బాగా గుర్తు… ఇప్పుడంటే బాగా తగ్గిపోయింది గానీ… సమీపంలో పాపులర్ దర్గా గనుక ఉంటే, ఆ పరిసరాల్లో తల్లిదండ్రులు ఆ దర్గాకు వెళ్లిరావడం, తమ పిల్లలకు ఆ దర్గా పేరు స్ఫురించేలా పేర్లు పెట్టుకోవడం సహజంగానే ఉండేది… సైదులు అనే పేరు బోలెడుమందికి ఉంది… అది హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఆ జాన్ పహాడ్ దర్గా మీద అక్కడి ప్రజల విశ్వాసం… భక్తి…
ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… తేలు మంత్రానికీ, పాము మంత్రానికీ మసీదు కావాలి… పిల్లల దడుపు జ్వరానికీ దర్గా కావాలి… అదొక నమ్మకం… దర్గాలను హిందూ సమాజం విడిగా చూసేది కాదు… అంతెందుకు కేసీయార్ రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిస్తూనే ఉంటాడు… మొన్నటికి మొన్న కవిత కూడా వెళ్లి వచ్చినట్టు వార్తలొచ్చాయి… ఇవి ఉదాహరణలు… వాళ్లే కాదు, బోలెడు మంది సెలబ్రిటీలు, నాయకులు, మామూలు ప్రజలు వెళ్తూనే ఉంటారు…
సిక్కుల స్వర్ణ దేవాలయం వెళ్లడం లేదా..? ఒక జైన ఆలయానికి వెళ్లడం లేదా..? వారి శ్రావణబెళగొళకు వెళ్లే భక్తులు ఎవరు..? బోధగయలో మహాబోధి గుడికి వెళ్లేది ఎవరు..? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పెద్ద గుట్టకు ఈరోజుకూ లక్షల మంది హిందూ భక్తులు వెళ్తూనే ఉంటారు కదా… ఇదీ అంతే…
Ads
ఇప్పుడు హఠాత్తుగా సింగర్ మంగ్లి మీద భారీగా ట్రోలింగ్ స్టార్టయింది… ఎందుకు అంటే..? ఆమె ఓ దర్గాకు వెళ్లింది… వరల్డ్ ఫేమస్ అమీన్ పీర్ దర్గా వెళ్లాననీ, ఆశీస్సులు పొందాననీ ఓ ఫేస్‌బుక్ పోస్టు పెట్టింది… తను సెలబ్రిటీ కాబట్టి 7300 మందికి పైగా లైకులు కొట్టారు… అంటే ఆమె దర్గా సందర్శనను పాజిటివ్‌గా తీసుకున్నట్టే కదా… కానీ కామెంట్స్‌లో, ఇతర పోస్టుల్లో మాత్రం ఆమె మీద విమర్శల బాణాలు విరివిగా పడుతున్నాయి… గతంలో కూడా ఏదో అంశం మీద ఆమె మీద సోషల్ దాడికి దిగారు… నిజానికి మంగ్లి వంటి హైందవ మత ప్రేమికులను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా…
‘‘వాళ్లు మన గుళ్లల్లోకి వస్తారా..? కనీసం సాయిబాబా గుళ్లకైనా వస్తారా..? తిరుపతిలో సంగీతం నేర్చుకున్నావ్, మంచి మాధుర్యం ఉంది నీ గొంతులో, ఈ పోకడలు దేనికి..?’’ ఇదీ ఓ విమర్శ… ఎక్కడిదాకో దేనికి..? అదే కడప జిల్లాలో ముస్లిం సమాజం వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తుంది… కావాలంటే నెట్‌లోనే బోలెడంత సమాచారం, ఫోటోలు ఉన్నాయి… వేములవాడ గుడిలో కోడెను కట్టే ముస్లింలనూ చూస్తాం… అది ఆయా ప్రాంతాల ప్రజల కోరికలు, నమ్మకాలు, భక్తికి సంబంధించింది…
ఒకతను రాస్తాడు… పెద్ద ఫ్రిజ్ కావాలని ఉందా అని…! ఆమె ఏదో ఆధ్యాత్మిక మార్గంలోకి దర్గాకు వెళ్తే… ఢిల్లీ ప్రియురాలి 35 ముక్కల హత్యకేసుతో లింక్ పెట్టడం దారుణం అనిపించింది… ఇందులో లవ్వు వ్యవహారం ఏముంది..? ఏదో ఓ పేద బంజారా కుటుంబం నుంచి ఎదిగింది… సంగీతం నేర్చుకుంది… హిందూ పండుగలకు ప్రత్యేకంగా వీడియోలు చేస్తుంది… సొంత ఊళ్లో ఆంజనేయుడికి ఓ గుడి కట్టించింది… చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ కూడా అందివచ్చింది… ఆమధ్య ఈషా యోగా కేంద్రంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో పాటలు పాడినట్టు గుర్తు… ఇప్పుడు వాటికి ఏ విలువా లేనట్టేనా..?
అసలు తెలుగు సినిమా పాటల ప్రపంచంలో ఓ బంజారా యువతి ఇలా క్లిక్ కావడమే అరుదు… ఎందుకు ఇలా ఆమె కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు..? తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త గొంతులు, ప్రతిభ కోసం అన్వేషించే పనిలో పడింది… జానపదం ప్లేవర్ ఉన్న గొంతులు కావాలి… మంగ్లి తనను తాను ప్రూవ్ చేసుకుంది… అసలు ఈ భారీ ట్రోలింగ్ వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటి..? ఎవరివి..?!
Share this Article