Bharadwaja Rangavajhala……… జయకృష్ణా ముకుందా మురారీ… సినీ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడుగా టి.వి.రాజు మోస్ట్ పాపులర్. జానపద సినిమాల్లో పాశ్చాత్య సంగీతం వినిపించడం … జానపదగీతాల్లో వెస్ట్రన్ బీట్స్ జోడించడం, హిందూస్థానీ సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వడం… ఇలా ఒకటేమిటి… అనేక ప్రయోగాలు. ఇన్ని చేసిన సంగీత దర్శకుడు తోటకూర వెంకటరాజు.
టి.వి.రాజు అధికంగా ఎన్టీఆర్ చిత్రాలకే సంగీతం కూర్చారు. ఇద్దరూ ఒకే సమయంలో చెన్నైలో కాలు పెట్టడంతో పాటు ఇద్దరూ కల్సి ఒకే గదిలో ఉండడం కారణం కావచ్చు. ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో తీసిన తొలి చిత్రం పిచ్చిపుల్లయ్య కోసం అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారు రాజుగారు. ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై అంటూ ఘంటసాల, బాలసరస్వతి యుగళంలో వినిపించే పాట అజరామరం.
ఎన్టీఆర్ ప్రయోజనాత్మకంగా తీసిన రెండు చిత్రాలు పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు బాక్సాపీసు దగ్గర దెబ్బతినడంతో అనివార్యంగా కత్తి పట్టి జానపదం చేశారు. యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు జయసింహ. వహీదా రెహమాన్ హీరోయిన్. ఆ సినిమాను మ్యూజికల్ గా కూడా సక్సస్ చేసిన ఘనత రాజుగారిదే. ఈనాటి ఈ హాయి లాంటి అపురూప గీతాలు జయసింహను జనం మదిలో నిక్షిప్తం చేశాయి.
Ads
రాజుగారికి హిందుస్థానీ సంగీతం మీద పట్టుంది. అలాగే మరాఠీ నాటక బాణీలతోనూ పరిచయం ఉంది. దీంతో ఆయన చేసే భక్తి గీతాల మీద ఆ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా పాండురంగమహత్యం కోసం రాజుగారు స్వరపరచిన జయ కృష్ణా ముకుందా మురారీ గీతం. రాజుగారి కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అది. ఘంటసాల ఆలపించిన ఈ గీతం విన్న ప్రతి హృదయం దేవాలయం అయితీరుతుంది.
మెలోడీ మిస్ కాకుండా మాస్ గీతాలు తీర్చిదిద్దడంలో టీవీ రాజు నంబర్ ఒన్. ఒక రకంగా ఆయన రెండున్నర దశాబ్దాల పాటు మాస్ హృదయాలను ఏలారు. ఎన్టీఆర్, కాంతారావుల జానపద చిత్రాలకు అద్భుతమైన బాణీలు ఇచ్చారు. జానపద చిత్రాలను మ్యూజికల్ హిట్స్ చేశారు. మంగమ్మ శఫథంలో నా రాజు పిలిచెను పాట ఒక్కటి చాలు … రాజుగారి స్టైల్ చెప్పడానికి.
హిందీ పాటలను ఎక్కువగా అనుకరించేవారనే విమర్శ టి.వి.రాజు మీద ఉంది. నిర్మాతల ఒత్తిడి మేరకు కొన్ని సందర్భాల్లో హిందీ బాణీలను అనుకరించినా… వాటిని పల్లవుల వరకే పరిమితం చేసేవారు. చరణాలు మాత్రం తనదైన పద్దతిలో చేసే ప్రయత్నం చేసేవారు. భలేతమ్ముడు చిత్రంలో పాటలన్నిట్లోనూ ఈ ధోరణే కనిపిస్తుంది. రఫీతోనే పాడించినా… చరణాలు మాత్రం తన స్టైల్లోనే వినిపిస్తాయి.
మోహన, భీంప్లాస్, మాల్‌కోస్ రాగాలకు తన పాటల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు టి.వి.రాజు. అలాగే తక్కువ ఇన్‌స్ట్రమెంట్స్‌తో చక్కని పాటలకు రూపకల్పన చేసేవారు. రంగస్థలానుభవం ఉండడంతో పాటు… ఆదినారాయణరావు దగ్గర శిష్యరికం చేయడంతో ఆయన చేసే ట్యూన్స్ ఎక్కువగా జనరంజకమైనవే ఉండేవి.
పాండురంగమహత్యంలో వన్నెల చిన్నెల నెరా పాటగానీ… శ్రీ కృష్ణ పాండవీయంలోని చాంగురే బంగారు రాజా పాటగానీ… వినడానికి ఇంపుగా ఉండడమే కాదు… పాడుకోవాలనిపించేలా ఉంటాయి. టి.వి.రాజు మోడ్రన్ ఇన్స్‌ట్రుమెంట్స్ వాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపించేవారు. ఆయన పాటల్లో ఎక్కువగా గిటార్ వినిపిస్తుంది.
వెస్ట్రన్ స్టైల్స్ గురించి తెల్సుకున్నా… ఆ ప్రభావంతో ట్యూన్స్ కట్టినా తప్పేం లేదనేవారు టి.వి.రాజు. అయితే వాటిని మన నేటివిటీలోకి తీసుకురాగలిగితే మంచిదనే సూచన మాత్రం చేసేవారు. తను చేసిన జానపద చిత్రాల్లో పాటలన్నీ హిట్టే. పాటల కోసమే ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తున్నారు జనం.
భక్తిపాటలు స్వరపరచడంలో టీవీరాజు చాలా స్పెషలిస్టు. పాండురంగమహత్యంలోనే కాదు… చాలా సాంఘిక చిత్రాల్లోనూ ఆయన భక్తిగీతాలను ట్యూన్ చేశారు. కాంతారావు హీరోగా చేసిన దేవకన్య చిత్రం కోసం టీవీ రాజు స్వరకల్పనలో వచ్చే వీటూరి గీతం ఈశా గిరీశా మహేషా ఇప్పటికీ శివరాత్రి పర్వదినంలో వినిపిస్తూనే ఉంటుంది.
ఎమోషనల్ గీతాలు చేయడంలోనూ టి.వి రాజు సిద్దహస్తులు. హేమాంబరదరరావు తీసిన కథానాయకుడు చిత్రంలో టి.వి రాజు ఓ బ్రహ్మాండమైన పాటను ట్యూన్ చేశారు. ఇంతేనయా తెలుసుకోవయా అంటూ ఓ సూపర్ ఎమోషనల్ సాంగ్ కు బాణీ కట్టారు టీవీ రాజు. ఆ సినిమాకు ఆ పాట ఎంత ప్రత్యేకమంటే… రాజుగారు స్వరపరచిన ఆ పాటను బ్లాక్ అండ్ వైట్ లో తీయబుద్దేయక కలర్ కు మారారు నిర్మాతలు.
ఎన్.టి.ఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న రాజుగారు… అనివార్య కారణాలతో రెండేళ్లు ఎన్.టి.ఆర్ కు దూరంగా ఉన్నారు. ఎన్.టి.ఆర్ పెద్ద కుమారుడు చనిపోయిన సందర్భంలో పలకరించడానికి వెళ్లి అక్కడే ఉండిపోయారు టి.వి.రాజు. ఆ తర్వాత పాత విషయాలు మరచిపోయి తల్లా పెళ్లామా లాంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. తల్లా పెళ్లామా మూవీలో ఓ బంగారు గూటిలోని చిలుకా… పాటలో మధ్యలో వచ్చే ఇంగ్లీష్ పదాలను నటి చంద్రకళతోనే అనిపించేశారు.
ఒక రకంగా చక్రవర్తికి ముందు ఎన్టీఆర్ సినిమాల్లో మాస్ ట్యూన్లు వినిపించిన ఘనత టి.వి.రాజుకే దక్కుతుంది. తిక్క శంకరయ్యలో ఘంటసాల సుశీల పాడిన హైసరబజ్జ బుల్లెమ్మ పాట థియేటర్లలో జనాన్ని కూర్చోనివ్వలేదు. నాటకాల బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో పాటు పరమోద్దేశ్యం ఆడియన్స్ తో ఈల కొట్టించడమే అనే సత్యం రాజుగారికి బాగా బోధపడింది…
Share this Article