ఈటీవీ స్వరాభిషేకంలో మాళవిక పాడుతోంది… ఛాంగురే బంగారురాజా… ఏ పదానికి ఏ అర్థవంతమైన భావాన్ని పలికించాలో, ఎలా ఉచ్చరించాలో బాగా తెలిసిన శ్రావ్యమైన గొంతు… మధురం… కైపున్న మత్స్యకంటి చూపు పదాల దగ్గర స్పష్టంగా భావాన్ని పలికించింది… చాలామంది మచ్చకంటి చూపు అని పాడేయడం విన్నాను… లిరిక్స్ సైట్లు కూడా అలాగే రాసుకున్నాయి… ఈ మచ్చ ఉన్న కన్ను ఏమిటి..? అంతటి సినారె అలా రాశాడేమిటో అనుకునేట్టు..! కానీ అది మత్స్యకంటి చూపే…
అంటే చేపకళ్ల పిల్ల వలపుచూపు… అది పచ్చల పిడిబాకుకన్నా పదునైనదీ అంటాడు సినారె… రాజుల కాలంలో పచ్చల పిడిబాకు పదునుకు పేరు కదా… అసలు ఆ ట్యూన్ ఆ పచ్చల పిడిబాకులాగే ఎవర్ గ్రీన్… ఆపాట మధురం… ఒకసారి వింటే కొంతసేపు చెవుల్లో గింగురుమంటూ, నాలుకపైకి వచ్చేస్తుంటుంది… సంగీత దర్శకుడు టీవీరాజుకు మస్తు పేరు తెచ్చిన పాట… ఆ పాట తన కోసమే పుట్టిందేమో అన్నట్టు పాడింది జిక్కి… ఎన్టీయార్ స్వీయదర్శకత్వం… సొంత సినిమా… శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ద్విపాత్రాభినయం… ఆ భీముడి పాత్రధారి ఉదయకుమార్ గురించి పెద్దగా తెలియదు… కానీ టాప్ మూవీ…
ప్రత్యేకించి ఈ చాంగురే పాటలో సినారె కొన్ని పదప్రయోగాలు చేశాడు… ఒకసారి ఆ పాట చదవండి… చాంగురే, మజ్జారే, అయ్యారే వంటి పదాలన్నీ ట్యూన్‌కు సరిపడా సౌండింగ్ కోసమే రాసినట్టున్నాడు… వాటికి అర్థాలేమీ ఉండవు… కానీ పాపులర్ కావడంతో ఎన్టీయార్ తిరిగి అలాంటి చాలా పదాల్ని దానవీరశూరకర్ణలో వాడుకున్నాడు… అంతేకాదు…
Ads
చాంగురే… చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా అయ్యారే….
అయ్యారే….నీకే మనసియ్యాలని వుందిరా
చాంగురే… చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్ల నీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే… చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా…
చాంగురే… చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
గుబులుకునే కోడెవయసు లెస్స
దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా కైదండ లేక నిలువలేనురా
చాంగురే… చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
సాధారణంగా పాటలన్నీ మహిళల వర్ణనతో ఉంటాయి… ఏవేవో పోలికలతో అంగాంగం వర్ణిస్తారు రచయితలు, కవులు… కానీ ఇది పురుషుడిపై కైపుతో ఉన్న ఓ మహిళ తనను వర్ణిస్తూ పాడుతుంది… మస్తు ఉన్నవ్, వచ్చి జల్ది అలుముకోరా అంటూ వెంటపడుతుంది… అయితే పాటలో మగరేడు అనే పదాన్ని సినారె ఎందుకు వాడాడో తెలియదు… రేడు అంటేనే రాజు, మన్మథుడు తదితర అర్థాలున్నయ్… మళ్లీ మగ ఎందుకు..? ఆడరేడు ఉండదు కదా… మగమన్మథుడా అని పిలిచినట్టుంది…
వగకాడు అనేది సొంపైన పదప్రయోగం… వగలాడి స్త్రీలింగమైతే వగకాడు పుంలింగం అన్నమాట… విలుకాడు తరహాలో…! మొలకమీసం అనేదీ మంచి ప్రయోగమే… అప్పుడప్పుడే మొలుస్తున్న నూనూగు మీసాల ప్రాయంవాడా అని పిలవడం… (అఫ్ కోర్స్, అక్కడ ఆ నటుడిది ముదురు ఫేసు, మెలితిరిగిన మీసాలే)… సింగపు నడుము అనే పదాల్ని సింహమధ్యముడికి సరళీకృతరూపం అనుకుందాం… కానీ జిగీ బిగీ మేను, సొగసులొలుకు మోము… సరిగ్గా ట్యూన్‌లో అమిరాయి గానీ… సొగసు అనే పదాన్ని ఎక్కువగా స్త్రీలకే వాడుతుంటారు… లాలిత్యం పదంలాగా… మజాక్‌కు చెప్పాలంటే అది స్త్రీపదం…
భీముడిది దృఢమైన దేహం… బాడీ బిల్డర్… ఎత్తు, లావు… ఈ జిగీబిగీ పదం ఆ దేహానికి ఎలా సూటయిందో రాసిన సినారెకు తెలియాలి… ఏదో ఫ్లోలో చల్తా అనుకున్నాడేమో… పచ్చల పిడిబాకో, విచ్చిన పువురేకో, గుచ్చుకుంటే తెలుస్తుందిరా అనే పదాల్ని ఆ పాట మూడ్‌కు తగినట్టు భలే విసిరాడు… రసికుడు… ఆ సినిమాలో బోలెడు పద్యాలు, ప్రియురాల సిగ్గేలనే, మత్తువదలరా వంటి హిట్ పాటలున్నా… చాంగురే పాటే సూపర్ హిట్…!!
Share this Article