అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె… ఎంత గట్టి గుండె… ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని తట్టుకుంది… మరింత గట్టిపడింది… ప్రతిఘటించే గుండె అది… కొట్లాడే గుండె అది… నీరసించి, సాగిలబడే గుండె కాదది… ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్ చేసిన గుండె అది…
పెద్ద పెద్ద తలకాయలకే చేతకాని రోజుల్లో… సెవెన్టీ ఎంఎంలు, జేమ్స్ బాండ్ సినిమాలు, ట్రెజర్ హంట్స్, కొత్తగా ఏదొస్తే అది… ఓ సాహసికి ఉండే గుండె అది… నటన రాదు, డాన్స్ రాదు అన్న నోళ్లకు సక్సెసులతో సమాధానం చెప్పిన గుండె… రోజుకు మూడు షిఫ్టులుగా ఏళ్లకేళ్లు పనిచేసిన గుండె… సినిమా ఫ్లాపై కన్నీళ్లు పెట్టుకునే నిర్మాతలను ఓదార్చి, మళ్లీ ఫ్రీగా సినిమా చేసి నిలబెట్టిన గుండె అది…
నటన, నిర్మాణం, దర్శకత్వం, రాజకీయం, స్టూడియో ఓనర్… వాట్ నాట్… అన్నీ చూసింది గుండె… ఆటుపోట్ల నడుమ ఇన్నేళ్లు సజావుగా కొట్టుకున్న గుండె ఇప్పుడు శృతితప్పుతోంది… వయోభారం… ప్రియసతి విజయనిర్మల రెండున్నరేళ్ల క్రితం వెళ్లిపోయింది… ఈ గుండె సగం బలహీనమైపోయింది… మొన్నటి జనవరిలో పెద్ద కొడుకు రమేశ్ హఠాన్మరణం… అదే గుండెకు మరో షాక్… ఆమధ్య సంప్రదాయ సతి ఇందిర కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది…
Ads
ఆ గుండె ఒంటరిదైపోయింది… చుట్టూ ఒంటరితనం… చాన్నాళ్లుగా ఇందిర అనారోగ్యంతో ఉన్నా సరే, ఆమె ఉనికి కృష్ణ గుండెకు ఓ బాసట… సొంత మామ కూతురే… ఐతేనేం, పెళ్లయిన నాలుగేళ్లకే విజయనిర్మల మాయలో పడి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు… ఐనాసరే, ఇందిర మౌనంగానే భరించింది… ఈ బావే సర్వస్వం అనుకుంది… అయిదుగురు పిల్లలు… కృష్ణ గుండె ఎన్ని ఆటుపోట్లలో పడినా… పెద్ద భార్యగా కష్టనష్టాల్లో, గెలుపోటముల్లో, సమస్యల్లో, సంతోషాల్లో ఓ సంప్రదాయిక సతిగా గుంభనంగానే ఉండిపోయింది…
విజయనిర్మల పట్ల మనసులో ఏ భావన ఉన్నా సరే, ద్వేషించలేదు, దూషించలేదు, బయటపడి రచ్చ కూడా చేయలేదు… ఆ విజయనిర్మల మరణానంతరం ఇక కృష్ణ, ఇందిరలు ఈ వృద్ధాప్యంలో ఒకరికొకరుగా మిగిలిపోయారు… ఈమధ్య ఆమె కూడా కృష్ణకు వీడ్కోలు చెప్పేసింది… విజయనిర్మల మరణంతో మొదలైన షాకులు కృష్ణ గుండెకు తగులూతూనే ఉన్నాయి… ఒంటరిని చేస్తూనే ఉన్నయ్… అంతటి గట్టి గుండె కూడా బలహీనమైపోయినట్టుంది… ఏ గుండె అయినా సరే, ఒంటరితనం ఓ శాపం… అది కృష్ణను డౌన్ చేసినట్టుంది…
ఎవరూ లేరని కాదు… ఏమీ లేదని కాదు… అతిరథ మహారథులైన కొడుకు, అల్లుడు, బంధుగణం… కానీ ఏదో లోపించింది… వయోభారం సరేసరి… మెల్లిమెల్లిగా ఇక ఆ గుండెకు హరాయించుకోవడం కష్టమైపోయినట్టుంది… గుండెలోకి అన్ని ఉద్వేగాల నెత్తురు సాఫీగా వచ్చిపోతేనే కదా బండి నడిచేది… అన్నీ మూసుకుపోతున్నయ్… అందుకేనా ఈ గుండెపోటు… కాంటినెంటల్ ఆస్పత్రిలో సీపీఆర్‌తో చక్కబడిందని వార్త… ఐనా విషమంగానే ఉందని ప్రకటన…
తెలుగు సినిమాకు నిజమైన హీరోవు నువ్వు… సాహసివి… ఆ గుండెకు ఇంకా చాలా ఆయుష్షు ఉంది… కోట్ల మంది అభిమానగణం ఉంది… ప్రార్థించే కోట్ల గొంతులు ఉన్నాయి… వదిలేసి వెళ్లిపోనిస్తాయా..? ఆ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు సూపర్ స్టార్… ఇంటికి వచ్చేసెయ్…!!
Share this Article