రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ వ్యాఖ్యానాల జోలికి పోకూడదు… గతంలో ఏ పార్టీ అయినా సరే, తన రాజకీయ భావజాలం ఏదయినా సరే, ఒకసారి ఆ పోస్టుల్లో చేరాక నిష్పాక్షిక, వివాదరహిత ధోరణిలో నడుచుకోవాలని అంటుంటారు కదా… ప్రత్యేకించి ఏవైనా మీటింగుల్లో, పర్యటనల్లో మాట్లాడేటప్పుడు తమ ఆఫీసులు ప్రిపేర్ చేసిన స్క్రిప్టునే ఫాలో కావాలని కూడా అంటారు… మన వెంకయ్యనాయుడు కూడా బోలెడుసార్లు తన అసహాయత వ్యక్తీకరించాడు కదా, తాను ఉపరాష్ట్రపతి హోదాలో ఏదీ స్వేచ్ఛగా మాట్లాడలేని స్థితిలో ఉన్నానంటూ..! కానీ…
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్… అవన్నీ నాకు జాన్తానై అంటున్నాడు… స్వేచ్ఛగా మాట్లాడటమే కాదు, ఏకంగా సుప్రీంకోర్టునే గోకాడు… సాధారణంగా సుప్రీం జోలికి వెళ్లడానికి శాసనవ్యవస్థలో ఉన్న కీలకవ్యక్తులు కూడా జంకుతుంటారు… కానీ ధన్‌కర్ ధోరణి వేరు కదా… మన న్యాయవ్యవస్థకు సంబంధించిన ఓ కీలకాంశంపై సుప్రీంకోర్టు ధోరణిని తప్పుపట్టాడు… తన హోదాలో చేసిన వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఉంది, దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… ‘‘ఎవరూ మాట్లాడకపోతే ఎలా’’ అన్నట్టుగా స్వేచ్ఛగా కామెంట్స్ పాస్ చేశాడు…
జడ్జిల బదిలీలు, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ స్వతంత్రతను అనుభవిస్తోంది… కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఉన్న పాత్ర నామమాత్రం… కొలీజియం పంపిన సిఫారసులను కేంద్రం అనివార్యంగా ఆమోదించాల్సి వస్తోంది… నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ, పార్లమెంటు ప్రయత్నాల్ని సుప్రీం కోర్టు అడ్డంగా తోసిపుచ్చింది… ప్రధాని సహా ఎవరూ పెద్దగా స్పందించలేదు… ఇటీవల కొలీజియం పంపిన లిస్టు కేంద్రం వద్ద పెండింగులో ఉంది, దానిపైనా వివాదం నడుస్తోంది… ఈ స్థితిలో ఉపరాష్ట్రపతి స్పందన విశేషమే… అదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సమక్షంలో…
Ads
ఈ దేశంలో సుప్రీం అథారిటీ ఎవరిది అనే ఓ కీలకప్రశ్నను ధన్‌కర్ సంధించాడు… పార్లమెంటు ఆమోదించే చట్టాల్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టేసిన ఘటనలు ప్రపంచంలో ఎక్కడా లేవనీ, జుడిషియల్ కమిషన్ ఏర్పాటును అడ్డుకున్న తీరుపై మన పార్లమెంటు కూడా ఏమీ స్పందించకపోవడం కూడా ఓ సమస్యేననీ ధన్‌కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు… ఒక చట్టంలోని అంశాలను రాజ్యాంగ స్పూర్తి కోణంలో సుప్రీంకోర్టు పరిశీలించవచ్చు గానీ చట్టాన్నే రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించాడు… అంతేకాదు, సంబంధిత సర్కిళ్లలో ఈ చర్చ సాగాలనీ కోరాడు…
స్పీకర్, ప్రధాని, న్యాయశాఖ మంత్రి నుంచో సుప్రీం నిర్ణయంపై స్పందన ఆశించొచ్చు… కానీ రాజ్యాంగ వ్యవస్థల నడుమ సామరస్యాన్ని పెంచుతూ, ఏమైనా దూరం పెరిగితే తగ్గించే ప్రయత్నం చేయాల్సిన ఉపరాష్ట్రపతి (తను రాజ్యసభకు ఛైర్మన్ కూడా) తనే ఓ రాజ్యాంగ వ్యవస్థ, అదీ న్యాయవ్యవస్థ అపెక్స్ బాడీ నిర్ణయాల్ని వ్యతిరేకించే ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా విశేషమే… జుడిషియల్ కమిషన్ ఏర్పాటు సరైందేనా..? కొలీజియం ఉంటే తప్పేమిటి వంటి చర్చ జోలికి నేను ఇక్కడ వెళ్లడం లేదు… ఎటొచ్చీ ధన్‌కర్ పోకడపై మాత్రమే ఓ పరిశీలన… నిజంగానే దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఈ జుడిషియల్ కమిషన్- కొలీజియం వివాదంపై ఒక్క మాటా మాట్లాడటం లేదు…
గతంలో రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా, కొన్నాళ్లు రాజస్థాన్ బార్ అసోసియేన్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ధన్‌కర్ మొన్నమొన్నటివరకూ బెంగాల్ గవర్నర్… మమతతో ఉప్పునిప్పు తరహాలో ఉండేది ఎప్పుడూ… జాట్ సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఉన్నవాడే… సో, తన తాజా వ్యాఖ్యలు అజ్ఞానమనో, అనాలోచితమనో, అపరిపక్వ ధోరణి అనో అనలేరు ఎవ్వరూ…
కేంద్రం, బీజేపీ హైకమాండ్ ముఖ్యులకు తెలియకుండా ఆయన వివాదాన్ని కెలుకుతున్నాడనీ అనుకోలేం… అలాగని ఉపరాష్ట్రపతికి ఏం సంబంధం అనీ అడగలేరు ఎవ్వరూ… తను చట్టాలను చేసే రాజ్యసభకు ఛైర్మన్ కూడా కాబట్టి… ఇంట్రస్టింగు…!! నిజంగా సుప్రీంకోర్టు తన ధోరణికే కట్టుబడే పక్షంలో పార్లమెంటు ఏం చేయాలి, చేయవచ్చు, కేంద్రం ధోరణి ఎలా ఉండాలనేది ఇంట్రస్టింగు ప్రశ్నే… నిజానికి జరగాల్సినంత చర్చ ఈ విషయంపై జరుగుతోందా..?!
Share this Article