగుంటుంది..?
మరి ఈ ఝాన్సీ, బ్రహ్మన కలవడం ఏమిటి..? ఈ భగత్, ఆజాద్ సహకారం ఏమిటి..? మధ్యలో సైరా దూరడం ఏమిటి..? అసలు ఏమిటీ పిచ్చి కథ..? ఎవరి జీవితకాలం ఏమిటి..? వాళ్లను ఒక్క కథాకాలంలోకి తీసుకురావడం ఏమిటి..? అంటారా..? భలేవారే… ఆర్ఆర్ఆర్ కథ కూడా ఇంతే కదా… కలలో ఏది కనిపిస్తే అది కాగితం పెట్టేసి, సీతారామరాజును కూడా బ్రిటిష్ సైన్యంలో చేర్చారా లేదా..? జంగిల్‌లోని జంతుజాలాన్ని తీసుకుని కుమ్రం జంగ్‌కు బయల్దేరాడా లేదా…? అరె, క్రియేటివిటీ బాసూ… ఎవడూ ఏమీ అడగడానికి లేదు… సర్కస్ ఫీట్ల వంటి ఫైట్లు గట్రా పడ్డాయా లేదా, మంచి గ్రాఫిక్స్ కుదిరాయా లేదా..? ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ నెట్‌వర్క్ వాడుకున్నామా లేదా, 1500 కోట్లు దంచగలమా లేదా అనేదే ముఖ్యం… కథ ఎవడికి కావాలి..?
ఆ కథాకాలం ఎవడికి కావాలి..? వీలయితే ఈసారి మహేశ్ బాబు, మళ్లీ ప్రభాస్, ఎలాగూ జూనియర్ తప్పదు… సావర్కర్ పాత్రకు బాలయ్యే సరి… పదే పదే అడుగుతున్నాడు… థియేటర్ల టాపులు లేచిపోవాల్సిందే… ఒకరిద్దరు హిందీ హీరోయిన్లను వెతకాలి… హిందీ మార్కెట్ కావాలి కదా… ఝాన్సీ పాత్రకు ఓ మాంచి టెంపర్ ఉన్న నటి కావాలి… కంగనాను తీసుకుంటే, ఆల్‌రెడీ ఆ పాత్ర చేసింది, పైగా మెంటల్, చెప్పినట్టు వినదు… తీరా మధ్యలో రాజమౌళే మొత్తం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చినా రావచ్చు… దీపికను తీసుకుందాం… జీరో సైజ్ అయితేనేం, గ్రాఫిక్స్‌లో కవర్ చేద్దాం, ఆలియా భట్ కూడా అంతే కదా… (సరదాగా… ఏమో, ఇదే నిజం కావచ్చు కూడా… పాపం శమించుగాక…)
Share this Article