ఉల్టె, కళ్టి, నిల్టా, మళ్ట… ఏమిటిదంతా అనుకుంటున్నారా..? తెలుగు పాటను, భాషను ఖూనీ చేస్తున్న సిధ్ శ్రీరాం అనే గాయకుడు, స్వరజ్ఞానం ఏమీ లేకపోయినా వెనకేసుకొచ్చే అనంత శ్రీరాంపైన సీనియర్ జర్నలిస్టు ధాత్రి మధు పెట్టిన వీడియో ఆమధ్య వైరల్ అయ్యింది తెలుసు కదా… అందులో విషయం ఏమిటంటే… అంటే బదులు అల్టే, ఉంటే బదులు ఉల్టే, కంటి బదులు కళ్టి, మంట బదులు మళ్ట అని ఉచ్చరిస్తాడు… కర్ణకఠోరం… ఇనుపగుగ్గిళ్లు…
పాట హైపిచ్‌లో ఉన్నప్పుడు ఉంటే వంటి పదాల్లో ఉం పలకదట… ఒక హల్లును అర్జెంటుగా సపోర్టుగా తెచ్చుకుని పాడాల్సి ఉంటుందట… అనంత శ్రీరాముడే చెప్పాడు… పరమ దరిద్రమైన వివరణ… ఇండస్ట్రీలోని గాయకులు, రచయితలు ఈ వివాదాన్ని ఆసక్తిగా ఫాలో అయ్యారు గానీ, సిధ్ శ్రీరాంకు సపోర్టుగా ఉన్న భాషాజ్ఞానశూన్యులైన సంగీత దర్శకులకు కోపం రావచ్చునని భయపడి కిక్కుమనలేదు…
అసలు ఆ వివాదం ఏమిటో, పూర్వాపరాలేమిటో తెలియాలంటే… దిగువన ఉన్న ‘ముచ్చట’ లింక్ చదవండి…
Ads
సిధ్ శ్రీరామ్ ఉచ్ఛరణే కర్ణకఠోరం… తోడుగా అనంత శ్రీరాముడి మిడిమిడిసిపాట్లు…
ప్రస్తుతం తెలుగులో సిధ్ శ్రీరాం హైలీ పెయిడ్… ఐనా తెలుగు రాదు, పలకలేడు, పాడలేడు… ఎవరూ మాట్లాడకపోతేనేం… గంగాధర శాస్త్రి ధాటిగా ప్రశ్నించాడు… తను గతంలో ఈనాడు, సితార జర్నలిస్టు… ఘంటసాల పాటలు పాడీపాడీ.., శాస్త్రయ సంగీతం కూడా నేర్చుకుని, భగవద్గీతను రాగయుక్తంగా స్వరబద్ధం చేశాడు… విలువైన కంట్రిబ్యూషన్…
తను సిధ్ శ్రీరాం పాడే తీరును కడిగేశాడు… ఊరికే కాదు… నువ్వుంటే అనే పదాన్ని ఏదో వీడియో ఇంటర్వ్యూలో అక్కడకక్కడే అలవోకగా కాస్త ఎక్కువ పిచ్‌లోనే ఆలపించి, ఇందులో కష్టమేముంది అనడిగాడు… అదీ సమాధానం చెప్పాల్సిన పద్ధతి… అంతేకాదు, సంగీత దర్శకులకు అసలు భాష తెలిస్తే కదా… ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పేది… రచయితలకు కూడా పట్టడం లేదు అంటాడు గంగాధరుడు… కీరవాణి వంటి కొందరు తప్ప…
అంతేకాదు… అసలు చిరంజీవి తరువాత తరం హీరోల్లో భాషను ప్రేమించేవాళ్లు ఎవరున్నారు అనేది తన ప్రశ్న… సరైన ప్రశ్న… ఎవ్వడికీ సరైన ఉచ్ఛరణ రాదు… నిజానికి నటనలో కీలకమైంది ఆహార్యంతోపాటు వాచికం కూడా… అంటే భాష సరైన ఉచ్ఛారణ, భావవ్యక్తీకరణ… సంక్లిష్ట పదాల్ని కాదు కదా, వ్యవహారంలో ఉన్న పదాలను కూడా సరిగ్గా పలకలేరు…
గంగాధరుడు కడిగేశాడు కదా… మళ్లీ ఏ అనంత శ్రీరాముడో తెలిసీ తెలియనతనంతో సమర్థనకు రావల్సిందే తప్ప ఎవరి దగ్గరా సమాధానాలు లేవు… అవునూ, ఈమాత్రం గాత్రానికి సిధ్ శ్రీరాం, లక్షల పారితోషికాలు దేనికి, ట్రాక్ పాడే ఏ అనామకుడితోనే పాడించి, కంప్యూటర్లలో కొన్ని యాప్స్ ద్వారా దోషాల్ని సరిచేయిస్తే సరిపోదా ఏం..? నాలుగు రోజులు పోతే ఆ అనామకుడే నామకుడు కావచ్చు, ఏమో, ఎవరూ చూడొచ్చారు…!? (ఈ వీడియో ఒకటో నిమిషం నుంచి మూడున్నరో నిమిషం దాకా చూస్తే, ఈ పంచాయితీ మీదే…)
‘హైపిచ్‌లో సున్నాలు పలకడం కష్టమే కావొచ్చు కొన్నిసార్లు… కానీ అవసరమైతే పదం మార్చుకోవచ్చు… అయితే పదం పదంలా పలకకపోవడం అనేది ముఖ్య సంగీత దర్శకులు ఓ ట్రెండ్‌లా తీసుకొస్తున్నారు… పరభాషా గాయకుల వల్ల వచ్చే సమస్యలు ఇవి… పాడించేవాడికి భాష తెలిసి ఉండాలి… రచయితలు కూడా చెప్పాలి… లేకపోతే గాయకుడు తను పాడిందే కరెక్టని అనుకుంటాడు కదా…’’ అని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ విశ్లేషిస్తోంది…
Share this Article