పెద్ద సారు జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే… ఆ జిల్లా, ఆ శాఖ సిబ్బందిలో ఒకటే టెన్షన్… ఏదో వృత్తిపరమైన, శాఖాపరమైన, ప్రభుత్వపరమైన, ప్రజాసంబంధమైన టెన్షన్ కాదు… సార్ వెంట ఎవరెవరొస్తారు..? ఏం తింటారు..? రాత్రి బస చేయాల్సి వస్తే, సారుకు ‘ఏమేం ప్రత్యేక ఏర్పాట్లు’ చేయాలి..? తగ్గితే తమ సిబ్బందికి తనపట్ల మర్యాద లేదని కోపం పెంచుకుంటారు… మర్యాద మరీ ఎక్కువైతే, ఏ యూట్యూబ్ గొట్టానికే దొరికిపోతే అదొక తల్నొప్పి… ఇదీ టెన్షన్…
సాధారణంగా మన అధికార వ్యవస్థలో సహజమే అంటారా..? కానీ ఈ పెద్ద సారు సంగతి చూడండి… పేరు ప్రవీణ్ ప్రకాశ్… ఒక దశలో ఏపీ యాక్టింగ్ సీఎంగా సీఎంవోను అక్షరాలా ఏలాడు… ఓసారి చీఫ్ సెక్రెటరీనే తన కొలువు నుంచి తీసిపారేశాడు అంటే సారు గారు ఎంతటి ప్రభావవంతులో అర్థమైంది కదా… అదీ మరి… సారు అంటే అప్పట్లో హడల్… కానీ మధ్యలో ఎటో వెళ్లి, నాటి ప్రాభవాన్ని, ప్రభావాన్ని, పలుకుబడిని కోల్పోయి, మళ్లీ ఏపికి వచ్చిపడి, పాఠశాల విద్యా శాఖ పగ్గాలు పట్టుకున్నాడు ప్రస్తుతం…
ప్రవీణ్ ప్రకాష్ అంటేనే ఏ ఉత్తర్వు, ఎంత వింతగా విడుదలవుతుందో తెలియదు… తాజాగా సారు గారు తన మెనూ ఏమిటో, తన భోజన అలవాట్లు ఏమిటో, తను ఎంత నిరాడంబరుడో వివరిస్తూ అన్ని జిల్లాలకూ అధికారిక సమాచారాన్ని రిలీజ్ చేశాడు… ఎందుకయ్యా అంటే… అనవసరంగా తనకు మర్యాదలు చేయడానికి, ప్రోటోకాల్ పేరిట విద్యాశాఖ అధికారులు సమయాన్ని, డబ్బును వృథా చేయకూడదు అట…
Ads
సారు ఎంత నిక్కచ్చి మనిషి, ఎంత పర్‌ఫెక్షనిస్టు అంటే… తనకు టీతోపాటు ఇచ్చే బిస్కెట్లు ఏ బ్రాండ్‌వి ఉండాలో కూడా చెప్పాడు ఆ ఆదేశాల్లో… ఉదయం ఫాస్ట్ బ్రేకడానికి జస్ట్, దోశ, ఇడ్లీ చాలు… చట్నీ చాలు, ఉల్లి దోశ లేదంటే ప్లెయిన్ దోశ… మసాలా దోశ, షెజువాన్ దోశ, చీజ్ బట్టర్ దోశ వంటి దోశవేషాలు కుదరవు… మధ్యాహ్నం పుల్కా, చపాతీ… ఏ వెజిటబుల్ కూర అయినా పర్లేదు… మాంసం, డ్రైఫ్రూట్లు, పళ్లు, పళ్లరసాలు అక్కర్లేదు… మళ్లీ రాత్రి కూడా సేమ్ లంచ్ టైపే… జస్ట్, రెండోమూడో పుల్కాలు, కాదంటే చపాతీలు…
ఇలాంటి ఆదేశాలు మా కెరీర్‌లోనే చూడలేదంటూ దిగువ స్థాయి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కొందరు నవ్వుకుంటుంటే… ఈ ఆదేశాల్లో కూడా అర్థం కాని మర్మం, పరోక్ష కర్తవ్యబోధన ఇంకేమైనా ఉందా అని మరికొందరు జుత్తు పీక్కుంటూ ఆలోచనల్లో పడ్డారుట… సార్, ప్రవీణ్ గాంధీ ప్రకాష్ గారూ… అంతా బాగానే ఉంది గానీ, తమకు అంతటి ‘ఆదర్శ మూర్తులు’ అయితే తమరు దిగిన గెస్ట్ హౌజు వాచ్‌మెన్‌కు లేదా తమ ఎంట్రీ పుణ్యం దక్కిన హోటల్ బాయ్‌కు జేబులో నుంచి ఓ వంద నోటు ఇస్తే… ఈ పుల్కాలు, చపాతీలు తెచ్చి పెట్టరా..? రెండు బిస్కెట్ పాకెట్లు తీసుకురారా..? దీనికి మళ్లీ ప్రోటోకాల్ మెనూ ఆదేశాలు ప్రత్యేకంగా ఎందుకు..? ఈ ఆహార అతిప్రదర్శన దేనికి..?! ఇది కూడా జగన్ సలహాదారుల నియామకంలా ప్రపంచ స్థాయి విడ్డూరంలాగే ఉంది సుమీ…!!
Share this Article