తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది… కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి తొలిగి రాతిరిని…
సిరివెన్నెల కలం, వాణిజయరాం గళం… స్వాతికిరణంలోని ఈ పాట ఆమె కీర్తికిరీటాల్లో జస్ట్, చిన్నది… ఆ సినిమాలో 11 పాటలు… అన్నీ సంగీత ప్రధానమే… అసలు సినిమా కథే సంగీతానికి సంబంధించింది… భక్తి, సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణిజయరాం… కొందరికి కలుక్కుమనవచ్చుగాక… కొన్ని పాటలను సుశీల, జానకిలను గాకుండా వాణిజయరాంనే పిలిచి పాడించుకున్నారు… ప్రత్యేకించి తెలుగులో విశ్వనాథ్… స్వాతికిరణంలోని 11 పాటల్లో ఎనిమిది ఆమే పాడింది… మిగతావి మేల్ సాంగ్స్, బాలు పాడాడు…
ఆ సినిమాలో శివానీ, భవానీ పాట ఈరోజుకూ అల్టిమేట్… విశ్వనాథ్ సినిమాల్లో ఇదొక్కటే కాదు, స్వరప్రధానంగా సాగే శృతిలయలు, శంకరాభరణం… అన్నిరకాల పాటలు పాడినా సరే ఆమెకు పేరు తీసుకొచ్చింది శాస్త్రీయ సంగీతం వాసనలున్న ట్యూన్లే… 30న ఆమె జన్మదినం… సెర్చింగులో ఆమె వివరాలు చదివేకొద్దీ, నిజానికి ఈమెకు దక్కాల్సినంత గుర్తింపు నిజంగా దక్కిందా అనే డౌటూ వచ్చింది… రెండు కాదు, మూడు కాదు, 19 భాషల్లో పాటలు పాడింది ఆమె… హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు అనబడే పాన్ ఇండియా భాషలతోసహా గుజరాతీ, మరాఠీ, మార్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిషు, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు… ట్రెమండస్ రికార్డు…
Ads
20 వేల సినిమా పాటలు, వేలాది ప్రైవేటు భక్తి ఆల్బమ్స్… ఎనిమిదో ఏట కచేరీ మొదలుపెట్టిన ఆమెకు ఇప్పుడు 76 ఏళ్లు… 3 జాతీయ అవార్డులు… సంపూర్ణమైన, సార్థకమైన జీవితం… ఇంకేం కావాలి ఒక గాయనికి..? నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా అని చిలిపిగా, రొమాంటిక్‌గా పలికిన గొంతే విధి చేయు వింతలన్నీ అని వైరాగ్యభావనల్లో ముంచెత్తుతుంది… దొరకునా ఇటువంటి సేవ అంటూ ఆ స్వరేశ్వరుడిని అర్చిస్తూనే, అలలు కలలు ఎగిసి ఎగిసి అలసి సొలసి పోయే అని అలసటకూ గురవుతుంది…
అన్ని వేదికల మీద ప్రముఖులంతా జానకి, సుశీల ప్రస్తావనకు తీసుకొస్తూనే ఉంటారు… చప్పట్లు కొడతారు, కొట్టిస్తారు… వాళ్లు తెలుగు స్వరకీర్తులే… సందేహం లేదు… మరుపురాని పాటలెన్నో పాడిన గొంతులే… కానీ తెలుగువాళ్లు నిజంగా జానకి, సుశీల మీద చూపిన అభిమానాన్ని వాణిజయరాం మీద చూపించారా..? ఆ ఇద్దరూ మన తెలుగువాళ్లు, వాణిజయరాం తమిళియన్ అనే భావనా..? (స్థానికాభిమానమా..? ఒకరిది రేపల్లె, మరొకరిది విజయనగరం) కావచ్చు… కావచ్చు…!! అదుగో టీవీలో మరో పాట ప్రారంభమైంది… సీతాకోకచిలుకలోని సాగరసంగమమే పాట పరిమళం వ్యాపిస్తోంది… ఆహా… చెవుల్లోకి అమృతధార… నిజంగా ఆమె గంధర్వగాయని..!! 30న ఆమె జన్మదినం..! సదరు టీవీవాడు రెండురోజుల ముందే స్పెషల్ స్టోరీ వేసేశాడు… అదీ కథ…
Share this Article