థాంక్స్ టు కేసీయార్… తనకు అలవాటైన రీతిలోనే పక్కా అప్రజాస్వామికంగా వ్యవహరించి షర్మిలకు మంచి కవరేజీ తెచ్చిపెట్టాడు… ఫాఫం, ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నా, ఇన్నాళ్లూ మీడియా లైట్ తీసుకుంది… ఈరోజు, నిన్న దాదాపు ప్రతి పత్రిక, నిన్నామొన్న ప్రతి టీవీ బ్రహ్మాండమైన కవరేజీ ఇచ్చాయి… ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లే ఆమె మొండిగా పోలీసుల వెంట రావడానికి తిరస్కరిస్తేనే, కారు టోయింగుతో తీసుకెళ్లారు, అందులో తప్పుపట్టేదేమీ లేదు… అయితే ఆమె మీద పెట్టిన కేసులు గట్రా ఓ నాన్సెన్స్…
అంతేకాదు, పాత వరంగల్ జిల్లాలో ఆమె కాన్వాయ్ మీద జరిగిన దాడి మాత్రం ఖచ్చితంగా ఓ దుష్ట రాజకీయ సంస్కృతి… సంచుల్లో పెట్రోల్ పాకెట్లు, వాహనాల్లో రాళ్లు, కట్టెలు… వాహనాలకు నిప్పు,… పైగా సారీ చెప్పాలని డెడ్‌లైన్ పెట్టినా పట్టించుకోలేదనే ఓ పిచ్చి సమర్థన… కేసీయార్‌కు ఇవన్నీ తెలియకుండానే జరిగాయా..? ఎవరూ తెలంగాణలో రాజకీయ విమర్శలు చేయకూడదా..?
(కేసీయార్ ఢిల్లీలో రైతుదీక్ష చేసినప్పుడు మోడీ మీద విమర్శలు చేశాడు, కానీ అక్కడ బీజేపీ గానీ, పోలీసులు గానీ ఎలా ప్రవర్తించారు..? ఈ పెట్రోల్ పాకెట్లు, రాళ్లురప్పలు, దాడులు, కేసులు లేవు కదా… రేప్పొద్దున బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి మీటింగులు పెడితే, అక్కడి పార్టీలను తిడితే వాళ్లూ ఇలాగే వ్యవహరించాలా..? ఈ దాడులేమిటి..? ఓ మహిళ రాజకీయ కార్యాచరణపై ఈ జులుం ఏమిటి..?)
Ads
ఇప్పుడంటే కోదండరాం ప్రభావం ఏమీ లేదు గానీ, అప్పట్లో తనకూ ఇవే చేదు అనుభవాలు కదా… బీజేపీ యాత్రలకూ ఇవే అడ్డగింతలు కదా… గొప్ప ప్రజాస్వామిక వాతావరణంలే..! అయితే షర్మిల వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నది ఎవరి కోసం..? ఇదీ అసలు ప్రశ్న… అమ్మా, తల్లీ… ఎలాగూ తెలంగాణను వదిలేసి వెళ్లారు కదా… మళ్లీ ఎందుకు మాకీ తలనొప్పి..? ఎవరి వోట్లు చీల్చడానికి..? ఎవరిని ఉద్దరించడానికి..? నువ్వు చెప్పే రాజన్నరాజ్యం నీకు గొప్ప కావచ్చుగాక, ప్రతి తెలంగాణవాదికి నచ్చాలని ఏముంది..? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల రాజ్యం ఉంటుంది, వాళ్ల పాలన విధానాలు ఉంటాయి… ఇప్పుడు నడిచేది చంద్రన్నరాజ్యం…
అందుకే ఎక్కడా కనీస స్పందన లేదు… దాంతో విమర్శల జోరు పెంచావా..? వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నావా..? నువ్వు ఎలాగూ జగన్ విడిచిన బాణమే… నా పంథా రాజకీయాలు కాదనీ, పదవులపై ఆశల్లేవనీ పలుసార్లు చెప్పావు… గతంలో కూడా… మరి అనువు కానిచోట ఈ రాజకీయాల మర్మం ఏమిటి..? నేను తెలంగాణ ఆడబిడ్డనే అని చెప్పుకోవడం కాదు, ఇదేమీ సాంకేతిక సమస్య కాదు… తెలంగాణతనం లేని నీకు తెలంగాణ ప్లేగ్రౌండ్ కాదు… అవసరం లేదు… అందుకే ఇన్నివేల కిలోమీటర్లు నడిచినా… ఖర్చులు తడిసిమోపెడవుతున్నయ్ గానీ కనీస ఫాయిదా రావడం లేదు… జనం పట్టించుకోవడం లేదు…
ప్రవీణ్‌కుమార్ కథ వేరు… తనది ఎస్టాబ్లిష్డ్ పార్టీ… తనది తెలంగాణ… మళ్లీ చంద్రబాబు వస్తాడట… మళ్లీ పవన్ కల్యాణ్ వస్తాడట… ఒకాయన తెలంగాణ ఇస్తే 11 రోజులు నిద్రాహారాలు మాని శోకించాడట… ఇప్పటికీ తెలంగాణతనాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాడు, వీళ్లకు ఎన్టీయార్ వచ్చేదాకా వరిబియ్యం తెలియదు అంటూ… చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకత తెలంగాణ మొత్తానికి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… కేసీయార్‌కూ సెటిలర్లే కావాలి… పైగా ఇప్పుడు అది జాతీయ పార్టీ, ఏపీలో కూడా పొలిటికల్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది… బీజేపీకి సెటిలర్ల వోట్లే కావాలి… కాంగ్రెస్ కథ వేరు… దానికంటూ ఓ దశ లేదు, దిశ లేదు… తెలంగాణలో పొలిటికల్ ఫాయిదా కావాలంటే పార్టీలన్నింటికీ ఆంధ్రుడే కావాలి… మరిప్పుడు ఓ స్వచ్ఛమైన తెలంగాణవాది ఏం ఎంచుకోవాలి..? చిక్కు ప్రశ్నే..!!
Share this Article