Yandamoori Veerendranath………. “నలుగురు పిల్లల్ని తీసుకుని బెలూన్ల షాప్‌కి వెళ్ళావనుకో. అందులో ఒక కుర్రాడు ఎర్రరంగు బెలూన్ కావాలన్నాడనుకో. పిల్లలందరూ ‘నాకూ అదే కావాలి… నాకూ అదే కావాలి’ అని గొడవ చేస్తారు. అది ఒకటే ఉందని తెలిసినా దాని గురించే ఎగబడతారు” అన్నారు స్వామీజీ ఒకరోజు స్టాన్లీతో.
స్టాన్లీ సైకాలజీ స్టూడెంటు. “చదువు కన్నా అనుభవం గొప్పదని నిరూపించారు స్వామీ. మీరు అనుభవoతో చెప్పినదే మా సబ్జెక్టులో కూడా చెపుతారు. దీనినే మేము సైకాలజీలో “మిమేటిక్ డిజైర్” అంటాము”.
“పిల్లలే కాదు. జనం కూడా అంతే. ఒకరికి నచ్చినదే మిగతా వారందరికీ బాగుందనిపిస్తుంది”. ఆయన ఈ ప్రసక్తి ఎందుకు తెచ్చారో స్టాన్లీకి అర్థం కాలేదు. కారణo లేకుండా తీసుకురారని తెలుసు.
Ads
అతడి అనుమానం కరెక్టే.
“ఎక్కువ మంది వెళ్ళే గుడికే కిక్కిరుసుకుని ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. పాపులారిటీ లేని గుళ్ళలో దేవుడు శక్తిమంతుడు కాదని అనుకుంటారు” నవ్వేరు స్వామి.
స్టాన్లీ శ్రద్ధగా వింటూండగా “మన అసంతృప్తులకి కారణం కూడా చాలావరకు ఇతరులే. కోరికలు లోపల్నుంచి రావు. బయట నుంచి వస్తాయి” అన్నారు.
“అర్థం కాలేదు స్వామీ”.
“ఇటువంటి డ్రెస్సు నాక్కూడా ఉంటే బావుణ్ణు’ అనిపించేది పక్కవారి డ్రెస్ చూసినప్పుడే కదా. మన ఇస్కాన్ కి జనం బాగా రావాలంటే అక్కడ ఆల్రేడి జన౦ ఉండాలి. సంకీర్తనం కోసం టికెట్లు అమ్మితే ఎవరూ రారు. మరోవైపు పార్కులో ఉచితంగా భజన చేస్తే షికారుకి వచ్చినవాళ్ళు సరదాగా చూసి వెళ్ళిపోతారు తప్ప ఆకర్షితులు అవరు. ఇవన్నీ కాదు. జనాన్ని మందిరానికి రప్పించటానికి ‘ఇంకా ఏదో’ చేయాలి” అన్నారాయన.
‘పోయిన చోటే వెతకాలి’ అనేది పాత నానుడి. విజయం సాధించాలనుకునే వాడికి ఇది సరిపోదు. ఒక చోట ఓడిపోయావంటే, నువ్వు గెలవటానికి సరిపోయే వనరులు అక్కడ లేవన్నమాట. మరొక చోట వెతకాలి. కొత్త వ్యాపారం చేయాలి. లేదా ఉన్న వ్యాపారంలోనే కొత్త మెలకువలు కనిపెట్టాలి. ఆవిధంగా చూస్తే ‘పోయిన చోటే వెతుక్కోవటం’ అనేది అన్నిసార్లూ సరయిన సామెత కాదు. స్వామీజీ అదే ఆలోచిస్తున్నారు.
ఒక రోజు వంటింట్లో కీర్తనానంద, బ్రహ్మానందలతో కలిసి ఆయన వంట చేస్తుoడగా, “మీరు వంట ఎలా నేర్చుకున్నారు స్వామీజీ?” అని అడిగాడు బ్రహ్మానంద.
“బాల్యంలోనే నా తల్లి చేస్తుండగా చూశాను. నా తల్లి ఎంతో ప్రేమగా వంట చేసేది. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. వంట చేయటంలో ప్రేమ ఏమిటని. కానీ ఇక్కడి వంటకి మా వంటకి చాలా తేడా ఉంది. మీరు ఫ్రిజ్ లోంచి చిన్న మాంసం ముక్క తీసి పెనం మీద పడేసి దాన్ని ఉప్పూ కారం చల్లి తింటారు. అక్కడ అలాక్కాదు. లవంగాలు, ధనియాలు నూరటం దగ్గర నుంచి ప్రతీదీ ఎంతో ప్రేమతో చేస్తారు.”
నిన్నటి నుంచి ఆయన ఏదో దీర్ఘమైన ఆలోచనలో ఉండటం శిష్యులు గమనించారు. వంట చేస్తూ హఠాత్తుగా “రేపటి నుంచీ ఇస్కాన్ కార్యక్రమాల్లో ఈ ప్రసాదం ఉచితంగా ఇవ్వటం అనేది ఒక అంశంగా ఉండాలి” అన్నారు స్వామీజీ.
శ్రోతలిద్దరూ ఉలిక్కిపడ్డారు. “అందరికీ ఉచితంగానా? అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?” హయగ్రీవ ఆశ్చర్యoగా అడిగాడు.
“ఇస్తుంటే వస్తుంటుంది. ప్రసాదం అంటే దయ. కృష్ణుడి ప్రసాదం అంటే కృష్ణుడి దయ” అన్నారు.
మరుసటి రోజు పెద్ద కుండలో చెక్కగరిటతో అన్నం ఉడికిస్తూ దాదాపు యాభైమందికి సరిపడా పరమాన్నం వండారు. తెల్లవారింది. మరో అయిదారుగురు ఆంగ్లేయులు వచ్చారు. అందరికీ గోధుమపిండి ఇచ్చి వత్తమన్నారు. ఎంత గట్టిగా పిసికితే చపాతీలు అంత మృదువుగా వస్తాయని చెప్పారు. కేవలం చేతి వేళ్ళతో పూరీలు గుండ్రంగా ఎలా చేయాలో వారికి చాలా ఓర్పుతో నేర్పారు. మొదట్లో గుండ్రంగా రాలేదు. తరువాత అలవాటైంది. తాము ఈ రకంగా వంట చేయగలమని శిష్యులు కలలో కూడా ఊహించలేదు. చాలా సంతృప్తి చెందారు. విజయం ఇచ్చే తృప్తి కన్నా గొప్పది ఇంకేం ఉంటుంది?
“అడిగినవారికి అడిగినంత వడ్డించండి. ఎంత తిన్నా కాదనవద్దు” అని సూచనలిచ్చారు.
స్వామి వండిన పరమాన్నానికి కీర్తనానంద “లవ్-ఫీస్ట్ (ప్రేమ ప్రసాదం)” అని పేరు పెట్టాడు. పేరు గమ్మత్తుగా ఉన్నా స్వామీజీ ఆ పేరునే ఖరారు చేశారు. గులాబ్ జామూన్లకి ‘ఇస్కాన్ బులెట్స్’ అని పేరు పెట్టారు. “మాయవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి ఇవే మన బులెట్స్” అన్నారు.
పక్కనున్న సమోసా చూపిస్తూ “ఇది?” అని అడిగింది ఎలిజిబత్. “డివోషన్-ప్యాక్” అన్నారు.
ఈ ప్రేమప్రసాదం ఇన్-స్టంట్ సక్సెస్ అయింది. ఆ నోటా ఈ నోటా పాకి వారంలోనే జనం గుంపులుగా రాసాగారు. పదిరకాల వంటకాలు తయారయ్యాయి. హల్వా, పప్పు, రెండు రకాల కూరలు, అన్నం, పూరీలు, మసాలా సమోసా, పరమాన్నం, యాపిల్ పచ్చడి..! ఒకేసారి ఇన్ని పదార్ధాలు వారికి కొత్త అనుభవం. జమీందారులు, రారాజులు మాత్రమే అన్నిరకాల పదార్ధాలు తినటం వారు సినిమాల్లో చూశారు.
మాదకద్రవ్యాలు (డ్రగ్స్) మానేసిన తొలి రోజులు గాబట్టి శిష్యులకి విపరీతమైన ఆకలి ఉండేది. అందువల్ల వారికి ఈ విందు విపరీతంగా నచ్చింది. డేవిడ్ తన గతం గురించి తలచుకుంటూ, “గంజాయి తీసుకునే రోజుల్లో అదో రకమైన మత్తులో ఉండేవాడిని. ఆకలి ఉండేది కాదు. బ్రతకటం కోసం కాస్త తినటం, మళ్ళీ గంజాయి. అంతే. కానీ ఇప్పుడు నిజమైన ఆకలoటే ఏమిటో తెలిసిoది. ఆహారం ఇంత బాగుంటుందా అనిపిస్తోంది. గతంలో మాదకద్రవ్యం సేవించినప్పుడు నిద్రపోయేవాళ్ళం కాదు. మత్తుగా జోగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒళ్ళెరుగని నిద్ర పడుతోంది.” అన్నాడు.
స్వామీజీ మాట్లాడలేదు కానీ చాలా సంతోషంగా అనిపించింది. ఈ పిల్లలకి నిజమైన ఆనందం అంటే ఏమిటో తెలిస్తే, అప్పటి వరకూ ఉన్న జీవితవిధానాన్ని వదిలేస్తారని ఆయన బలంగా నమ్మారు. సరిగ్గా ఆయన ఏమి అనుకున్నారో అదే జరుగుతోంది.
ఈ ప్రేమ ప్రసాదం విందుకి మొదట్లో హిప్పీలు, నిరుద్యోగులు మాత్రమే వచ్చేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ జనం కార్లలో కూడా రావటం ప్రారంభించారు. మొత్తం పదార్ధాలన్నీ క్షణాల్లో ఖాళీ చేసేవారు. కీర్తనానందకి కోపం వచ్చేది. “మరీ అలా తింటున్నారేమిటి” అని తిట్టుకునేవాడు. ఎంత చేసినా సరిపోయేది కాదు. చివరికి శిష్యులకి కూడా మిగిలేది కాదు. అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ తన శిష్యుల కోసం మళ్ళీ స్వయంగా చపాతీలు తయారు చేసేవారు.
ఈ ప్రేమప్రసాద కార్యక్రమo కేవలం సరదా కోసo, అతిథులని సంతోష పెట్టటం కోసం కాదు. ఇస్కాన్ ప్రచారం కోసం..! కృష్ణ చైతన్యం వైపు పదిమందిని ఆకర్షించటం కోసం..! వారిని భక్తులుగా మార్చటం కోసం…! ఈ విషయం స్టాన్లీ ఒక్కడికే అర్థమైంది.
“ఎ..క్కు..వ మంది భక్తులున్న గుడికే జనం ఎ..క్కు..వ వస్తారు” అని స్వామీజీ అన్నమాట అతడికి గుర్తుంది..!
ఇది కేవలం మార్కెటింగ్ టెక్నిక్ మాత్రమే కాదు. వితరణ కూడా. ఈవితరణ గురించి స్వామి శిష్యుడు క్రీస్ వర్డ్ ఈ విధంగా చెప్పాడు: “మాయాపూర్ లోని లోటస్ బిల్డింగ్ ప్రారంభోత్సవమప్పుడు, మేము పెద్ద విందు ఇచ్చాము. ఎంగిలి విస్తరాకులను భవనము వెనుక విసిరేశాము. ప్రభుపాదుల వారి గది మొదటి అంతస్తులో వుండేది.
గదిలో శిష్యులతో శ్రీల ప్రభుపాదులవారు కలిసి కూర్చున్నప్పుడు వెనుక నుండి కుక్కల అరుపులు వినిపించాయి. ప్రభుపాద లేచి అటువైపు చూసారు. ఎంగిలి విస్తరాకులలో ఆహార పదార్థాలను తినడానికి పేద పిల్లలు చేతుల్లో కర్రలతో కుక్కలతో భీకర౦గా పోరాడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసి ప్రభుపాద కన్నీళ్లతో చలించిపోయి, “హరే కృష్ణ ఆలయానికి పది మైళ్ల పరిధిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు, ” అని శిష్యులతో అన్నారు. అప్పుడే ‘ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్’ సంస్థకు నాంది పడింది.
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్ధేశించి ఒక వక్త ప్రసంగిస్తూ “నేను కాలేజీ రోజుల్లో డబ్బులు లేక వారంత౦లో ఇస్కాన్ వారి భోజనము తినడానికి 20 మైళ్ళు సైకిల్ పై వెళ్ళేవాడిని., వారమంతటికీ అది ఒక్కటే నా సంపూర్ణ భోజనము” అని అన్నారు. ఆ వక్త పేరు స్టీవ్ జాబ్స్. ఆపిల్ కంపెనీ సంస్థాపకులు………….. (పుస్తకం కోసం 8558899478/ or ఇస్కాన్ సంస్థలు).
Share this Article