కొన్ని మెచ్చుకోవాలి… సమాచారం కోసం… అభినందన కోసం… తెలంగాణ పాస్‌పోర్ట్ సేవలు ఎంత సరళీకృతం అయ్యాయంటే, ఓ అయిదూపదేళ్ల క్రితంతో పోలిస్తే అసలు పోల్చలేనంత మార్పు… సూటిగా విషయంలోకి వెళ్దాం… ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసుల బ్లెండ్ సొసైటీకి ఎలా ఉపయోగం..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎలా ఉండాలి..? అనే అంశాలకు ఇదొక్క మంచి ఉదాహరణ…
గతం ఓసారి నెమరేసుకుందాం… పాస్‌పోర్టు సంపాదించడం ఓ గగనం… సవాలక్ష కొర్రీలు, సర్టిఫికెట్లు, అర్థం కాని దరఖాస్తు వ్యవహారం… దళారులు, వేలకువేల రూపాయల ఖర్చు… వాటిల్లోనూ మోసాలు… చివరకు పాస్‌పోర్ట్ ఇంటికి తీసుకొచ్చే పోస్ట్‌మ్యాన్, ఎంక్వయిరీ చేసిన పోలీసాయన కూడా ఈ కథన రచయితను 1000 చొప్పున డబ్బు డిమాండ్ చేశారు పాస్‌పోర్ట్ కోసం..! (అదీ సీఎంవో సూచనతో నేరుగా పాస్‌పోర్ట్ ఆఫీసర్ ద్వారా తిప్పలు పడిన తత్కాల్ పాస్‌పోర్టుకు… ఇక సాధారణ పాస్‌పోర్టు సంగతి..? ఊహించుకొండి…)
విషయంలోకి వెళ్తే… ఇప్పుడేమిటో చెబుతాను… స్వీయానుభవమే… నమ్మొచ్చు… నా పాస్‌పోర్టు వేలిడిటీ ఎక్స్‌పైర్ అయిపోయింది… రెన్యువల్ చేయించుకోవచ్చు, కానీ మూడేళ్లు దాటితే పోలీస్ ఎంక్వయిరీ తప్పనిసరి… మా అమ్మాయి, భార్య పాస్‌పోర్టుల వేలిడిటీ దగ్గరపడింది… రెన్యువల్ చేయించాలి… మీ ఇంట్లో చదువుకున్నవాళ్లు ఉంటే పర్లేదు ఇప్పుడు… ఆన్‌లైన్‌లో చాలా సింప్లిఫై చేశారు దరఖాస్తును… కాకపోతే కన్‌ఫ్యూజ్ కాకుండా తాపీగా చదువుతూ… వివరాలు నింపుతూ… ఆన్‌లైన్‌లోనే తత్కాల్ అయితే 3 వేలు, నార్మల్ అయితే 1500 కట్టేసి, స్లాట్ అడగడమే…
Ads
ప్రస్తుతం రెండు మూడు నెలలు పడుతోంది స్లాట్ బుకింగుకు… అంటే పాస్‌పోర్టుల మంజూరీ, నవీకరణ, రీఇష్యూ గురించి ఎంతగా డిమాండ్ ఉందో అర్థం చేసుకోవాలి… ఆన్‌లైన్‌లో మీకు స్లాట్ వచ్చిందంటే చాలు… పాస్‌పోర్ట్ వచ్చినట్టే… అతిశయోక్తి కాదు… నిజం… భారతీయ విదేశాంగశాఖ అంతగా చాలా సరళీకృతం చేసింది… హైదరాబాద్‌లో సికింద్రాబాద్‌లోని మెయిన్ పాస్‌పోర్ట్ ఆఫీసే గాకుండా టోలిచౌకి, బేగంపేట, అమీర్‌పేట పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నయ్…
బాగా గుర్తుంచుకొండి… మీరు చూపించాల్సిన సర్టిఫికెట్లు మరీ క్లిష్టమైనవేమీ కాదు… అన్నింటికన్నా ప్రయారిటీ ఇప్పుడు ఆధార్ కార్డు… ఐటెంటిటీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ అదే… దానికి అదనంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధారం చూపించాలి… దానికి బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ మెమో ఆధారం… రెన్యువల్, రీఇష్యూ కోసం అవి కూడా అడగరు… ఆధార్ కార్డు ఉండి, సేమ్ అడ్రెసులో ఉంటుంటే దాన్ని ధ్రువీకరించుకుంటారు, అంతే… తత్కాల్, ఫ్రెష్, ఎక్స్‌పైర్డ్ పాస్‌పోర్టుల విషయంలో మాత్రమే పోలీస్ రిపోర్టు అడుగుతారు… అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్ అయినా బెటరే… కాకపోతే అది మీ పేరిట ఉండాలి…
అమీర్‌పేటకు వెళ్లేవాళ్లు మెట్రోలో వెళ్తే బెటర్… మెట్రో స్టేషన్ నుంచి 300 మీటర్లు… కారు అయితే పార్కింగ్ సమస్య… గతంలోలాగా పోలీసు రిపోర్టులు, డబ్బులు గట్రా ఏమీ లేవు… ఆఫీసు నుంచే మీకు మెసేజ్… ఫలానా ఆఫీసర్ మీ దగ్గరకు ఎంక్వయిరీకి వస్తారు, ఫోన్ నంబర్ ఇదీ అని చెబుతూ… కాస్త ఏమైనా ఇస్తే మీ ఇష్టం, లేదంటే నో డిమాండ్… ఇక స్లాట్ రోజున ఏ టైమ్‌కు రిపోర్ట్ చేయాలో మెసేజులు వస్తాయి… ఉదాహరణకు అమీర్‌పేట… ఆదిత్య ట్రేడ్ సెంటర్… సమయానికి వెళ్తే నో ప్రాబ్లం, లేదంటే అక్కడ వెయిటింగ్ కూడా కాస్త కష్టమే… లోపలికి వెళ్లాక ఏ సెక్షన్ చాలా కీలకం…
వెళ్లేటప్పుడే.,.. మీరు పరిశీలన కోసం తీసుకెళ్లే సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు రెండేసి తీసుకుపోవాలి… ఒకదానిపై మీ సంతకం, ఒకటి ప్లెయిన్… ఒరిజినల్స్ సరేసరి… వీలైనంతవరకూ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఆధారాలు తప్పనిసరి… అనుమానాలు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఓటర్ ఐడీ కార్డు గానీ, పాన్ కార్డ్ గానీ అడగొచ్చు, వెంట ఉంచుకుంటే బెటర్… వేలాది మంది పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్తున్నారు… ముందస్తు సమాచారం లేక, బోలెడు సందేహాలతో సతమతమవుతున్నారు కాబట్టి ఇంత వివరంగా రాయాల్సి వస్తోంది…
సర్టిఫికెట్లు పరిశీలిస్తారు, స్కాన్ చేసుకుంటారు… డౌట్స్ ఉంటే అడుగుతారు… ఫ్రెష్ ఫోటో తీస్తారు… అక్కడే పెయిడ్ జిరాక్స్ సెంటర్ కూడా ఉంది… ఇక్కడే మెచ్చుకునే అంశం… అక్కడున్న ప్రతి ఒక్కరూ టీసీఎస్ ఉద్యోగులు… ప్రభుత్వ సర్వీసు చేసీ చేసీ కొంత ఆ నెగెటివిటీ అంటుకుంది కానీ స్థూలంగా పీపుల్స్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది… తరువాత బీ సెక్షన్, మరోసారి పరిశీలన… ఆ తరువాత సీ సెక్షన్, టోకెన్ నంబర్‌ను బట్టి పిలుస్తారు… అక్కడ ఉండేది పాస్‌పోర్ట్ ఆఫీసు సిబ్బంది… వాళ్ళదే అంతిమ పరిశీలన, క్లియరెన్స్… నాకైతే మొత్తం ప్రాసెస్ గంటన్నరలో అయిపోయింది… మా శ్రీమతికి అరగంట…
ఒక్కసారి గ్రాంటెడ్ అని మెసేజు వచ్చిందంటే ఇక క్లియర్… పోలీసాయన కూడా ఫోన్ చేశాడు… ఫలానా టైమ్‌కు వస్తున్నాడు అన్నాడు… ఫోటో అతికించాడు, వేలిముద్ర, సంతకం తీసుకున్నాడు, పాస్‌పోర్టు ఆఫీసులో క్లియర్ చేసిన దరఖాస్తు ఫారం ఇమ్మన్నాడు, అరె, మరిచిపోయాను అంటే వాట్సప్‌లో పంపించు అన్నాడు… అయిపోయింది… ఆ తరువాత మూడునాలుగు రోజులకు పాస్‌పోర్టు చేతికొచ్చింది… రెన్యువల్ మాత్రమే అయితే రెండేరోజుల్లో కొత్త పాస్‌పోర్టు స్పీడ్ పోస్టులో… నమ్మశక్యం కాని రీతిలో…
ఇది ఎందుకు రాయాల్సి వస్తున్నదంటే… పేరుకు నో బ్రోకర్ సిస్టం అంటాయి కొన్ని ప్రభుత్వ శాఖలు, కానీ ఆచరణలో మరింత సంక్లిష్టం చేస్తాయి, అదే దళార్లకు ఇంకా అవకాశం ఇవ్వడానికి… ప్రబలమైన ఉదాహరణ తెలంగాణ రవాణా శాఖ… బ్రోకర్ సాయం లేకుండా ఏ చిన్న పనీ సాధ్యం కాదు… బోలెడు రిఫామ్స్ కు చాయిస్ ఉంది… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు గానీ… ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసుల సమర్థ కలయిక ప్లస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉంటే పబ్లిక్ సర్వీసెస్ ఎంత సింప్లిఫై అవుతాయో చెప్పడానికి పాస్‌పోర్టు సేవల సరళీకృతమే సూపర్ ఉదాహరణ…!!
Share this Article