ఆ ప్రముఖ చానెల్, ఆ ప్రముఖ పత్రికలాగే మనమూ కాస్త గాలి పోగేసి ఓ కథ అల్లుకుందాం… ‘‘వైఎస్ షర్మిలపై పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో దాడి జరిగింది… వాహనాలకు నిప్పు పెట్టారు… కారుతోసహా ఆమెను టోయింగ్ వెహికిల్ పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకుపోయింది… ఇది ఒక వార్త… జాతీయ భద్రత సలహాదారు రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు… కీలక వ్యక్తులతో ఏదో మాట్లాడాడు, వెంటనే వెళ్లిపోయాడు… రాష్ట్ర పోలీసులకు సైతం సమాచారం లేదు… ఇది మరో వార్త…
ఢిల్లీ మద్యం కేసులో కవిత పేరు బయటికి వచ్చింది అధికారికంగా… ఓ ప్రధాన నిందితుడిని రిమాండ్ చేస్తూ ఆ రిపోర్టులో ఆమె పేరును కూడా పేర్కొన్నారు పోలీసులు… ఇది ఇంకో వార్త… గుజరాత్ ఫలితాలు వచ్చాక ఆమెను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని పొలిటికల్ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది… ఇదొక వార్త… ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయం బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు పూర్తిగా తెలుసు… పక్కా ఆధారాలున్నయ్, కేసు సీబీఐకి ఇవ్వాల్సిన పనేమీలేదని కోర్టు ఎదుట తెలంగాణ పోలీసుల ఆరోపణ… ఇదో వార్త… నిజానికి ఒకదానితో ఒకటి పొంతన లేదు…
జాగ్రత్తగా క్రోడీకరిస్తే… కేసీయార్ బాగా ప్లాన్ చేసిన ఆడియోలు, వీడియోలు ఏదో గాయిగత్తర క్రియేట్ చేస్తుందనుకుంటే అవేమో తుస్సుమన్నయ్… కానీ ఢిల్లీ నేతలను బజారుకు లాగుతున్న కేసీయార్ టెంపర్‌మెంట్‌తో బీజేపీ హైకమాండ్‌కు సెగ బాగానే తగిలింది… అందుకే ఇన్నాళ్లూ మద్యం కేసులో కవిత పేరును అధికారికంగా ఇరికించని బీజేపీ వేరే ఆలోచనలో పడింది… షర్మిల మీద దాడి తీవ్రతను గమనించి, కవితను గనుక అరెస్టు చేస్తే టీఆర్ఎస్ కేడర్ ఏ ఎక్స్‌టెంటుకు వెళ్లి, భారీగా అల్లర్లకు పాల్పడుతుందనే అంచనాలో పడింది…
Ads
ఎలాగూ పోలీసులు టీఆర్ఎస్ చేతుల్లో ఉన్నవాళ్లే కాబట్టి బీజేపీ నేతలకు, కేంద్ర ఆస్తులకు రక్షణ ఎలా అనే చింతనలో పడింది బీజేపీ… అజిత్ దోవల్ రాకలో ఆంతర్యమిదే… అంతకుముందు వేల పేజీల మద్యం స్కామ్ చార్జిషీటులో కవిత పేరు లేదు… కానీ అజిత్ దోవల్ వచ్చిపోయాక, అరోరా అనే నిందితుడిని రిమాండ్ చేశారు, అందులో కవిత పేరునూ పేర్కొన్నారు… గుజరాత్ ఫలితాలు ఎనిమిదో తేదీన వెలువడనున్నాయి… ఆ తరువాతే కవితను అరెస్టు చేసే అవకాశం ఉంది… ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసును సీబీఐకి అప్పగించకపోతే ఏం చేయాలనే విషయంలో కేంద్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు… రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంట్రీకి ఆమధ్య గేట్లు మూసేసింది కదా…’’
…… ఇదండీ వండబడిన వార్త… అయితే ఇక్కడ ఓ చిన్న విషయం… రాజకీయాల్లో ఇది ఇలాగే జరగాలని ఏమీ ఉండదు… ఇలా అస్సలు జరగదు అనడానికీ వీలుండదు… కొన్ని పరిణామాలు ఇంకొన్ని అనూహ్య పరిణామాల వైపు తోసుకుపోతాయి… కేసీయార్ వర్సెస్ బీజేపీ యుద్ధంలో నిజంగా ఇదే జరుగుతున్నదేమో… జరగనుందేమో… చెప్పలేం… కవితను గనుక అరెస్టు చేస్తే అల్లర్ల మాటేమిటో గానీ టీఆర్ఎస్ పట్ల జనంలో సానుభూతి పెరుగుతుందా, ఇప్పుడు కనిపిస్తున్న కేసీయార్ వ్యతిరేకత తగ్గిపోతుందా అనే చర్చ కూడా ఢిల్లీలో సాగుతుంది…
చివరగా మరోమాట… ఇన్నాళ్లూ అధికారికంగా ఏమీ లేదు కాబట్టి మద్యం స్కాంలో కవిత పేరును ఎవరూ రాయలేదు… ఎప్పుడైతే రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు కనిపించిందో ఇక టీవీలు, సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఆమె పేరును పదే పదే ప్రస్తావిస్తూ నిన్నంతా వార్తల జోరు పెంచాయి… తీరా తెల్లారి చూస్తే సాక్షి అసలు కవిత పేరు లేకుండా ఓ అనామకపు హెడింగ్ పెట్టేసి, మూడు ముక్కల్లో వార్తను మమ అనిపించింది… అది ఇప్పుడు పక్కాగా ‘‘నమస్తే సాక్షి’’… అంతగా ఎందుకు సాగిలపడుతోంది కేసీయార్ ఎదుట..? ఈనాడు కూడా దాదాపు అంతే… కాకపోతే వార్త వివరంగా ఉంది… ఇక మిగిలింది ఆంధ్రజ్యోతి… రాష్ట్రంలో మూడ్‌కు తగినట్టు స్ట్రెయిట్‌గా ‘కవిత పాత్ర’ అని హెడింగ్ పెట్టేసి, తనకు అలవాటైన పద్ధతిలో హడావుడి చేసింది..!!
Share this Article