ఐనా మోడీ ముందు చిరంజీవి ఏపాటి నటుడు..?! అది జగమెరిగిన మెగాస్టార్…! చిరంజీవికి ఇఫి ద్వారా ‘ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఇస్తున్నాడు… కేంద్ర మంత్రితో ప్రకటన జారీచేయించాడు… వెంటనే విలక్షణనటుడు అని అభినందిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు తెలుగులో… మోడీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది కదా… మరి ఇందులో ఏముంది..?
ఎస్, చిరంజీవికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఓ పేజీ ఉంది… పద్మభూషణే ఇచ్చారు, ఈ ఇఫి అవార్డుదేముంది..? పైగా ఇవి 2013 నుంచి మాత్రమే ఇస్తున్నారు… వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలు, హేమమాలిని, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, విశ్వజిత్ ఛటర్జీ, ప్రసూన్ జోషిలకు కూడా ప్రకటించారు గతంలో… ఈ పురస్కారానికి విలువ లేదని కాదు… చిరంజీవి అర్హుడు కాదనీ కాదు… నిజానికి తన రేంజుకు ఇది ఉత్త జుజుబి…
ఐతే ఈ పురస్కారం ప్రకటించిన టైమ్ కాస్త ఇంట్రస్టింగు డిబేట్‌కు దారితీస్తోంది… చిరంజీవి ఎవరు..? ప్రస్తుతం ఏ పార్టీలో కలరు..? తను ప్రజారాజ్యం అని సొంతంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, తన మంత్రి పదవి, రాజ్యసభ సభ్యత్వం అయిపోయేదాకా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టుగా కనిపించి, నటించి… తరువాత ఇక కాంగ్రెస్ మొహం చూడలేదు… అది వట్టిపోయిన సినిమా ప్రాజెక్టు అని తనకూ అర్థమైపోయింది… వెంటనే సినిమాల్లోకి వెళ్లిపోయాడు… ఇదీ నేపథ్యం…
Ads
గత ఎన్నికల్లో తన తమ్ముడే జనసేన పేరిట నిలబడితే కిమ్మనలేదు… అటువైపు చూడలేదు… కానీ ఇప్పుడు…? నా తమ్ముడిని ఎప్పుడో ఉన్నత స్థానంలో చూస్తాం అంటున్నాడు… జనసేన కోసం పనిచేస్తాను అని నేరుగానే చెబుతున్నాడు… ఇప్పటికీ తనకంటూ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు… సో, బీజేపీకి రాజకీయ కోణంలో చిరంజీవిని చూస్తోంది… ఈ పురస్కారం వెనుకా అదే ఉంది…
బీజేపీది ఏపీకి సంబంధించి చాలా లాంగ్ టైమ్ స్ట్రాటజీ… విధేయంగా ఉన్న జగన్ కొన్నాళ్లు ఉంటే ఉండనీ… తన అవసరం కోసమే, భయంతోనే బీజేపీతో బాగుంటున్నాడని అందరికీ తెలుసు… దాంతో బీజేపీకి నష్టమూ లేదు, ఫాయిదా లేదు… కాకపోతే చంద్రబాబు మళ్లీ లేవకూడదు… తెలుగుదేశం దెబ్బతినాలి… తను పుంజుకోవాలి… అంటే తెలుగుదేశం, జనసేన కలవకూడదు… యాంటీ వైసీపీ వోటు బలపడకూడదు… సో, బీజేపీకి పవన్ కల్యాణ్ కావాలి…
అందుకే రోడ్ మ్యాపులు, బుజ్జగింపులు… ఆ చంద్రబాబు వైపు వెళ్లకు, నీకేం కావాలో నేను చూసుకుంటాను కదా అని మోడీ హామీలు… పవన్ క్యాంపు అంటే ఇప్పుడు చిరంజీవి కూడా… సో, ఓ బిస్కెట్… ఇఫి పురస్కారం… జనసేన క్యాంపును సంతృప్తిపరచడం… రాజ్యసభ సభ్యత్వమే ఇవ్వొచ్చు కదా… ఆ విజయేంద్రప్రసాద్‌కు ఇవ్వడం ద్వారా బీజేపీకి వచ్చే ఫాయిదా ఏముంది..? కానీ చిరంజీవికి మరీ అంత ప్రయారిటీ ఇవ్వరు, అలాగని వదిలేయరు… అంతేనా మోడీ భాయ్… మీరు అసలు సిసలు విలక్షణ నటులు…!! చెప్పలేం, నాగబాబుకు కూడా ఏదైనా కేంద్ర నామినేటెడ్ పదవి దక్కవచ్చు..!!
Share this Article